నా కుమారుడిని ఆశీర్వదించండి: లారెన్స్‌ | Raghava Lawrence Introduced His Son Shyam | Sakshi
Sakshi News home page

నా కుమారుడిని ఆశీర్వదించండి: లారెన్స్‌

Published Mon, Jul 1 2024 6:35 PM | Last Updated on Mon, Jul 1 2024 7:12 PM

Raghava Lawrence Introduced His Son Shyam

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు కోలీవుడ్‌లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కష్టాల్లో ఉన్న వారికి తనకు అందిన వరకు సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. తమిళనాడులో తన అమ్మగారి పేరుతో ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఎందరికో లారెన్స్‌ సాయం చేశారు. ఈ క్రమంలో గుండెజబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేపించి తన మంచి మనుసు చాటుకున్నారు.  

చాలామంది పేదలకు ఉపాధి కల్పించారు ట్రాక్టర్స్‌,బైక్స్‌,ఆటోలు, తోపుడు బండ్లు, వికలాంగులకు వాహనాలు ఎందరికో లారెన్స్‌ అందించారు. సినిమా స్టార్స్‌ అందరూ ఎప్పుడు తమ బిడ్డలను చిత్ర పరిశ్రమలోకి తీసుకుని వద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ లారెన్స్‌ అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇతరులకు సాయం చేసే తన సేవా గుణాన్ని వారసత్వంగా తన కుమారుడికి ఇచ్చారు. చిన్న వయసు నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటును పరిచయం చేపించారు. ఈ క్రమంలో లారెన్స్‌ ఒక వీడియో పంచుకుంటూ  ఇలా చెప్పుకొచ్చారు.

'అభిమానులకు, స్నేహితులకు విన్నపం.. వీడు మా అబ్బాయి శ్యామ్‌.. అప్పుడే పెద్దవాడు అయిపోయాడు. ప్రస్తుతం కాలేజీలో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడు. అయితే, గత పదేళ్లుగా నేను హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం నా వంతు డబ్బు సాయం చేస్తున్నాను. తమిళనాడులోని రాయపురంలో ఉన్న హెప్సిబా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంది. ఇప్పుడు, హెప్సిబా కోసం శ్యామ్ ఈ సంవత్సరం స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడు. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి.' అని లారెన్స్‌ కోరారు. 

ఇప్పటి వరకు లారెన్స్‌ ఎందరికో సాయం చేశారు. ఇప్పుడు తన కుమారుడిని కూడా అదే మార్గంలో నడిపించాలని ఆయన పూనుకున్నారు. దీంతో నెటిజన్లు వారిద్దరినీ అభినందిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాఘవ 'స్పీడ్‌ డ్యాన్సర్‌'తో నటుడిగా మారారు. 'కాంచన' సిరీస్‌తో చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. రీసెంట్‌గా జింగర్తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన 'దుర్గ' చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement