బ్రహ్మోత్సవంలో అందం అదే!
ప్రేక్షకుల్లో మహేశ్‌పై ఉన్న అభిమానానికి ఆకాశమే హద్దు. చిన్నా పెద్దా... ఆడా.. మగా అనే తేడా లేకుండా మహేశ్‌ని అందరూ ఇష్టపడుతుంటారు. ఆ స్థాయిలో అభిమానులుంటే ఏ కథానాయకుడైనా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవాల్సిందే. వాళ్లని ఒప్పించేందుకని ఒక మూస సినిమాలకి పరిమితం కావాల్సిందే. కానీ మహేశ్ మాత్రం అందుకు భిన్నంగా తన కెరీర్‌ని బిల్డప్ చేసుకొన్నారు. అటు అభిమానుల్ని మెప్పిస్తూనే ఇటు కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు.
బాక్సాఫీసు దగ్గర కాసుల వర ్షం కురిపిస్తూనే... నటుడిగా తనని తాను సంతృప్తి పరుచుకుంటారు. ప్రతిసారీ ఆయన్నుంచి కొత్త రకమైన సినిమాలొస్తుంటాయి. వేరే ఏ స్టార్ కూడా చేయలేని కథల్లో ఆయన కనిపించి ఆశ్చర్యపరుస్తుంటారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలు చేసి సగటు ప్రేక్షకుడితో శభాష్ అనిపించుకొన్న మహేష్ తాజాగా ‘బ్రహ్మోత్సవం’ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తో ‘సాక్షి’ స్పెషల్ మీట్...
‘‘నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోను. ఇప్పుడొక మాస్ సినిమా చేశాను కాబట్టి, ఆ తర్వాత క్లాస్ లుక్‌లో కనిపించాలని లెక్కలేసుకొని సినిమా చేసే అలవాటు లేదు. ‘శ్రీమంతుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేయడం కూడా అనుకోకుండానే జరిగింది. నా అదృష్టం కొద్దీ ‘శ్రీమంతుడు’ జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ‘శ్రీమంతుడు’ లాంటి ఓ సోషల్ ఎలిమెంట్ ఉన్న సినిమా తర్వాత కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో కూడిన ‘బ్రహ్మోత్సవం’ చేయడం చాలా మంచిదైంది.
ప్రేక్షకులు కంప్లీట్‌గా ఓ కొత్త సినిమాని చూస్తారు. నేను ఇప్పటిదాకా చేయనటువంటి కథ ఇది. అందరికీ నచ్చుతుంది కాబట్టి మళ్లీ మళ్లీ అందరూ కలిసి చూస్తారు. నటుడు ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు. నా అభిమానులు కూడా ఇలాగే కనిపించాలని ఎప్పుడూ చెప్పరు. వాళ్లకి మంచి సినిమా కావాలంతే. ఇటీవల నా నుంచి అన్నీ మంచి సినిమాలొస్తుండటంతో అభిమానులు కూడా చాలా హ్యాపీ’’.
‘‘కొన్ని కథలు ఏం కావాలో అవి సమకూర్చుకుంటాయట. ‘బ్రహ్మోత్సవం’ కథ కూడా అలా అన్నీ తనకి తానే సమకూర్చుకుంది. నిజానికి ఇది చాలా శ్రమతో కూడిన సినిమా. బోలెడు మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయాల్సి వచ్చింది. కానీ, ఈ కథని విన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఒప్పేసుకొని ఎవరికివాళ్లు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ సహకారం తాలూకు ఎఫెక్టే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి ప్రధాన అందం. శ్రీకాంత్ అడ్డాల గారి కథల్లో సోల్ ఉంటుంది. అదే నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్ని వాళ్ల వాళ్ల జీవితాల్లోకి తీసుకెళుతుందీ సినిమా. ఈ సినిమాలో నటిస్తూ నేను కూడా ఎన్నిసార్లు నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్లానో లెక్కే లేదు’’.
అంతకంటే ఎక్కువ సంతృప్తి
‘‘అవకాశం వచ్చినప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లాంటి కథల్ని ఏ కథానాయకుడూ వదులుకో కూడదు. ఈ చిత్రంతో నటుడిగా నేనెంత సంతృప్తి పొందానో, నిర్మాణ భాగస్వామిగా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందా. ఇలాంటి కథలతో భవిష్యత్తులోనూ నా ప్రయాణం కొనసాగుతుంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా నిర్మాణ వ్యవహారాన్ని, ప్రమోషన్ కార్యక్రమాల్ని నమ్రత పర్యవేక్షించింది. తనవల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి కథల్ని ఎంచుకొంటున్నా. తదుపరి మురుగదాస్ గారితో సినిమా చేయబోతున్నా. ‘గజిని’ చూసినప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలనుకొనేవాణ్ని. నా ‘ఒక్కడు’ చూసినప్పట్నుంచి ఆయన నాతో సినిమా చేయాలనుకొన్నారట. అలా మా ఇద్దరికీ ఇప్పుడు కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నా కెరీర్‌లో మరో మరపురాని చిత్రమవుతుంది’’.