
దసరాకు మహానుభావుడు
కాళ్లకు సాక్సులు తీయకుండానే నిద్రపోతాడు. ప్రేయసి కాళ్లకు ముద్దుపెట్టాలంటే ఆ కాళ్లకు పెర్‌ఫ్యూమ్ కొడతాడు. ఎవరికైనా తుమ్మొస్తోందంటే ఆమడ దూరం పారిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కనిపించని గాలిని కూడా క్లీన్ చేయాలనుకునే టైప్. ఈ కుర్రాడి యవ్వారం తేడాగా ఉంది కదూ. నిజమే.. ఈ కుర్రాడికి ఓసీడీ అనే డిజార్డర్ ఉంది. అంటే.. అతి శుభ్రం అన్నమాట. ఈ డిజార్డర్ ఈ కుర్రాడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందన్న అంశాలతో రూపొందిన చిత్రం ‘మహానుభావుడు’. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.
ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. శర్వా బాగా యాక్ట్ చేశాడు. తమన్ సంగీతం సూపర్’’ అన్నారు. ‘‘మారుతి క్రియేట్ చేసిన శర్వా క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందనే నమ్మకం ఉంది. టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది’’ అన్నారు నిర్మాతలు.