గౌతమ్ కార్తీక్‌తో లావణ్య త్రిపాది
మాజీ మిస్ ఉత్తరాఖండ్ లావణ్య త్రిపాదికి కోలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో పాగా వేసిన ఈ సుందరికి తమిళంలో శశికుమార్ సరసన బ్రహ్మన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో అవకాశం తలుపుతట్టింది. పోడాపోడి దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజాగా యువ క్రేజీ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా చిత్రం చేయనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నానుమ్ రౌడీదాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్న ఈ చిత్రంలో గౌతం కార్తీక్ సరసన లావణ్య త్రిపాది నటించనున్నారు.
ఇందులో ఈ భామ బధిర (వినికిడి శక్తిని కోల్పోయిన) యువతి పాత్రలో నటించనున్నారట. దీని గురించి ఈ పూర్వ మిస్ ఉత్తారాఖండ్ తెలుపుతూ చిత్ర కథ వినగానే ఎంతగానో నచ్చేసిందన్నారు. ఇందులో తాను బధిర యువతిగా నటించనున్నట్లు చెప్పారు. నటనకు అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. అందులోనూ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్న చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళంలో తన తొలి చిత్రం బ్రహ్మన్ నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయని లావణ్య త్రిపాది చెప్పారు