ఫ్లాపైనా, హిట్టయినా నా బాధ్యతే: మహేశ్ బాబు
ముంబై: సూపర్ స్టార్ మహేశ్‌బాబూ తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'పై భారీ అంచనాలే ఉన్నాయి. 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకాభిమానుల్లో 'బ్రహోత్సవం'పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు ఐఏఎన్‌ఎస్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఆడకపోతే.. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్న వివాదంపై స్పందిస్తూ.. తన సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అది తన బాధ్యతగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. 'పోకిరి', 'అతడు', 'దూకుడు', 'శ్రీమంతుడు' వంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఇంకా ఏమంటున్నారంటే..
ప్రశ్న: మీ కొత్త 'బ్రహ్మోత్సవం' సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా గురించి చెప్పండి..
మహేశ్: కుటుంబ నేపథ్యంతో సాగే ప్రేమకథా చిత్రం 'బ్రహ్మోత్సవం'. వ్యక్తుల నడుమ ఉండే అనుబంధాల గురించి ఈ సినిమా ఉంటుంది.
ప్రశ్న: ప్రస్తుతమున్న దశలో మీరు సవాల్‌తో కూడుకున్న పాత్రలు చేయాలనుకుంటున్నారా? 'బ్రహ్మోత్సవం' అలాంటిదేనా?
మహేశ్: సవాల్ అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదు కానీ, స్క్రిప్ట్ స్థాయిలో నన్ను ఎక్సైటింగ్‌కు గురిచేసే కథల్నే నేను చేస్తాను. 'బహ్మోత్సవం'లో కూడా నా పాత్ర, దానిని పోషించిన తీరు నా వరకు కొత్తవే.
ప్రశ్న: ఎందుకు చాలాకాలంగా సినిమా విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది? సినిమా రిలీజ్ డేట్ ఏమిటి?
మహేశ్: మా షెడ్యూల్ ప్రకారం సినిమా ఆడియో మే 6న రిలీజ్ కానుంది. అప్పుడే మేం అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తాం.
ప్రశ్న: బాక్సాఫీస్ వద్ద 'శ్రీమంతుడు' పర్ఫార్మెన్స్ మీకు సంతృప్తినిచ్చిందా?
మహేశ్: 'శ్రీమంతుడు' నా హృదయానికి చేరువగా వచ్చిన సినిమా. నా సొంత ప్రొడక్షన్‌లో తీసిన తొలి సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద సినిమా పర్ఫార్మెన్స్ ఎంతో సంతృప్తినిచ్చింది.
ప్రశ్న: సినిమాలు ఫ్లాప్ అయితే చాలా నష్టపోతున్నామని, అలాంటి సందర్భాల్లో తమకు పరిహారం ఇవ్వాలని ఇటీవలికాలంలో డిస్టిబ్యూటర్లు డిమాండ్ చేయడం టాలీవుడ్‌లో వివాదం రేపుతున్నది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
మహేశ్: నా సినిమా ఆడినా, ఆడకపోయినా అది నా బాధ్యతగానే భావిస్తాను.
ప్రశ్న: 16 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెలుగు పరిశ్రమను దాటి మీ పరిధిని మరింత పెంచుకోవాలనుకుంటున్నారా?
మహేశ్: ప్రస్తుతం నటనపైనే నా దృష్టంతా. నా వృత్తి పట్ల నేనెంతో మక్కువతో, తపనతో ఉన్నా. అంతకుమించి మరేదీ కూడా నేను ఆలోచించడం లేదు.