
ఈ సంవత్సరం కపూర్ ఫ్యామిలీకి క్రిస్మస్ లంచ్ లేనట్టే. కేండిల్స్ వెలగవు. కేక్స్ షేర్ కావు. అందరూ నవ్వుకుంటూ ఎదురూ బొదురూ కూచుని శశికపూర్ పెదాల మీద విరిసే ఆ చిర్నవ్వును చూస్తూ భోం చేయలేరు. ప్రతి సంవత్సరం శశి కపూర్ కిస్మ్రస్‌కు కపూర్ కుటుంబ సభ్యులందరినీ తన ఇంటికి పిలిచి లంచ్ ఇస్తాడు. ఎవరు ఎక్కడ ఉన్నా తప్పక హాజరు కావాల్సిందే. ఇది తన గతించిన భార్య జెన్నిఫర్ జ్ఞాపకార్థం. జెన్నిఫర్ అంటే శశి కపూర్‌కు ప్రాణం. శశి కపూర్ అంటే కపూర్ కుటుంబానికి ప్రాణం. తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పులి. వెళ్లిపోయాడు. ఆయన కడుపున మూడు పులి పిల్లలు పుట్టాయి. రాజ్ కపూర్– వెళ్లిపోయాడు. షమ్మీ కపూర్– వెళ్లిపోయాడు. ఇక ఆ తరానికి ఆఖరు జ్ఞాపకంగా శశికపూర్ ఈ సాయంత్రం వరకూ ఉన్నాడు. వెళ్లిపోయాడు. ఈ డిసెంబర్ మాసంలో ఇది కరుకైన జ్ఞాపకం.
శశి కపూర్‌ని ఆ ఇంట్లో ‘హ్యాండ్‌సమ్ కపూర్’ అనేవారు. కారణం ఆ ఇంట్లో ఊబకాయం ఉంది. పృధ్వీరాజ్ కపూర్ ఆ వొంటితో బాధ పడ్డాడు. రాజ్‌కపూర్ తొందరగా దాని బారిన పడ్డాడు. షమ్మీ కపూర్ ముందు నుంచీ బొద్దు కపూరే. ఒక్క శశికపూరే చక్కగా, పలుచగా, చలాకీగా ఉండేవాడు. అందుకే అతడు హ్యాండ్‌సమ్. గమనించి చూడండి. అతడి కింద పళ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఆ రోజుల్లో కాస్మటిక్ డెంటిస్ట్రీ లేదు. అయినా తాను ఆ పళ్లను ఒక మేజిక్ వెనుక దాచి పెట్టగలిగాడు. ఆ మేజిక్– చిర్నవ్వు. శశికపూర్ ఎంత అందంగా నవ్వేవాడంటే ఆ నవ్వుకే అతడికి చాలామంది స్త్రీ అభిమానులు ఉండేవారు. రాజేష్ ఖన్నా ఫ్యాన్స్‌లో ఉడుకు నెత్తురు అమ్మాయిలు లోకానికి తెలుసు. కాని నిశ్శబ్దంగా అంతకు సమానమైన స్త్రీ అభిమానాన్ని పొందినవాడు శశికపూర్. అతడు ఇండియాకు శోభన్‌బాబు.
పృధ్వీరాజ్ కపూర్‌కు పెళ్లయ్యాక పదిహేనేళ్లకు పుట్టాడు శశి కపూర్. అతడికి ఊహ తెలిసే నాటికే రాజ్‌కపూర్, షమ్మీ కపూర్ తండ్రితో కలిసి సినిమా రంగంలో నాటక రంగంలో పని చేస్తున్నారు. శశికపూర్‌ను కూడా ఈ ఇంటి పురుగు కుట్టింది. చిన్న వయసులోనే బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. డిగ్రీని దాదాపు చదివినంత పని చేశాడు. ఆ తర్వాత అద్దం ముందు ముఖం చూసుకుంటూ నిలుచున్నాడు. కపూర్ కుటుంబంలో ఒక ఆనవాయితీ ఉంది. చెరువులో తోసి చోద్యం చూస్తుంటారు. ఎవరికివారు కష్టపడి పైకి రావాల్సిందే. రాజ్ కపూర్ అలాగే వచ్చాడు. షమ్మీ కపూర్ అలాగే వచ్చాడు. హీరోల తమ్ముడు... ‘శశి బాబూ’ అని పిలిచి గారం చేద్దాం అని బాలీవుడ్ కూడా అనుకోలేదు. ఎక్కే గడప దిగే గడపగా అతణ్ణి తిప్పి మూడు స్టూడియోల నీళ్లు తాగించింది. ఆ రోజుల్లో జేబులో రూపాయి లేకుండా టీకి ఠికానా లేకుండా శశికపూర్ తిరిగాడన్నది వాస్తవం. రూమ్మేట్, ఆ తర్వాతి కాలంలో ‘మిస్టర్ భారత్’ బిరుదాంకితుడైన మనోజ్ కుమార్‌తో కలిసి ముంబై ఆకాశంలో నక్షత్రాలను చూపుడువేలితో కలుపుతూ తమ భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఇద్దరూ కుడి ఎడమలుగా హీరోలయ్యారు. కాని శశికపూర్‌కు శాపం పట్టుకుంది. ఫ్లాపుల శాపం.
