టైటిల్ : మహర్షి
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సూపర్‌స్టార్ అందుకున్నాడా..? మహేష్ కెరీర్‌లో మహర్షి మెమరబుల్ సినిమాగా మిగిలిపోయిందా?
కథ :
మహర్షి కథ ఫారిన్‌లో ప్రారంభమవుతుంది. రిషి (మహేష్ బాబు) ఆరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తరువాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐఈటీలో జాయిన్ అయిన రిషికి, రవి (అల్లరి నరేష్), పూజ (పూజా హెగ్డే)లు పరిచయం అవుతారు. ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావటంతో ముగ్గురూ విడిపోతారు. ప్రపంచాన్ని గెలవలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మరణంతో ఇండియా తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజ్‌లో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది.
రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి, వివేక్ మిట్టల్(జగపతి బాబు)ను కలిసి గ్యాస్ పైప్ లైన్ పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించక పోవటంతో రిషి.. రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు..? ఈ ప్రయాణంలో ఏం ఏం కోల్పోయాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు:
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో రిషి పాత్రలో జీవించాడు. ఎమోషన్స్, యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించిన ప్రిన్స్ సూపర్బ్ అనిపించాడు. మరో కీలక పాత్రలోనటించిన అల్లరి నరేష్ కూడా తనదైన నటనతో మెప్పించాడు. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీకే పరిమితమైపోయిన నరేష్‌కు ఇది మంచి బ్రేక్ అనే చెప్పాలి. హీరోయిన్ పూజా హెగ్డే తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లుక్ పరంగా మంచి మార్కులు సాధించారు. విలన్ జగపతిబాబు మరోసారి స్టైలిష్ లుక్‌లో మెప్పించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, సాయి కుమార్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ:
మహేష్ 25 సినిమా కోసం భారీ కథను సిద్ధం చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే ఈ కథలో చర్చిన అంశాలన్ని శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాలో చర్చించినవే కావటంతో కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం విషయంలోనూ దర్శకుడు కాస్త తడబడ్డాడు. సుదీర్ఘంగా సాగే నేరేషన్ అక్కడక్కడా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే సూపర్ స్టార్ అభిమానులను మాత్రం వంశీ పూర్తి స్థాయిలో అలరించాడు. మహేష్‌లోని హీరోయిజం, ఎమోషనల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింటిని వెండితెర మీద ఆవిష్కరించాడు.
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. గత చిత్రాల్లో పాటలు ఎలా ఉన్న నేపథ్య సంగీతంతో మెప్పించే దేవీ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అంచనాలను అందుకోలేకపోయాడు.
కేయు మోహనన్ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. అమెరికా సీన్స్‌తో పాటు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. దాదాపు మూడు గంటల నిడివి ప్రేక్షకులను బోర్ ఫీల్ అయ్యేలా చేస్తోంది. మహేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ సినిమా కావటంతో నిర్మాతలు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు అవసరానికి మించి ఖర్చు చేశారు.
ప్లస్ పాయింట్స్:
మహేష్ బాబు, అల్లరి నరేష్ నటన
ఎమోషనల్ సీన్స్
యాక్షన్ సీన్స్
ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
సినిమా నిడివి
రొటీన్ స్టోరీ
అక్కడక్కడా స్లో నేరేషన్
సంగీతం
-సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment