
లండన్‌లో...
హాలీవుడ్ చిత్రాల్లో వీఎఫ్‌ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్)కి ప్రాధాన్యం ఉంటుంది. ఐరన్ మ్యాన్ 2, బ్యాట్‌మేన్- ది డార్క్ నైట్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్, 2012, 10,000 బీసీ... ఇలా విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఆ విభాగంలో పని చేయడంతో పాటు, ఓ షార్ట్ ఫిలింకి కూడా దర్శకత్వం వహించారు తెలుగు కుర్రాడు నవీన్ మేడారం. ఇప్పుడు అసద్ షాన్, యాంబర్ రోజ్ ముఖ్య తారలుగా తెలుగులో ‘లండన్ లైఫ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది.
నవీన్ మాట్లాడుతూ - ‘‘ఇండియా నుండి లండన్ వెళ్లిన నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉంటారు. అప్పుడు వాళ్లకు ఎదురయ్యే సంఘటనలతో ఈ చిత్రం చేశా. ఇక్కడ అభిషేక్ పిక్చర్స్, లండన్, అమెరికాలో కేవీ పిక్చర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నా దగ్గర ఎనిమిది కథలున్నాయి. త్వరలో మరో తెలుగు సినిమా చేయబోతున్నా’’ అని చెప్పారు.