1961లో శశికపూర్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ధరమ్‌పుత్ర’ రిలీజయ్యింది. దేశ విభజన నేపథ్యంలో యశ్‌చోప్రా దర్శకత్వం వహించిన సినిమా అది. క్లీన్ ఫ్లాప్. ప్రారంభం అదిరిపోతేనే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ఫ్లాపంటే... ఆ తర్వాత శశికపూర్ సినిమాలు ఆరేడు రిలీజయ్యాయి. అన్నీ ఫ్లాప్స్. వీటిలో అతడు నటించిన ఇండో– ఇంగ్లిష్ సినిమాలు ‘ది హౌస్‌హోల్డర్’, ‘షేక్స్‌స్పియర్ వాలా’ వంటివి కూడా ఉన్నాయి. నడుమ వచ్చిన ‘వక్త్’ హిట్ అయినా దాని ప్రధానవాట రాజ్‌కుమార్, సునీల్‌దత్‌లు తన్నుకుపోయారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు కరువునైనా భరించవచ్చుకానీ హీరోయిన్ కరువును భరించలేరు. శశి కపూర్‌కు హీరోయిన్ కరువు వచ్చింది. ప్రతి హీరోయిన్ ‘అతనా... అతని పక్కన నేను చేయను. ఫ్లాప్ హీరో’ అని తప్పించుకోవడం మొదలుపెట్టారు. కాని అతనిలోని సరస్వతి దేవి అతణ్ణి చల్లగా చూసింది. వీణలోని నాలుగు తీగలు మీటి ఒక హీరోయిన్‌ని రప్పించింది. ఆ హీరోయిన్ అతడితో యాక్ట్ చేసింది. ఆ సినిమా రిలీజయ్యింది. ఆశ్చర్యం. సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. ఈ హిట్ శశి కపూరేనా ఆ ఫ్లాప్ శశి కపూర్ అని అందరూ మణికట్లు విదుల్చుకోవడం మొదలుపెట్టారు.
అలా అతడి దశను మార్చిన సినిమా– ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’.ఆ హీరోయిన్ నందా. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. దాంతో హీరోయిన్లు శశి కపూర్ ఎదుట క్యూలు కట్టారు. మన తెలుగు రాజశ్రీ అతడితో ‘ప్యార్ కియే జా’లో డ్యూయెట్స్ పాడింది. తర్వాతి కాలంలో అతడికి కోడలు వరసైన బబిత ‘హసీనా మాన్ జాయేగీ’లో ఎదపై వాలింది. ‘కన్యాదాన్’లో ఆశా పరేఖ్ ఏడడుగులు నడిచింది. ఫైనల్ టచ్‌ను కలకత్తా నుంచి వచ్చిన ఒక రసగుల్ల అమ్మాయి ఇచ్చింది. పేరు – రాఖీ. సినిమా ‘షర్మిలీ’. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత శశి కపూర్‌ను మరి కదిల్చేవారు లేకపోయారు.
