p chandra shekar reddy
-
పీసీ రెడ్డి మృతికి ఆచార్య సీఎంకే రెడ్డి సంతాపం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి(ఆచార్య సీఎంకే రెడ్డి) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘నెల్లూరు జిల్లాలో జన్మించి పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేధావి చంద్రశేఖరరెడ్డి. ఈయన దర్శకత్వం వహించిన 93 చిత్రాల్లో 55 చిత్రాలు కృష్ణగారితోనే తీయడం విశేషం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ
Supers Star Krishna Condolence To Director Death: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు. -
విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి
Tollywood Director P Chandra Shekar Reddy Died: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) ఇకలేరు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో చెన్నైలో టీ నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. పీసీ రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. సొంత ఊరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామం. 1933 అక్టోబర్ 15న పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకులు వి. మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావుల చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. దర్శకుడిగా మారాక ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు తదితర స్టార్స్‌తో సినిమాలు తెరకెక్కించారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ దర్శకుడిగా ఆయన అంగీకరించిన తొలి చిత్రం ‘అనురాధ’ (1971). కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందింది. అయితే ఇది మూడో చిత్రంగా విడుదలైంది. అదే ఏడాది కృష్ణతో ‘అత్తలు – కోడళ్లు’, శోభన్‌బాబు హీరోగా ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు తెరకెక్కించారు. విశేషం ఏంటంటే... ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు (1971, ఏప్రిల్ 14) విడుదల కావడంతో పాటు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి. ఇక మాస్ హీరోగా ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన హీరోగా పీసీ రెడ్డి తెరకెక్కించిన ‘బడి పంతులు’ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్‌ని వృద్ధ బడిపంతులుగా చూపించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆయన సరసన కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. కృష్ణతో పీసీ రెడ్డిది ప్రత్యేక అనుబంధం. కృష్ణతో 20 పై చిలుకు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘పాడి పంటలు’, ‘పచ్చని కాపురం’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఏసు ప్రభువు పాత్రలో కృష్ణతో ‘శాంతి సందేశం’ కూడా తెరకెక్కించారు. ఇంకా కృష్ణతో పాటు ఇతర స్టార్స్‌తో పీసీ రెడ్డి చేసిన చిత్రాల్లో ‘భలే అల్లుడు’, ‘మానవుడు – దానవుడు’, ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పట్నవాసం’, ‘అన్నా చెల్లెలు’, ‘పెద్దలు మారాలి’ వంటివి ఉన్నాయి. పీసీ రెడ్డి కెరీర్లో నాలుగైదు సినిమాలు ఆగిపోయినవి ఉన్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా ఆరంభమైన ‘చిన్న పులి – పెద్ద పులి’ ఒకటి. పీసీ రెడ్డి చివరి చిత్రం ‘జగన్నాయకుడు’. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత విశేషాలతో భానుచందర్, రాజా, మమత తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. పలు పౌరాణిక, సాంఘిక టీవీ సీరియల్స్ కూడా తెరకెక్కించారు. కృష్ణతో చేసిన ‘అన్నయ్య’ సీరియల్ మంచి హిట్. 40 ఏళ్లకు పైబడిన కెరీర్లో 75 సినిమాల వరకూ దర్శకత్వం వహించారాయన. పీసీ రెడ్డి భార్య కొంతకాలం క్రితం కన్ను మూశారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు శ్రీదేవి, అనురాధ. పీసీ రెడ్డి భౌతిక కాయానికి దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, తమిళ దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, నటుడు వైభవ్ తదితరులు నివాళులర్పించారు. కాగా పీసీ రెడ్డి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం చెన్నైలోని కొట్టూరుపురంలోని శ్మశానవాటికలో జరిగాయి. -
నా పేరులో సగం ‘మామ’ సంగీతానిది!
