
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్‌లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని పోస్ట్ చేశాడు. అయితే గురువారం ప్రసారమై ఆది స్కిట్‌లో ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.