పృధ్విరాజ్ సినీ వారసత్వానికి రాజ్ కపూర్, షమ్మీ కపూర్ ఉన్నారు. కాని తండ్రి నాటక రంగ వారసత్వానికి శశి కపూరే ఆధారంగా నిలిచాడు. ఇవాళ ఆర్.కె.స్టూడియోలో ఒక వారగా పృథ్వీ థియేటర్ దర్ఫంగా నిలుచుని ఉందంటే అది అతడి కృషి, అతడి భార్య జెన్నిఫర్ పరిశ్రమ వల్లే సాధ్యమైంది. శశికపూర్‌కు ఇంగ్లిష్ భాష పట్ల, ఇంగ్లిష్ నాటకం పట్ల మంచి అభిరుచి ఉంది. సినిమాల్లో నటిస్తూనే నాటకాల్లోనూ తన తృష్ణ తీర్చుకునేవాడు. దాని వల్ల అతడికి జరిగిన మేలు– పాత్ర ప్రాముఖ్యం గ్రహించగలడం. అది హీరో పాత్రనా సహాయక పాత్రనా అనేది ముఖ్యం కాదు. ఆ పాత్రలో మనం చేయగలిగింది ఏదైనా ఉందా చూడగలగడం. అందుకే అతడు చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేశాడు. అవి అతడికే పేరు తెచ్చాయి– హీరోలతో సమానంగా.
‘దీవార్’లో అమితాబ్‌తో చెప్పిన డైలాగ్‌ను ఎవరు మర్చిపోతారు. నేరస్తుడైన అమితాబ్ ‘మేరే పాస్ బంగ్లా హై, గాడీ హై, పైసా హై, బ్యాంక్ బేలెన్స్ హై... తేరే పాస్ క్యాహై?’ అనంటే పోలీసైన శశి కపూర్ తొణక్కుండా బెణక్కుండా ఛాతీని మెల్లగా పొంగిస్తూ ‘మేరే పాస్ మా హై’ అంటాడు. ఆ ఒక్క డైలాగుతో సినిమా తన అకౌంట్‌లో వేసుకున్నాడు. ఆస్కార్ వేదిక మీద రెహమాన్ గుర్తు చేసుకున్న డైలాగ్ అదే. అది శశి కపూరే ప్రతిభే. ‘రోటీ కప్‌డా ఔర్ మకాన్’, ‘కభీ కభీ’, ‘త్రిశూల్’, ‘కాలా పత్థర్’, ‘షాన్’, ‘సిల్‌సిలా’, ‘నమక్ హలాల్’ వంటి అనేక సినిమాలలో అతడు సపోర్టింగ్ రోల్స్ చేసినా అవి అతడిలోని దమ్మును చూపాయి. అమితాబ్ కంటే తాను వయసులో పెద్దవాడు. కాని చాలా సినిమాల్లో తమ్ముడుగా నటించాడు. ఒక దశలో శశిని అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్‌గా పత్రికలు కామెంట్ చేశాయి. ఏమిటి చేయడం? ప్రతి పాత్రా అతణ్ణే ప్రియుడిగా తలచి వెంట పడుతుంటే.
డెబ్బయ్యవ దశకంలో ముఖ్యంగా ఆ దశకం సెకండ్ హాఫ్‌లో అతడు ఉన్నంత బిజీగా ఏ హీరో లేడు. ఎంత బిజీ అంటే రాజ్‌కపూర్ తన సినిమా ‘సత్యం శివం సుందరం’లో బుక్ చేద్దామంటే అతడి దగ్గర డేట్స్ లేవు. అందుకే రాజ్ కపూర్ శశి కపూర్‌ని ‘టాక్సీ కపూర్’ అని వెక్కిరించేవాడు. రోజంతా ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకు టాక్సీలో పరుగు పెడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడని ఆయన చిరాకు. కాని అంత బిజీలో కూడా శశి కపూర్ ‘కలియుగ్’, ‘జునూన్’ వంటి భిన్నమైన సినిమాలలో నటించి అభిరుచి కలిగిన ప్రేక్షకుల దృష్టిలో ఎదిగాడు. సొంత బేనర్– ‘ఫిల్మ్ వాలాస్’ స్థాపించి గోవింద్ నిహలానితో ‘విజేత’, అపర్ణా సేన్‌తో ‘36 చౌరంగీ లేన్’, గిరిష్ కర్నాడ్‌తో ‘ఉత్సవ్’ తీశాడు. ‘ఉత్సవ్’ను క్లాసికల్ దృష్టితో ఒక స్థాయి ప్రేక్షకులు చూస్తే అందులో శృంగార సన్నివేశాలను వెతుక్కుంటూ మరో స్థాయి ప్రేక్షకులు చూశారు. ఉత్సవ్’లో రేఖకు వచ్చిన పేరు శశికపూర్ కలిగించిన ప్రాప్తం.