- సీనియర్ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి సందర్భం నేడు కేవీ మహదేవన్ జయంతి నేను ఇప్పటివరకూ 77 సినిమాలకు డెరైక్ట్ చేస్తే, అందులో 33 చిత్రాలకు ‘మామ’ కె.వి. మహదేవన్ స్వరాలందించారు. నేను సినిమా ఒప్పుకున్నాక తొలి ప్రాధాన్యం ఆయనకే ఇచ్చేవాణ్ణి. ఒకవేళ నిర్మాత గనక సంగీత దర్శకుడిగా వేరే పేరు చెబితే మాత్రం నేను అదేమిటని అడిగేవాణ్ణి కాదు. నాకు ‘మామ’ కావాలని మూర్ఖంగా పట్టుబట్టేవాణ్ణి కాదు. నిజానికి, మామతో నా అనుబంధం నేను దర్శకుడిని కాక ముందే మొదలైంది. దర్శకుడిని కాక ముందు నేను జగపతి సంస్థలో ‘అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు’ చిత్రాలకు వి. మధుసూదనరావు దగ్గర సహకార దర్శకునిగా పనిచేశాను. ఆ సంస్థకు ‘మామ’ కె.వి. మహదేవన్ ఆస్థాన సంగీత దర్శకులు. అప్పుడే ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సంస్థలో అన్ని చిత్రాల సంగీత చర్చల్లోనూ నేనూ పాల్గొనేవాణ్ణి. పాటకు బాణీ కట్టాక నా అభిప్రాయం కూడా అడిగి కనుక్కునేవారు. మామ చిన్నవాళ్లకూ విలువ ఇస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి! నన్ను ‘రెడ్డిగారూ’ అని పిలిచేవారాయన. నన్నలా పిలవకండని చెప్పినా వినేవారు కాదు. గౌరవం ఇవ్వడానికి చిన్నా పెద్దా తారతమ్యం ఉండకూడదని చెప్పేవారు. దర్శకునిగా నా తొలి సినిమా ‘అనూరాధ’ (1971). సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడు. నాకున్న సాన్నిహిత్యంతో ‘మామ’నే సంగీత దర్శకునిగా అడిగా. ఆయనా అనందంగా ఒప్పుకున్నారు. ‘అనూరాధ’ సగంలో ఉండగానే ‘అత్తలూ కోడళ్లూ’ (1971), ‘విచిత్ర దాంపత్యం’ (1971) సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఇందులో ‘అత్తలూ కోడళ్లూ’ చిత్రానికి మామే సంగీత దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ‘అనూరాధ’ నా మూడో చిత్రంగా విడుదలైంది. ‘అత్తలూ కోడళ్లూ’, ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు 1971 ఏప్రిల్ 14న ఒకే రోజు విడుదలయ్యాయి. పాటలకు మంచి పేరొచ్చింది. ఇక, పద్మాలయా సంస్థలో కృష్ణతో చేసిన ‘పాడిపంటలు’ (1976) సినిమాకు మామ అద్భుతమైన పాటలు ఇచ్చారు. అప్పట్లో ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా పెడదామని నిర్మాతలు అంటే, నేను వద్దని చెప్పి ‘మామ’ను రికమెండ్ చేశానని ఎవరో తప్పుగా ప్రచారం చేశారు. అది అవాస్తవం. ఆదినారాయణరావులాంటి గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం వస్తే నేను మాత్రం ఎందుకు వద్దనుకుంటాను. నిర్మాతలు ఎవరి పేరూ సూచించకపోవడంతో, నేను మామ దగ్గరకు వెళ్లానంతే! ఇంకో విషయం ఏంటంటే - ‘పాడి పంటలు’ సినిమా మొదట నందినీ ఫిలిమ్స్‌లో చేద్దామని ప్రయత్నించాం. ఆ సంస్థకు మ్యూజిక్ డెరైక్టర్‌గా మామ పర్మినెంట్. ఆ విధంగా కూడా ‘పాడిపంటలు’కు మామ స్వరాలందించారు. ఈ చిత్రంలోని ‘మన జన్మభూమి...’ పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్. నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ‘బడిపంతులు’ (1972). అది ఎంత గొప్ప కథో, అంత గొప్పగా సంగీతం కుదిరింది. అందులోని 9 పాటలూ వీనుల విందే. ముఖ్యంగా ‘బూచాడమ్మా... బూచాడు’, ‘భారతమాతకు జేజేలు’, ‘నీ నగుమోము నా కనులారా’ పాటలైతే క్లాసిక్స్. ‘ఇల్లు-ఇల్లాలు’ సినిమాకు కూడా చాలా మంచి పాటలిచ్చారు. ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా...’ పాట కామెడీ పాటల్లో అగ్రశ్రేణిలో నిలిచిపోతుంది. సెంటిమెంట్, లవ్, కామెడీ... ఇలా ఏ పాట అయినా మామకు కరతలామలకం. ‘జన్మజన్మల బంధం’ (1977)కు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విడుదల ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల ఇందులోని పాటలు పెద్దగా ప్రజాదరణ పొందలేకపోయాయి. ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి నాకిచ్చిన ఆ కానుక, నాకు సద్వినియోగం కాకుండా పోయింది. మామ వర్కింగ్ స్టయిల్ మిగతావారి కన్నా విభిన్నం. ఎక్కడా ఆర్భాటాలుండేవి కావు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు కూడా. ఏ పాట అయినా సరే 5, 10 నిమిషాల్లో సిద్ధం చేసేవారు. ఏదైనా మేగ్జిమమ్ అరగంటే. మామ, ఆయనకు కుడి భుజంలాంటి పుహళేంది ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుని పాట రెడీ చేసేసేవారు. వాళ్లు ఏం మాట్లాడుకునేవారో నాకు అర్థమయ్యేది కాదు కానీ, బాణీ బ్రహ్మాండంగా ఉండేది. సంగీత దర్శకునిగా ఆయన ఎంత గొప్పవాడో, మనిషిగా కూడా అంత గొప్పవాడు. మనుష్యుల్ని ప్రేమించే తీరు, మర్యాద ఇచ్చే పద్ధతి ఆయన్ను ఓ స్థాయిలో కూర్చోబెట్టాయి. డబ్బు గురించి ఆయనకు పట్టింపులుండేవి కావు. ఒక్కోసారి నిర్మాతలు ‘మామ’కు పారితోషికం ఎగ్గొట్టేవారు. ఆ విషయం ఆయన నాకు ఏనాడూ చెప్పలేదు. తర్వాత నాకెప్పుడో తెలిసేది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక దశకు వచ్చాక, సినిమాలు చేయడం మానేశారు. ‘వేరే ఎవరితోనైనా చేయించుకో’ అని చెప్పాకనే, నేను బయటివాళ్ల దగ్గరకు వెళ్లాను. అప్పటికీ, ఇప్పటికీ నాకింత పేరు ఉందంటే అందులో ‘మామ’ మహదేవన్ అందించిన సంగీతం తాలూకు భాగస్వామ్యం సగం ఉంది. అందుకే మామను ఎప్పటికీ మర్చిపోలేను.