శివలింగ ఘోస్ట్‌ స్టోరీ | lawrence 'sivaganga' cinema review | Sakshi
Sakshi News home page

శివలింగ ఘోస్ట్‌ స్టోరీ

Published Sat, Apr 15 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

శివలింగ ఘోస్ట్‌ స్టోరీ

శివలింగ ఘోస్ట్‌ స్టోరీ

రివ్యూ: శివలింగ

చిత్రం: ‘శివలింగ’
తారాగణం: రాఘవా లారెన్స్, రితికా సింగ్, ఊర్వశి, వడివేలు...
కెమేరా: సర్వేష్‌ మురారి
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
నిర్మాతలు: రమేశ్‌ పి. పిళ్లై,
మల్కాపురం శివకుమార్‌
రచన–దర్శకత్వం: పి. వాసు
విడుదల తేదీ: 14–ఏప్రిల్‌–2017


వామ్మో... దెయ్యాలను ఇంత డీప్‌గా లవ్‌ చేసేస్తున్న మనుషుల్లో రాఘవా లారెన్స్‌ లాంటోడు మనకు ఇంకెవరూ కనిపించరేమో! వాటిపై అంత ప్రేమ ఎందుకుండదు? హారర్‌ ఫ్రాంచైజీ ‘ముని’తో మనోడి బ్యాంక్‌ అకౌంట్‌లో మనీ బాగానే పడింది కదా. భయపడినట్టు నటిస్తూనే బంపర్‌ హిట్స్‌ కొట్టాడు. అందుకే, హారర్‌ సినిమాలంటే లారెన్స్‌కి లవ్వు. లేటెస్ట్‌గా ఈ శుక్రవారం మరో హారర్‌ సినిమా ‘శివలింగ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి లారెన్స్‌ డైరెక్షన్‌ చేయలేదు. లకలకలక.... ‘చంద్రముఖి’తో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన పి. వాసు దర్శకుడు. ఈ హారర్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఇద్దరూ కలసి చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఓ లుక్కేయండి!

కథ: శివ... శివలింగేశ్వర్‌ (రాఘవా లారెన్స్‌)... ఓ సీబీ–సీఐడీ ఆఫీసర్‌. మనోడు కేసు టేకప్‌ చేస్తే క్రిమినల్స్‌కి టెర్రరే. భయం అనేది శివ బాడీ లాంగ్వేజ్‌లోనూ, బ్లడ్‌లోనూ ఎక్కడా లేదు. కింగ్‌లాంటి మనోడి దగ్గర ఓ టాపిక్‌ తెస్తే చలిజ్వరం వచ్చిన పేషెంట్‌లా గజగజ వణుకుతాడు. హారర్‌ అంటే మనోడికి టెర్రర్‌. కానీ, కవర్‌ చేస్తుంటాడు. అలాంటోడికి భయపడుతూ హారర్‌ సినిమాలు చూసి ఎంజాయ్‌ చేసే అమ్మాయి సత్య (రితికా సింగ్‌)తో పెళ్లవుతుంది. కొత్తగా పెళ్లైంది... కుర్రాడు హనీమూన్‌కి వెళ్లి, సరదాగా ఎంజాయ్‌ చేస్తాడనే ఆలోచన కూడా ఉండదు సీబీ–సీఐడీ వాళ్లకు. ఎవరో రహీమ్‌ (శక్తీ వాసు) అనే వంటోడి మర్డర్‌ కేసు చిక్కుముడి విప్పమని శివ చేతిలో ఫైల్‌ పెడతారు. కొత్తగా మూడు ముళ్లు వేసినోడు... ఓ చేత్తో పెళ్లాం చేయి, మరో చేత్తో కేసు ఫైలు పట్టుకుని ఆ చిక్కుముడి ఏదో విప్పడానికి వరంగల్‌ వెళతాడు. ఇంతకీ, వరంగల్‌ ఎవరి ఊరో తెలుసా? శివ అత్తా్తరిది.

