ఏ హీరోయిన్ పారితోషికం ఎంత? | bollywood heroines remuneration Special | Sakshi
Sakshi News home page

ఏ హీరోయిన్ పారితోషికం ఎంత?

Published Wed, Dec 17 2014 6:42 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

ఏ హీరోయిన్ పారితోషికం ఎంత? - Sakshi

ఏ హీరోయిన్ పారితోషికం ఎంత?

 పాటల్లేని సినిమాలు చూడగలం.. ఫైట్లు లేని సినిమాలూ పసందుగానే ఉంటాయి. మాటల్లేని సినిమాలు కూడా మనసును దోచేస్తాయి. కానీ, మగువ లేని సినిమాను చూడగలమా? ప్చ్... సినిమాకో కళ రావాలంటే కథానాయిక ఉండాల్సిందే. లేకపోతే వెండితెర వెలవెలబోతుంది. రెండున్నర గంటల సినిమాలో కథానాయిక కనిపించేది కాసేపే అయినా... ఆ కొద్దిసేపు మెరుపులు ప్రేక్షకుల మనసును ఆనందపరుస్తాయి. అది గ్రహించే క్రేజీ తారలు భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. ఎంత పాపులార్టీ ఉంటే అంత ‘క్యాష్’ దండుకోవచ్చన్నమాట. అలా, ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న ఓ పదిమంది చక్కనమ్మల చుక్కలనంటే పారితోషికం కబుర్లు... ఇవాళ్టి ‘బాలీవుడ్’ స్పెషల్...
 
 దడదడలాడిస్తున్న దీపికా..!
 ఈ దక్షిణాది భామ కథానాయికగా రంగప్రవేశం చేసింది ముందు కన్నడ రంగంలోనే! ‘ఐశ్వర్య’ అనే చిత్రం ద్వారా ఆమె తొలిసారి వెండితెరపై మెరిశారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో ‘ఓం శాంతి ఓం’లో అవకాశం వచ్చింది. హిందీ సినీ మార్కెట్ పెద్దది కావడం, ఏకంగా షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడంతో దీపిక కూడా చటుక్కున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ చిత్రం బంపర్ హిట్ కావడంతో బాలీవుడ్ అగ్ర దర్శక-నిర్మాతల దృష్టి ఈ సొట్టబుగ్గల సుందరిపై పడింది. అంతే... అవకాశాల మీద అవకాశాలు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జయాపజయాల మిశ్రమంగా కెరీర్ సాగుతున్న నేపథ్యంలో గత ఏడాది దీపిక కెరీర్ మంచి మలుపు తీసుకుంది. రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, గోలియోంకీ రాస్‌లీల-రామ్‌లీల... ఇలా 2013లో నాలుగు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు దీపిక. ఆ విజయాలు దీపిక క్రేజ్‌ను అమాంతం పెంచేశాయ్. దీపిక కూడా తన పారితోషికాన్ని పెంచేశారు. ఇప్పుడామె డిమాండ్ చేస్తున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా 8 నుంచి 9 కోట్ల రూపాయలు.
 
 కల్యాణమైనా కరీనా క్రేజ్ తగ్గలేదు!
 థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న తారలకూ, పెళ్లయిన తారలకూ క్రేజ్ తగ్గుతుందా? తగ్గుతుందనే కొంతమంది భావిస్తారు. కానీ, కరీనా కపూర్ లాంటి కొంతమంది తారలు అది అబద్ధం అని నిరూపిస్తారు. సైఫ్ అలీఖాన్‌తో కరీనా పెళ్లయ్యి, ఈ అక్టోబర్‌కి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో కరీనాకు సినిమాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. దానికి కారణం ఆమె మంచి నటి కావడమే. జయాపజయాలకు అతీతంగా కరీనా కెరీర్ సాగుతోంది. ‘జబ్ వియ్ మెట్’తో కరీనా కెరీర్ మంచి మలుపు తీసుకుంటే, ‘3 ఇడియట్స్, గోల్‌మాల్ 3, బాడీగార్డ్’ ఆమె పారితోషికం పెరగడానికి కారణంగా నిలిచిన చిత్రాలు. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న పారితోషికం 8 నుంచి 8.5 కోట్ల రూపాయలు.
 
