
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్వల్ప విరామం ప్రకటించారు. ఇది అభిమానుల ప్రవర్తనపై మాత్రమే ఆధారపడి ఉంటుందని, తనకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరోకోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఫేస్‌బుక్ ఓ పోస్టు పెట్టాడు.
‘పవన్ కళ్యాణ్‌ను బాగా ఎండగట్టాను. నా వాదాన్ని బిగ్గరగా, చాలా తేటగా వినిపించాను. ఆయనపై వేసే ప్రశ్నల జైత్ర యాత్రకు స్వల్ప విరామం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ పవన్ అభిమానులు మళ్లీ రెచ్చగొడితే మాత్రం ఊరుకోను సుమా..! మళ్లీ రావాలా వద్దా అనేది ఆయన అభిమానుల చేతుల్లోనే ఉంది. నేను అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాదని కూడా తెలుసు. కానీ నా ప్రశ్నలు అనేక మందిని పునరాలోచనలో పడేశాయి. నాకు కావల్సింది కూడా అదే. నేను ఇప్పుడు వేరే మూడ్‌లోకి వెళ్తున్నాను. నాకు భంగం కలిగిస్తే మాత్రం తప్పకుండా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని పవన్ అభిమానులను హెచ్చరించాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ప్రారంభమైన మహేశ్ కత్తి ప్రశ్నల వర్షం శనివారం నాటి పవన్ ఒంగోలు సభ వరకు కొనసాగింది. పవన్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కత్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వార్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.