26 ఏళ్లు కాపురం చేసి, ముగ్గురు సంతానాన్ని తన గుర్తుగా మిగిల్చి భార్య జెన్నిఫర్ 1984లో కేన్సర్‌తో మరణించింది. మేకప్ ఉంటే హీరో కాని అది తీస్తే అతడు భార్య చాటున దాగే పసివాడు. శశి కపూర్ ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. తిండి మానేశాడు. ఎక్కువ తినేశాడు. అసలు తాగలేదు. పూర్తిగా తాగేశాడు. కేవలం రెండేళ్ల కాలంలో అతడు ఎంత విరక్తిలోకి జారుకున్నాడంటే ఆకారాన్నే కోల్పోయాడు. అందుకే 1986లో వచ్చిన ‘న్యూ ఢిల్లీ టైమ్స్’ అతడి ఆఖరి మెరుపు అయ్యింది. ఆ తర్వాత స్వీయ వలయపు సుషుప్తి కొనసాగింది. అప్పుడప్పుడు కొంత టీవీలో కొన్ని సినిమాల్లో కనిపించి 1998 తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు.
డిసెంబర్ చలి అధికమైంది. చలి కోత కంటే శశికపూర్ మరణకోత ఎక్కువగా బాధిస్తున్నది. ప్రేక్షకులు ఒక నటుడి నుంచి కేవలం రంజింపచేసే కాలక్షేపం మాత్రమే ఆశించి ఊరుకోరు. అతడితో బాండ్ ఏర్పరుచుకుంటారు. అతడిపాటు ప్రయాణిస్తుంటారు. అతడికి సంబంధించిన జ్ఞాపకాలు దాచుకుని ఉంటారు. అలాంటి నటుడు శాశ్వతమైన వీడ్కోలు తీసుకున్నప్పుడు ఒక కుదుపును అనుభవిస్తారు. ఇవాళ అలాంటి కుదుపు ఉంది. చలికాలాలు మరెన్నో వస్తాయి. కాని శశి కపూర్‌లాంటి ప్రియతమ కళాకారుణ్ణి దోచుకుని వెళ్లే చలికాలాలు మాత్రం మరెప్పటికీ రావద్దు. గుడ్ బై హీరో.
దేశాంతర ప్రేమ
కులాంతర వివాహం, మతాంతర వివాహం అంటేనే బెంబేలెత్తి పోయే ఆ రోజుల్లో శశి కపూర్ ఏకంగా దేశాంతర వివాహం చేసుకునేంత గాఢంగా జెన్నిఫర్‌ను ప్రేమించాడు. ఆమె బ్రిటిష్ నటి. తండ్రి వచ్చి కలకత్తాలో థియేటర్ చేసేది. అక్కడే శశి కపూర్ తన తండ్రి ట్రూప్‌తో పాటు ఆమెను కలిశాడు. తొలిచూపులో ప్రేమ... మలి చూపులో ఆరాధన... నా భార్య ఈమే అని నిశ్చయించుకున్నాడు. కపూర్ ఫ్యామిలీ అభ్యంతరం చెప్పలేదు కాని జెన్నిఫర్ తండ్రి చాలా ముందు వెనుక ఆడాడు. చివరకు షమ్మీ కపూర్ భార్య గీతా బాలి చొరవతో ఆ పెళ్లి జరిగింది. వీళ్ల పిల్లల్లో పెద్దవాడు యాడ్‌ఫిల్మ్ రంగంలో ఉన్నాడు. కుమార్తె సంజనా పృధ్వీ థియేటర్ బాధ్యతలు చూసుకుంటున్నది. మరో కుమారుడు కరణ్ టాప్ మోడల్‌గా పని చేసి లండన్‌లో సెటిల్ అయ్యాడు. అలా జెన్నిఫర్ వారసత్వం ఆమె మాతృభూమి మీద కూడా కొనసాగుతూ ఉంది. మరో విశేషం ఏమిటంటే ‘జునూన్’ సినిమాలో జెన్నిఫర్ అత్తగా నటిస్తే శశి ఆమెకు అల్లుడుగా నటించాడు. ఇలా నటించిన భార్యభర్తలు వీరేనేమో.