కానీ, వాళ్లింటికి వెళ్లడు శివ. కొత్త పెళ్లి కొడుక్కి ఏవేవో కోరికలుంటాయి. పైగా, కేసు పనొకటి ఉంది. అందువల్ల, ఊరి చివర పెద్ద బంగ్లాలో అద్దెకు దిగుతాడు. ఇల్లు బాగుంటుంది గానీ... పెద్ద ప్రాబ్లెమ్‌ వచ్చి పడుతుంది. అదేంటంటే... ఇంటి వెనక శ్మశానం ఉంటుంది. అది చూసి దెయ్యాలంటే భయపడే శివకు సుస్సు వెళ్లినంత పనవుతుంది. వేరే ఇల్లు చూసుకుందామంటే... పెళ్లాం వద్దంటుంది. అంతకుముందు తనకు భయాలూ గట్రా లేవని పెళ్లాం ముందు ఫోజులు కొడతాడు. ఇప్పుడు ఆమె చెబితే వినాలి కదా! దాంతో కేసు క్లోజ్‌ చేసే వరకూ చచ్చినట్టు శ్మశానం పక్కన ఆ బంగ్లాలో కాపురం పెట్టాలని ఫిక్స్‌ అవుతాడు. అప్పుడు మొదలవుతుంది మనోడికి అసలు సిసలైన మ్యూజిక్‌. ఏ రహీమ్‌ మర్డర్‌ కేసులో హంతకులను పట్టుకోవాలని వరంగల్‌ వచ్చాడో... ఆ రహీమ్‌ ఆత్మ సత్య బాడీలోకి వస్తుంది. ఏదో కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొని గృహ ప్రవేశం చేసినట్టు... నీ పెళ్లాం శరీరం లోంచి బయటకు వెళ్లనంటుంది. నన్ను చంపినోళ్లను పట్టుకునే వరకూ నిన్ను సుఖంగా కాపురం చేయనివ్వనని శపథం చేస్తుంది.

పెళ్లాంపై ప్రేమ ఓ పక్క... దెయ్యాలంటే భయం మరోపక్క... సడన్‌ షాక్‌ ఒకటి. షాక్‌ నుంచి తేరుకుని మనోడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు. ఓ పావురం హెల్ప్‌తో కేస్‌ క్లోజ్‌ చేస్తాడు. మరీ సిల్లీ కాకపోతే... పావురం హెల్ప్‌ తీసుకోవడం ఏంటండీ? అనే డౌట్‌ రావొచ్చు. హారర్‌కి ఎమోషన్‌ ఇంపార్టెంట్‌ గానీ... లాజిక్‌ అవసరమా? చెప్పండి! అసలు పావురం ఎలా హెల్ప్‌ చేసింది? రహీమ్‌ను మర్డర్‌ చేసింది ఎవరు? అతని కథేంటి? ఈ కేసును శివ ఎలా సాల్వ్‌ చేశాడు? అనేది 70ఎంఎం స్క్రీన్‌ మీద చూస్తేనే మజా!

విశ్లేషణ: స్టోరీ, స్క్రీన్‌ప్లే, సీన్స్, ఎక్స్‌ట్రా... ఎక్స్‌ట్రా... రొటీన్‌గా ఉన్నాయా? కొత్తగా ఉన్నాయా? అనే ప్రశ్నలు పక్కన పెడితే... సినిమా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లా పరిగెడుతుంది. సీన్, సాంగ్, ఫైట్‌... ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తాయి. మధ్యలో అక్కడక్కడా పి. వాసు భయపెట్టారు కూడా. ఇక, క్లైమాక్స్‌ ఫైట్‌లో గ్రాఫిక్స్‌ భలే ఉన్నాయి. అలవాటైన జానర్‌ కావడంతో రాఘవా లారెన్స్‌ రఫ్ఫాడించేశాడు. ‘గురు’ గాళ్‌ రితికా సింగ్‌ తన గ్లామర్‌తో సినిమాకి కిక్‌ ఇచ్చింది. దెయ్యంగానూ ఆమె ఫేస్‌ బాగానే సూటైంది. ‘రంగు రక్కర...’ పాటలో ఇంచుమించు లారెన్స్‌తో ఈక్వల్‌గా డ్యాన్స్‌ చేసింది. రహీమ్‌ పాత్రలో పి. వాసు తనయుడు శక్తి వాసు మంచి నటన కనబరిచాడు. హారర్‌ సినిమా లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంటుందీ సినిమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement