
150వ చిత్రమని ముందు తెలీదు!
– అర్జున్
‘‘నేను చిత్ర పరిశ్రమకి వచ్చి 36 ఏళ్లవుతోంది. ‘జైహింద్–2’ తర్వాత నేను హీరోగా చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇది నా 150వ చిత్రమని తెలీదు. చిత్రీకరణలో ఉన్నప్పుడు తెలిసింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’’ అని నటుడు అర్జున్ అన్నారు.
ఆయన హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మించిన ‘కురుక్షేత్రం’ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అర్జున్ మాట్లాడుతూ – ‘‘బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయకూడదనుకున్నా. కానీ, కథ విన్నాక చేసే తీరాలనుకున్నా. ఇప్పటివరకు 20–30 సినిమాల్లో పోలీస్‌గా నటించాను. కానీ, ఆ సినిమాల్లో లేని అంశాలు ఇందులో ఉన్నాయి.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘అర్జున్‌గారు గొప్ప నటుడే కాదు. అందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాలో నేను నటించడం గౌరవంగా భావిస్తున్నా. తెలుగులో ‘జవాన్’ చిత్రంలో విలన్‌గా చేస్తున్నా’’ అని నటుడు ప్రసన్న అన్నారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు తెలిపారు. అరుణ్ వైద్యనాథన్, సహ నిర్మాత అరుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి: సంగీతం: నవీన్, నిర్మాణం: ప్యాషన్ స్టూడియోస్.