పిల్లలను ప్రేమించిన తండ్రి
శశి కపూర్ పిల్లలంటే చాలా ప్రాణం. తన తండ్రి పృధ్వీరాజ్ కపూర్‌తో చనువుగా ఉండలేకపోయినందున తాను తన పిల్లలతో చనువుగా ఉంటూ ఆ వెలితిని పూడ్చుకునే ప్రయత్నం చేసేవాడు. తను హీరో కనుక గుంపు ఉన్న చోట ఇబ్బంది కనుక పిల్లలను జూకు తీసుకు వెళ్లాలంటే పర్మిషన్ అడిగి తెల్లవారు జామున ఆరు గంటలకు తీసుకువెళ్లేవాడట. జనం వచ్చేలోపల వారిని తీసుకుని వచ్చేసేవాడట. మన శోభన్‌బాబుకు మల్లే ఆదివారాలు షూటింగ్ చేయడం అనేది పూర్తిగా మానుకునేవాడు శశి కపూర్. ఆ రోజు మూడు పూటలా పిల్లలతో భోజనం చేస్తేనే అతనికి సంతృప్తి. సెట్స్‌లో కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం అతడికి అలవాటు. ‘హాయ్.. నా పేరు శశి కపూర్’ అని లైట్ బాయ్స్ దగ్గరకు వెళ్లి వారితో కలిసి టీ తాగేవాడు. అన్నట్టు అతడికి పెద్దన్న రాజ్ కపూర్ అంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి డబ్బులేని సమయంలో రాజ్ కపూరే ఇచ్చి పెళ్లికి సాయం చేశాడట. ఆ విషయం పిల్లలతో కూడా పదే పదే చెప్పేవాడు.
ఖిల్ తే హై గుల్ యహా...
అందరికీ హిట్ పాటలుంటాయి. కాని శశి కపూర్ పాటల విషయంలో ఇంకొంచెం అదృష్టవంతుడు. చాలా చాలా హిట్ పాటలు అతడి అకౌంట్‌లో పడ్డాయి. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నానా కర్‌తే ప్యార్ తుమ్హీ సే కర్ బై ఠే’, ‘పర్ దేశియోంసే నా అఖియా మిలానా’ పెద్ద హిట్స్. ‘తుమ్ బిన్ జావూ కహా’ పాట ‘ప్యార్ కా మౌసమ్’లో అతడిదే. ఇక ఎవర్ గ్రీన్ హిట్ ‘లిఖ్ఖేజో ఖత్ తుజే’ ఎన్నిసార్లు విని మరెన్నిసార్లు వినడానికి సిద్ధమవుతూనే ఉన్నాం. ‘షర్మిలీ’లో ‘ఖిల్ తే హై గుల్ యహా’, ‘ఓ మేరి ఓమేరి ఓ మేరి షర్మిలీ’... రెండూ వాడని గులాబీల వంటి పాటలు. ‘లే జాయేంగే లేజాయేంగే దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘ఘుంగురూ కి తరా బజ్‌తా రహా హూమై’ పాటలు ‘చోర్ మచాయే షోర్’ సినిమాలోనివి. హిట్స్. ‘సర్ సే సర్ కే సర్ కే చునరియా’ (సిల్ సిలా) పాటలో జయబాధురితో కనిపించడం కూడా బాగుంటుంది.
మన తెలుగులో ‘మంచి మనసులు’గా రీమేక్ అయిన ‘ఆ ... గలే లగ్‌జా’లో శశి కపూర్, షర్మిలా టాగూర్‌లు స్కేట్ చేస్తూ పాడే పాట ‘వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్’ వండర్‌ఫుర్ ఆర్.డి.బర్మన్ హిట్. ఇక ఈ ఆర్.డి.బర్మనే ‘దీవార్’లో శశి కపూర్ చేసిన ‘కెహెదూ తుమ్హే యా చుప్ రహూ’తో ఇంకా చాలా ఉన్న ఈ లిస్ట్‌ను ఈ పాటతో ఆపుదాం. అది– ‘జానూ మేరి జాన్ మై తుజ్ పే ఖుర్బాన్’.. (షాన్). నేరస్తుడైన అమితాబ్ ‘మేరే పాస్ బంగ్లా హై, గాడీ హై, పైసా హై, బ్యాంక్ బేలెన్స్ హై... తేరే పాస్ క్యాహై?’ అనంటే పోలీసైన శశి కపూర్ తొణక్కుండా బెణక్కుండా ఛాతీని మెల్లగా పొంగిస్తూ ‘మేరే పాస్ మా హై’ అంటాడు. ఆ ఒక్క డైలాగుతో సినిమా తన అకౌంట్‌లో వేసుకున్నాడు.
– ఖదీర్
Comments
Please login to add a commentAdd a comment