
మాస్టర్, విక్రమ్,లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందే నిర్మాతగా మారి ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేశారు. కాగా తాజాగా రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'బెంజ్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకేష్ కనకరాజ్ కథను అందించినప్పటికీ ఈ చిత్రానికి రెమో (శివకార్తికేయన్), సుల్తాన్ (కార్తి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను నటుడు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం ద్వారా నూతన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను పరిచయం చేస్తున్నారు. గతంలో ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ కుమార్, సత్య.సీ వద్ద పలు చిత్రాలకు ఆయన పనిచేశారు.

అదే విధంగా కట్చిచేర, ఆశ కూడ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లో పాడి సంగీతాన్ని అందించి పాపులర్ అయ్యారనేది గమనార్హం. లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా సీనీ రంగప్రవేశం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంతకంటే మంచి అవకాశం తనకు రాదన్నారు. దీంతో ఉత్సాహంతో, మరింత బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment