
టార్గెట్ శ్రుతి!?
ప్రముఖ నటి, దర్శకుడు సుందర్. సి సతీమణి ఖుష్బూ టైమ్ చూసి ట్విట్టర్‌లో పెద్ద బాంబు పేల్చారు.
ప్రముఖ నటి, దర్శకుడు సుందర్. సి సతీమణి ఖుష్బూ టైమ్ చూసి ట్విట్టర్‌లో పెద్ద బాంబు పేల్చారు. అదీ ఓ రేంజ్‌లో! ఖుష్బూ బాంబు వేసింది శ్రుతీహాసన్‌పైనే అనేది చాలామందికి అర్థమైంది. కానీ, ఎక్కడా శ్రుతి పేరు లేకుండా ఖుష్బూ బాంబు వేయడం గమనార్హం! మేటర్‌లోకి వెళితే... బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వని కారణంగా సుందర్. సి తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’ నుంచి తప్పుకున్నానని శ్రుతీ పేర్కొన్న సంగతి తెలిసిందే. శ్రుతీ ఆరోపణలపై చాలా రోజుల తర్వాత ఖుష్బూ స్పందించారు. ‘‘సరైన ప్లానింగ్ లేకుండా ‘సంఘమిత్ర’ వంటి భారీ బడ్జెట్ సినిమా తీయలేం.
ఎవరో ‘సంఘమిత్ర’ స్క్రిప్ట్ రెడీ కాలేదంటూ ఆరోపణలు చేయడం విన్నా. గత రెండేళ్లుగా ఈ సినిమా వర్క్ జరుగుతోంది. అన్–ప్రొఫెషనల్స్‌కి అది అర్థం కాదు. ‘సంఘమిత్ర’ వంటి సినిమాలకు షూటింగ్ అనేది 30 శాతం మాత్రమే. షూటింగ్‌కి ముందే 70 శాతం వర్క్ పూర్తవుతుంది’’ అని ఖుష్బూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇవన్నీ శ్రుతీని ఉద్దేశించినవే అని కోలీవుడ్ టాక్! ‘‘ఓ లెగస్సీ (కమల్‌హాసన్ వారసత్వం?) కొనసాగిస్తున్న వారినుంచి కొంచెం ప్రొఫెషనలిజమ్ ఆశించా. నీ (బహుశా శ్రుతీని ఉద్దేశించే అయ్యుంటుంది) తప్పులను హుందాగా అంగీకరిస్తే, ఇంకా ఎంతో దూరం వెళ్తావు’’ అని ఖుష్బూ చురకలు అంటించారు.