నా పేరులో సగం ‘మామ’ సంగీతానిది!
- సీనియర్ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి
సందర్భం నేడు కేవీ మహదేవన్ జయంతి
నేను ఇప్పటివరకూ 77 సినిమాలకు డెరైక్ట్ చేస్తే, అందులో 33 చిత్రాలకు ‘మామ’ కె.వి. మహదేవన్ స్వరాలందించారు. నేను సినిమా ఒప్పుకున్నాక తొలి ప్రాధాన్యం ఆయనకే ఇచ్చేవాణ్ణి. ఒకవేళ నిర్మాత గనక సంగీత దర్శకుడిగా వేరే పేరు చెబితే మాత్రం నేను అదేమిటని అడిగేవాణ్ణి కాదు. నాకు ‘మామ’ కావాలని మూర్ఖంగా పట్టుబట్టేవాణ్ణి కాదు.
నిజానికి, మామతో నా అనుబంధం నేను దర్శకుడిని కాక ముందే మొదలైంది. దర్శకుడిని కాక ముందు నేను జగపతి సంస్థలో ‘అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు’ చిత్రాలకు వి. మధుసూదనరావు దగ్గర సహకార దర్శకునిగా పనిచేశాను.
ఆ సంస్థకు ‘మామ’ కె.వి. మహదేవన్ ఆస్థాన సంగీత దర్శకులు. అప్పుడే ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సంస్థలో అన్ని చిత్రాల సంగీత చర్చల్లోనూ నేనూ పాల్గొనేవాణ్ణి. పాటకు బాణీ కట్టాక నా అభిప్రాయం కూడా అడిగి కనుక్కునేవారు. మామ చిన్నవాళ్లకూ విలువ ఇస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి!
నన్ను ‘రెడ్డిగారూ’ అని పిలిచేవారాయన. నన్నలా పిలవకండని చెప్పినా వినేవారు కాదు. గౌరవం ఇవ్వడానికి చిన్నా పెద్దా తారతమ్యం ఉండకూడదని చెప్పేవారు.
దర్శకునిగా నా తొలి సినిమా ‘అనూరాధ’ (1971). సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడు. నాకున్న సాన్నిహిత్యంతో ‘మామ’నే సంగీత దర్శకునిగా అడిగా. ఆయనా అనందంగా ఒప్పుకున్నారు. ‘అనూరాధ’ సగంలో ఉండగానే ‘అత్తలూ కోడళ్లూ’ (1971), ‘విచిత్ర దాంపత్యం’ (1971) సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఇందులో ‘అత్తలూ కోడళ్లూ’ చిత్రానికి మామే సంగీత దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ‘అనూరాధ’ నా మూడో చిత్రంగా విడుదలైంది. ‘అత్తలూ కోడళ్లూ’, ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు 1971 ఏప్రిల్ 14న ఒకే రోజు విడుదలయ్యాయి. పాటలకు మంచి పేరొచ్చింది.
ఇక, పద్మాలయా సంస్థలో కృష్ణతో చేసిన ‘పాడిపంటలు’ (1976) సినిమాకు మామ అద్భుతమైన పాటలు ఇచ్చారు. అప్పట్లో ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా పెడదామని నిర్మాతలు అంటే, నేను వద్దని చెప్పి ‘మామ’ను రికమెండ్ చేశానని ఎవరో తప్పుగా ప్రచారం చేశారు. అది అవాస్తవం. ఆదినారాయణరావులాంటి గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం వస్తే నేను మాత్రం ఎందుకు వద్దనుకుంటాను.
నిర్మాతలు ఎవరి పేరూ సూచించకపోవడంతో, నేను మామ దగ్గరకు వెళ్లానంతే! ఇంకో విషయం ఏంటంటే - ‘పాడి పంటలు’ సినిమా మొదట నందినీ ఫిలిమ్స్‌లో చేద్దామని ప్రయత్నించాం. ఆ సంస్థకు మ్యూజిక్ డెరైక్టర్‌గా మామ పర్మినెంట్. ఆ విధంగా కూడా ‘పాడిపంటలు’కు మామ స్వరాలందించారు. ఈ చిత్రంలోని ‘మన జన్మభూమి...’ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.
నా కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా ‘బడిపంతులు’ (1972). అది ఎంత గొప్ప కథో, అంత గొప్పగా సంగీతం కుదిరింది. అందులోని 9 పాటలూ వీనుల విందే. ముఖ్యంగా ‘బూచాడమ్మా... బూచాడు’, ‘భారతమాతకు జేజేలు’, ‘నీ నగుమోము నా కనులారా’ పాటలైతే క్లాసిక్స్.
‘ఇల్లు-ఇల్లాలు’ సినిమాకు కూడా చాలా మంచి పాటలిచ్చారు. ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా...’ పాట కామెడీ పాటల్లో అగ్రశ్రేణిలో నిలిచిపోతుంది. సెంటిమెంట్, లవ్, కామెడీ... ఇలా ఏ పాట అయినా మామకు కరతలామలకం.
‘జన్మజన్మల బంధం’ (1977)కు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విడుదల ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల ఇందులోని పాటలు పెద్దగా ప్రజాదరణ పొందలేకపోయాయి. ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి నాకిచ్చిన ఆ కానుక, నాకు సద్వినియోగం కాకుండా పోయింది.
మామ వర్కింగ్ స్టయిల్ మిగతావారి కన్నా విభిన్నం. ఎక్కడా ఆర్భాటాలుండేవి కావు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు కూడా. ఏ పాట అయినా సరే 5, 10 నిమిషాల్లో సిద్ధం చేసేవారు. ఏదైనా మేగ్జిమమ్ అరగంటే. మామ, ఆయనకు కుడి భుజంలాంటి పుహళేంది ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుని పాట రెడీ చేసేసేవారు. వాళ్లు ఏం మాట్లాడుకునేవారో నాకు అర్థమయ్యేది కాదు కానీ, బాణీ బ్రహ్మాండంగా ఉండేది.
సంగీత దర్శకునిగా ఆయన ఎంత గొప్పవాడో, మనిషిగా కూడా అంత గొప్పవాడు. మనుష్యుల్ని ప్రేమించే తీరు, మర్యాద ఇచ్చే పద్ధతి ఆయన్ను ఓ స్థాయిలో కూర్చోబెట్టాయి.
డబ్బు గురించి ఆయనకు పట్టింపులుండేవి కావు. ఒక్కోసారి నిర్మాతలు ‘మామ’కు పారితోషికం ఎగ్గొట్టేవారు. ఆ విషయం ఆయన నాకు ఏనాడూ చెప్పలేదు. తర్వాత నాకెప్పుడో తెలిసేది.
ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక దశకు వచ్చాక, సినిమాలు చేయడం మానేశారు. ‘వేరే ఎవరితోనైనా చేయించుకో’ అని చెప్పాకనే, నేను బయటివాళ్ల దగ్గరకు వెళ్లాను.
అప్పటికీ, ఇప్పటికీ నాకింత పేరు ఉందంటే అందులో ‘మామ’ మహదేవన్ అందించిన సంగీతం తాలూకు భాగస్వామ్యం సగం ఉంది. అందుకే మామను ఎప్పటికీ మర్చిపోలేను.