మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఉంటారని ఓ సామెత. అందులో ఇద్దర్ని దర్శకుడు నాగ అశ్విన్ గుర్తించారు. ఆ ఇద్దరూ ఎవరంటే... సావిత్రి, కీర్తీ సురేశ్. ఏంటి...నమ్మడం లేదా? అయితే... ఓసారి పక్కనున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోనూ... అందులో కళ్లనూ చూడండి. ఫొటోలో ఉన్నదెవరు? సావిత్రే కదూ! అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.ఫొటోలో ఉన్నది కీర్తీ సురేశ్. సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా‘మహానటి’. ఇందులో సావిత్రిగా కీర్తీ సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ క్యాప్షన్‌తో ఆమె ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ఇందులో కీర్తీ సురేశ్ కళ్లు అచ్చం సావిత్రి కళ్లలానే ఉన్నాయి కదూ! ‘మహానటి’తో పాటు పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ కీర్తీ సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని లుక్‌నూ విడుదల చేశారు.
తెరపైనా దర్శకులే!?
క్రిష్ తెలుసుగా... ‘గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు తీసిన దర్శకుడు. ఆయనతో పాటు నటుడు, ‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ చిత్రాల దర్శకుడుఅవసరాల శ్రీనివాస్ త్వరలో తెరపైనా దర్శకులుగా కనిపించే అవకాశాలున్నాయి. సావిత్రి కథతో రూపొందుతోన్న ‘మహానటి’లో ఆమెతో పనిచేసిన దర్శకుల పాత్రలు కూడా ఉన్నాయి.‘మాయాబజార్’ తీసిన కేవీ రెడ్డి, ‘మిస్సమ్మ’ తీసిన ఎల్వీ ప్రసాద్ పాత్రలు కథలో కీలకమట! వీరిద్దరిలో కేవీ రెడ్డి పాత్రకు క్రిష్‌ను, ఎల్వీ ప్రసాద్ పాత్రకు అవసరాలను అనుకుంటున్నారట. మరి, ఈ దర్శకులు ఇద్దరూ తెరపై దిగ్గజ దర్శకుల పాత్రల్లో కనిపించడానికి ఏమంటారో!!
Comments
Please login to add a commentAdd a comment