అత్యంత వేగవంతమైన కెమెరాతో షూటింగ్
దక్షిణాది మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘లింగా’. సూపర్‌స్టార్‌లోని అసలైన మాస్ యాంగిల్‌ని సరైన రీతిలో ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందనేది ఇండస్ట్రీ టాక్. ముత్తు, నరసింహా చిత్రాలతో రజనీకాంత్‌ని ఎవరెస్ట్ అంత ఎత్తులో చూపించిన కేఎస్ రవికుమార్ ‘లింగా’ దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఊహించనంత ఎత్తుకు చేరాయి. అందుకు తగ్గట్టే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రలూ అత్యంత శక్తిమంతంగా ఉంటాయని టాక్. ‘నరసింహా’ను మించే స్థాయిలో ఇందులో రజనీ కనిపించబోతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు పండుగ చేసుకునేలా సూపర్‌స్టార్ గెటప్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు ఏకధాటిగా జరుగనుంది. ప్రస్తుతం రజనీకాంత్ పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్‌టేకర్ నేతృత్వంలో ఈ పోరాట చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ‘ఫాంటమ్ ఫ్లెక్స్ ఫోర్ కె’ అనే అత్యంత వేగవంతమైన కెమెరాను ఈ ఫైట్ సీక్వెన్స్‌కి ఉపయోగిస్తున్నారు. అయితే... ఈ కెమెరాను ఈ ఒక్క ఫైట్‌కే ఉపయోగిస్తారా! లేక ఇతర సన్నివేశాలకు కూడా ఉపయోగిస్తారా! అనేది తెలియాల్సి ఉంది. భారతీయ సినిమాకు ఈ కెమెరాను ఉపయోగించడం ఇదే ప్రథమం. సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: రత్నవేలు, నిర్మాత: రాక్‌లైన్ వెంకటేశ్.