కుట్రపరంపరై దర్శకుడు ఎవరు?
ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య వార్ జరుగుతోందన్న ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. సీనియర్ దర్శకుడు కే.బాలచందర్ తరువాత ఆ స్థాయి దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన వ్యక్తి భారతీరాజా. ఇక అతి తక్కువ చిత్రాలతోనే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న దర్శకుడు బాలా. తరాల అంతరం ఉన్నా వీరిద్దరికి కోలీవుడ్‌లో సముచిత స్థానం ఉంది. అలాంటి భారతీరాజా, బాలాల మధ్య పోరు జరగడం ఏమిటీ?అన్నదేగా మీ సందేహం.
ఇటీవలే బాలా తన తాజా చిత్రం తారైతప్పట్టై చిత్రాన్ని విడుదల చేశారు. తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన కుట్రపరంపరై అనే సంచలన నవలను తెరకెక్కించనున్నట్లు, అందులో ఆర్య, విశాల్, అరవింద్‌సామి, రానా, అధర్వ, అనుష్క నటించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ కుట్రపరంపరై కథతో చిత్రం చేయాలని దర్శకుడు భారతీరాజా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. రచయిత రత్నకుమార్‌తో కలిసి దాని స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేశారు.
ఇది ఆంగ్లేయులు మనల్ని పాలిస్తున్న కాలంలో మన ముందు తరం వారు చేసిన పోరాట ఇతి వృత్తం కావడంతో వారిని గౌరవించే విధంగా గొప్పగా తెరపై ఆవిష్కరించాలని భారతీరాజా భావించారట. అలాంటిది బాలా ఆ కథను హ్యాండిల్ చేయడానికి తయారవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఒకరి కథను మరొకరు దర్శకత్వం వహించాలనుకోవడం దురదృష్టకరం అని భారతీరాజా పేర్కొనట్లు తెలిసింది.
అంతే కాదు బాలాను పిలిచి కుట్రపరంపరై కథను తెరకెక్కించడానికి మీకు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించినట్లు అందుకు బాలా రచయిత వేల్ రామమూర్తినే తనకు కథను ఇచ్చారని బదులిచ్చినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య వార్ జరుగుతోందని కోలీవుడ్ టాక్. ఇక కుట్ర పరంపరై కథను తెరపై చిత్రంగా మలిచే దర్శకుడెవరన్నది ఆసక్తిగా మారింది.