మహేష్ ఇక ఆగడు
మహేష్ ఇక ఆగడు
Published Sat, Oct 5 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
మహేష్ సినిమాల్లో ‘దూకుడు’ ఓ సంచలనం. మళ్లీ ఆ కాంబినేషన్ కోసం అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆ ఎదురు చూపులకు తెర పడబోతోంది. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించనున్న ‘ఆగడు’ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నదని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 11న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించాలని దర్శకుడు శ్రీనువైట్ల భావిస్తునట్లు తెలిసింది. అయితే... మహేష్‌బాబు, ఈ చిత్ర నిర్మాతలు... ‘1’ చిత్రం షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్‌లో ఉన్నారు.
ఈ నెల 13న వారు ఇండియా రానున్న నేపథ్యంలో...ఈ నెల 14న భారీగా ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని జరపాలనే మరో ఆలోచనలో కూడా ఉన్నట్లు వినికిడి. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకతేదీన ‘ఆగడు’ మొదలవ్వడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో రెండు పాటలు ఓకే అయ్యాయట. సంగీత దర్శకునిగా తమన్‌కిది 50వ సినిమా కావడం విశేషం!
Advertisement
Advertisement