కోలీవుడ్ నటుడు,కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేరు చెప్పుకుని పలు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుపేదలకు లారెన్స్ సాయం చేస్తూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు దానినే ఆసరాగ చేసుకున్న ఈ కేటుగాడు పేదల నుంచి డబ్బు దోచుకునే ప్లాన్ వేశాడు.
పోలీసులు తెలుపుతున్న ప్రకారం.. చెన్నైలోని ఎగ్మూర్‌కి చెందిన వీరరాఘవన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారెన్స్ పేరుతో తనను మోసం చేశారని ఆయన చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు మొదట ఫోన్‌చేసి తాను రాఘవ లారెన్స్ వద్ద సహాయకుడిగా పనిచేస్తానని చెప్పి నమ్మించాడని వాపోయాడు. లారెన్స్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నారని, అందులో మీ బిడ్డ చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తారని చెప్పి ఆపై అందుకుగాను రూ.8,457 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరాడు. దీంతో తాను ఆ నగదు ఫోన్ పే ద్వారా చేశానన్నాడు.
అయితే, రెండురోజుల తర్వాత మళ్లీ అతను చెప్పిన మాటలు నమ్మి రెండు దపాలుగా రూ.2,875, రూ.50 వేలు పంపినట్లు తెలిపాడు. కానీ, అతనిపై అనుమానం కలగడంతో తన నగదు తిరిగివ్వాలని కోరడంతో అసలు నిజం బయటపడిందని వాపోయాడు. చాలాసార్లు కాల్ చేస్తున్నా కూడా రెస్పాండ్ కాకుండా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేలూర్‌లో ఉన్న దినేష్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించారు. ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకి అతన్ని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment