
కొత్త ఏడాది ప్రారంభలోనే ఓ సరికొత్త చాలెంజ్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికి ‘10 ఇయర్స్ చాలెంజ్’ ఫీవర్ పట్టుకుంది. పదేళ్ల క్రితం నాటి ఫోటోలను.. ప్రస్తుత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ చాలెంజ్ వల్ల నెటిజన్ల చేతిలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు మలైకా అరోర. విషయం ఏంటంటే ‘10 ఇయర్స్ చాలెంజ్’లో భాగంగా మలైకా.. 1998లో వచ్చిన షారుక్ ఖాన్ ‘దిల్‌సే’ చిత్రంలోని ‘ఛైయ్య ఛైయ్య..’ సాంగ్‌లోని స్టిల్స్‌ను, ఇప్పటి స్టిల్స్‌ను జత చేసి రెండు ఫొటోలు షేర్ చేశారు.
దాంతో పాటు‘నా ‘టెన్ ఇయర్ ఛాలెంజ్’.. గడిచిన పదేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని రాశారు. అయితే మలైకా పోస్ట్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు. ‘పదేళ్ల ఫోటో అంటూ ఇరవయేళ్లనాటి ఫోటోలు పోస్ట్ చేస్తావా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు ‘1998 నుంచి 2018 వరకూ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘అందం మాత్రమే ఉంటే సరిపోదు.. కాస్తా బుర్ర కూడా ఉండాలం’టూ కామెంట్ చేస్తున్నారు. ట్రోలింగ్‌కు భయపడిన మలైకా వెంటనే ‘10 ఇయర్స్ చాలెంజ్’ను కాస్తా ‘20 ఇయర్స్ చాలెంజ్’ అంటూ మార్చారు.