
ఆమిర్ ఖాన్ భార్యగా..?
అదృష్టం కలిసొస్తే... మంచి అవకాశం దక్కితే మనం ‘రొట్టె విరిగి నేతిలో పడింది’ అంటాం. అదే హిందీవాళ్లయితే ఏమనుకుంటారు? పూరీ వెళ్లి పానీలో పడ్డట్లే అంటారేమో. ప్రస్తుతం మల్లికా శెరావత్ అలాంటి ఆనందంలోనే ఉన్నారట. ఎంత ఆనందం అంటే ఎన్ని పానీ పూరీలిచ్చినా గప్ చుప్‌గా తినేసేంత! ఈవిడగారి ఆనందానికి కారణం ‘దంగల్’ చిత్రం. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం ఎవరికి దక్కుతుంది? అనే చర్చ హిందీ చిత్ర రంగంలో జరిగింది. హాట్ లేడీ మల్లికా శెరావత్ ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట.
మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట. మరి... ఆమె నమ్మకం ఎంతవరకూ నిజమవుతోందనేది వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్య అనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.