ఆ ముగ్గురి తర్వాతే నేను - లారెన్స్
‘‘ఈ చిత్రంలో కథే మొదటి హీరో రెండో హీరో రితికా సింగ్ (హీరోయిన్), మూడో హీరో శక్తివాసు. ఆ ముగ్గురి తర్వాతే నేను. నాలుగో హీరో అన్నమాట’’ అన్నారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు, తమిళ చిత్రం ‘శివలింగ’. రితికా సింగ్ హీరోయిన్. తెలుగులో రమేశ్ పి.పిళ్లై, తమిళంలో రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో పాటల్ని, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. లారెన్స్ మాట్లాడుతూ - ‘‘ఇప్పుడు చాలా చిత్రాల్లో ఇంటర్వెల్ దగ్గర అసలు కథ మొదలవుతోంది.
కానీ, ఈ చిత్రంలో మొదటి సీన్ దగ్గరే కథ మొదలవుతుంది. రజనీకాంత్‌గారి దర్శకుడితో పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. పి.వాసు మాట్లాడుతూ - ‘‘పదేళ్ల క్రితం నేను కన్నడలో తీసిన ‘ఆప్తమిత్ర’ను తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’గా రీమేక్ చేశా. పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా కన్నడలో నేను తీసిన ‘శివలింగ’కి రీమేక్. నా కుమారుడు శక్తివాసు నటించిన తొలి తెలుగు చిత్రమిది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, నిర్మాతలు రమేశ్ పి.పిళ్లై, రవిచంద్రన్, డీఓపీ సర్వేశ్ మురారి, నటుడు శక్తివాసు పాల్గొన్నారు.