ఉత్తమ నటుడిగా మహేష్ బాబు
చెన్నై:టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఆదర్శంగా నిలిచిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. 2013లో విక్టరీ వెంకటేష్, పాల బుగ్గల చిన్నోడు మహేష్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పడు ఆ చిత్రం ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుని టాలీవుడ్ కు మరింత అందం తీసుకొచ్చింది. 61వ దక్షిణాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. శనివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో 'రాజా రాణి' తమిళ చిత్రంలో నటించిన నయన తార ఉత్తమ నటిగా ఎంపికయ్యింది.
దక్షిణాదిలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చలన చిత్ర పరిశ్రమల మధ్య జరిగిన అవార్డుల ఎంపికలో పలు చిత్రాలు ఒకటి కంటే ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'కాదల్' ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకుంది. మరో ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కించిన 'పరదేశీ' మరియు 'తంగా మీంగల్ ' చిత్రాలు చెరో మూడు అవార్డులను దక్కించుకున్నాయి. తమిళ చిత్రం 'రాజా రాణి'కి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. 'కాదల్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహ్మాన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది.