
అవార్డుల వేదిక... బయటపడ్డ శత్రుత్వం
‘సినీ తారల సౌందర్య సాధనం - లక్స్’. బహుశా భారతదేశంలో గ్లామర్‌ను ఉపయోగించుకున్న తొలి సోప్ లక్సేనేమో. స్టార్‌డమ్ ఉన్న ఒక హీరోయిన్‌ను మోడల్‌గా తీసుకొని ఆమెతో ప్రచారం చేయడం ఒక నియమంగా పెట్టుకొని లక్స్ బ్రాండ్‌ను ప్రచారం చేస్తోంది ఆ సోప్ ఉత్పత్తిదారు అయిన యూనీ లీవర్ సంస్థ. బ్లాక్ అండ్ వైట్ కాలంలో సూపర్‌స్టార్‌గా వెలిగిన బాలీవుడ్ హీరోయిన్ సురయ్య దగ్గరి నుంచి షర్మిలా టాగూర్, హేమమాలిని, నందా, సాధన, సైరా బాను వంటి తారలెందరో ఈ సోప్ కోసం మోడల్‌గా నటించారు. దక్షిణాదిలో జయప్రద, శ్రీదేవి లక్స్ యాడ్స్ చేసినవారిలో ముఖ్యులు.
ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ చాలా కాలం లక్స్‌కు మోడల్‌గా కనిపించింది. నిజానికి లక్స్‌కి మోడల్‌గా చేయడం స్టార్‌డమ్‌కు ఒక సూచన అనే స్థాయికి లక్స్ చేరుకుంది. అయితే ఈ తారల మధ్య మగతార అయిన షారుఖ్ కూడా ఒకసారి నటించి సందడి చేశాడు. నాలుగు కొత్త లక్స్ సోపులు మార్కెట్‌లో వస్తున్న సందర్భంగా షారుఖ్ మేటి హీరోయిన్లయిన హేమమాలిని, కరీనా, శ్రీదేవి, జూహీ చావ్లాలతో చేసిన యాడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అవార్డుల వేదిక... బయటపడ్డ శత్రుత్వం
ఇటీవల ముంబైలో జరిగిన ‘లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్-2016’ కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్‌కు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ ప్రకటించగా కరీనా కపూర్‌కు గ్లామర్ దివా అవార్డ్, దీపికాకు ఐకానిక్ లుక్ అవార్డు బహూకరించారు. పూజా హెగ్డేకు బెస్ట్ డెబ్యూ అవార్డ్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా వచ్చిన కత్రీనా కైఫ్‌కూ, సభాస్థలిలో ఉన్న దీపికా పదుకొనెకు మాటలు నడవకపోవడం చాలామంది గమనించారు. తన బాయ్‌ఫ్రెండ్ అయిన రణబీర్ కపూర్ ‘తమాషా’ సినిమాలో దీపికకు దగ్గర కావడం కత్రీనా సహించలేకపోయిందనీ, ఫలితంగా రణబీర్‌తో విడిపోయిందనీ కథనం. ఈ గొడవకు కారణమైన దీపికను కత్రీనా క్షమించకపోవడమే కాక ఆమెతో కలిసి ఏ సినిమాలోనూ నటించనని ప్రతినబూనింది.
1899 నుంచి...
లక్స్ మొదట 1899లో బ్రిటన్‌లో ఒక లాండ్రీ సోప్‌గా మొదలైంది. 1925లో దానిని సాధారణ జనానికి మార్కెట్‌లో అందుబాటులో ఉండే టాయిలెట్ సోప్‌గా మార్చారు. ‘లక్స్’ అనే మాటను లాటిన్ పదం ‘లగ్జరీ’ నుంచి తీసుకున్నారు. లగ్జరీ అంటే వెలుగు అని అర్థం. అయితే ఈ అందమైన తారల తళుకుబెళుకుల వెనుక ఈ సబ్బు తయారు కావడం వెనుక ఒకప్పటి ఆఫ్రికా దేశాల నల్లవాళ్ల చెమట, నెత్తురు ఉన్నాయి. ఆ రోజుల్లో సబ్బుల తయారీకి అవసరమైన పామ్ ఆయిల్ కోసం లివర్ బ్రదర్స్ అధిపతుల్లో ఒకడైన విలియమ్ లివర్ ‘బెల్జియన్ కాంగో’ దేశంలో విస్తారంగా పామ్ తోటలను పెంచాడు. వీటిల్లో తక్కువ కూలీకి పని చేయడానికి నల్లవాళ్లను కూలీలుగా నియమించి వాళ్లను నానా కష్టాలు పెట్టాడు. ఆ నాటి దురాగతాలను బోలెడన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు నమోదు చేశాయి. లక్స్ ఒక్క సబ్బే... ఇవాళ అరడజను దేశాలలో అమ్ముడుపోతూ సింగపూర్‌ను తన హెడ్‌క్వార్టర్స్‌గా చేసుకొని మార్కెట్‌ను శాసిస్తోంది.