 ఫుల్ ఫామ్‌లో ప్రియాంక!
 మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా.. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు.. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో కూడా బ్రహ్మాండంగా ఒదిగిపోతారు. ‘ఫ్యాషన్’ చిత్రంలో ఎంత గ్లామరస్‌గా కనిపించారో... ‘బర్ఫీ’ చిత్రంలో మానసిక వికలాంగురాలి పాత్రలో అంత డీ-గ్లామరస్‌గా కనిపించారు. ఇక, ‘మేరీ కోమ్’ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్‌లా ఒదిగిపోవడానికి ఆమె చేసిన కసరత్తులను ప్రేక్షకులు కొనియాడారు. అసలు సిసలైన క్రీడాకారిణిగా అగుపించడానికి సౌకుమార్యాన్ని కోల్పోయి.. కండలు పెంచారామె. ఆ తర్వాత తదుపరి చిత్రం ‘దిల్ ధడక్నే దో’ కోసం పాత శరీరాకృతి తెచ్చుకున్నారు. ఇంతగా కష్టపడతారు కాబట్టే, ప్రియాంక కెరీర్ ఇంత వైభవంగా సాగుతోంది. ఇంత మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టే, దాదాపు 7 నుంచి 8 కోట్లు పారితోషికం పుచ్చుకోవడానికి ప్రియాంక వెనకాడటం లేదు.
 
 క్రేజీ కైఫ్!
 ‘ఇక ఎప్పటికీ గ్లామర్ డాల్ మాత్రమే... కత్రినా కైఫ్‌లో మంచి నటి లేదు’ అని కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఈ బ్యూటీకి పలు విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలు తట్టుకుని నిలబడి, ‘కత్రినాలో మంచి నటి ఉంది’ అని అందరితో అనిపించుకోగలిగారామె. ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’, ‘రాజ్‌నీతి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘అగ్నిపథ్’ వంటి చిత్రాల్లో కత్రినా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, ‘షీలా కీ జవానీ..’ పాట కత్రినాలో మంచి డాన్సింగ్ స్టార్ ఉందని నిరూపించింది. వీటికి తోడు యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉండటంతో ఈ విదేశీ భామ బాలీవుడ్‌లో బాగానే స్థిరపడగలిగారు. అందుకు తగ్గట్లే తన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో కత్రినా 6 నుంచి 6.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.
 
 ఐష్... భేష్..!
 ప్రపంచ సుందరి అనే కిరీటం ఐశ్వర్యారాయ్ కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ పాపులారిటీని అప్పనంగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఐశ్వర్యారాయ్‌కి రెడ్ కార్పెట్ వేసి మరీ సినిమాల్లోకి ఆహ్వానించారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా ఆ తర్వాత  ‘హమ్ దిల్ దే చుకే సనమ్, తాళ్, దేవ్‌దాస్, ధూమ్ 2, జోధా అక్బర్’ వంటి చిత్రాలు ఆమెలోని నటిని నిరూపించడంతో పాటు కెరీర్‌ను సక్సెస్ బాటలో నడిపించాయి. అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా ఐష్ బిజీ బిజీగానే సినిమాలు చేశారు. తల్లయ్యాక మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఐష్ వెండితెరపై కనిపించి, మూడేళ్లవుతోంది. అభిమానులు ఆమె రీ-ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐష్‌కి కూడా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం ‘జాజ్‌బా’ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఇంతకీ, ఐష్ డిమాండ్ చేస్తున్న పారితోషికం ఆరు కోట్ల రూపాయలట. ప్రపంచ సుందరికి అంత తక్కువా అనుకోవద్దు. ఐష్ వయసు 41. ఆ వయసులో ఉన్న తార ఇంత తీసుకోవడం... చిన్న విషయమా ఏమిటీ!
 
 యువనాయికల పారితోషికం కోటి పైనే!

 ఇంకా బాలీవుడ్‌ని ఏలుతున్న సీనియర్ తారల్లో విద్యాబాలన్ 3 కోట్ల వరకు తీసుకుంటుండగా, బిపాసా బసు 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. యువ కథానాయికల్లో సోనాక్షీ సిన్హా 3 నుంచి 4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారనీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్‌లు 2 కోట్ల వరకూ తీసుకుంటున్నారనీ సమాచారం. క్రేజీ యువ తారలు ఆలియా భట్, పరిణితీ చోప్రాల పారితోషికం కూడా 2 కోట్ల వరకూ ఉందట! మొత్తానికి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సంగతి బాలీవుడ్ కథానాయకులు బాగానే పాటిస్తున్నట్లున్నారు కదూ!
 
  డి.జి. భవాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement