kv mahadevan
-
సకలావనికే కల్పవల్లి...
మాతృదేవత చిత్రంలోని ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ/త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ’ అనే పాట అంటే చాలా ఇష్టం. ఈ చిత్రానికి అమ్మ (సావిత్రి) దర్శకత్వం వహించింది. ఈ పాటలో స్త్రీశక్తి ప్రతిబింబింబిస్తుంది. మహిళ గొప్పదనాన్ని డా. సి. నారాయణరెడ్డి ఎంతో ఉదాత్తమై పదాలతో ఈ పాటలో చూపారు. అందమైన పదాలు ఉపయోగించారు. పాటలోని పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా లయబద్ధంగా ఉంటాయి. పాటలో ‘మాత్రల’ (సిలబుల్స్) ను అలా పరుగులు పెట్టించారు ఆయన. నా చిన్నప్పుడు ఈ పాటకు డాన్స్ చేసేదాన్ని. అమ్మ మురిసిపోయేది. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో. మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సామాన్యంగా చెప్పారు. అంటే ఆమె ఒక సామాన్యురాలిగా ఎలా ఉంటుందో వివరించారు. ‘ఒక అన్నకు ముద్దుల చెల్లి/ ఒక ప్రియునికి వలపుల మల్లి/ఒక రామయ్యనే కన్నతల్లి/ సకలావనికే కల్పవల్లి’ అంటూ స్త్రీ అంటే చెల్లి, చెలి అంటూనే, ఒక తల్లి అని సామాన్యంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అన్నారు. సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ ఔన్నత్యాన్ని శిఖరాయమానంగా చూపారుు సినారె. ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది. రెండవ చరణంలో... సీతగా ధరణి జాతగా సహన శీలం చాటినది/రాధగా మధురబాధగా ప్రణయగాథల మీటినది/మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది/లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది’ అంటూ స్త్రీ ఏయే రంగాలలో, ఏయే సందర్భాలలో ఎంత నిబ్బరంగా, ఎంత సహనంగా, ఎంత ప్రణయంగా, ఎంత వీరత్వంతో పోరాడిందో.. అంతా కళ్లకు బొమ్మ కట్టినట్లు చూపారు. ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు. మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు/కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని హృదయానికి హత్తుకునేలా వర్ణించారు. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం. అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె. మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ వేరే ఏ రచయితా చూపలేదేమో అనిపిస్తుంది నాకు.ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. అమ్మ సినిమాలో ఈ పాట ఉండటం నాకు చాలా సంతోషం. ఈ పాట విన్నప్పుడల్లా ఆమ్మ అంతరంగం ఇదేనేమో అనిపిస్తుంది. చిత్రం : మాతృదేవత రచన : సి. నారాయణరెడ్డి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : పి. సుశీల, వసంత సంభాషణ : వైజయంతి పురాణపండ -
సినీ సంగీత ప్రపంచంలో.. మహానుభావులు ఎందరో
సంగీతానికి రాళ్లు కరుగుగతాయంటారు.. రాళ్లేమో కానీ మన మనసును మాత్రం ఇట్టే కరుగుతుంది. సంగీతానికి ఉండే శక్తి అటువంటింది. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మనసు బాగోలేకపోయినా.. మనకు ప్రశాంతత కరువైన నచ్చిన పాటలు వింటూ కొద్ది సేపు వింటే కిక్కే వేరప్ప. ఇక అందరికీ అన్ని పాటలు నచ్చకపోవచ్చు. కొందరికి మెలొడి సాంగ్స్, మరికొందరికి విప్లవ పాటలు, ఇంకొందరికి మాంచి ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్‌లు అంటే ఇష్టం. అయితే.. కొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోయేలా ఉంటుంది. భారతీయ సంగీత శాస్త్రంలో ఉన్న గొప్పతనం మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మెళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు వింటూ ఉంటే.. ఆకాశయానం చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల ప్రక్రియలను సృష్టించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి,థూ కొసరాజు, ఆత్రేయ, సాలూరి రాజేశ్వర్‌రావు, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ వారి సాహిత్యంతో పదాలు కొత్త పుంతలు తొక్కుతుంటే.. కెవి మహదేవన్, ఘంటసాల, రమేష్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి ఇలా ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంగీత ప్రపంచాన్ని తమ సృజనతో ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూనే ఉన్నారు. నాటి పాటలు వింటూ ఉంటే.. అవి ఎప్పటికీ చెరిగిపోవు అనేట్టు ఉంటాయి. ఇప్పటికి ఆ పాటలు ఈతరం నోటివెంట వస్తుంటాయంటేనే వాటి గొప్పదనం ఏంటో తెలుస్తోంది. పగలే వెన్నెల జగమే ఊయలా అంటూ ఘంటసాల సృష్టించిన పాట వింటూ ఉంటే నిజంగానే ఆ అనుభూతి కలుగుతుంది. రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా.. అంటూ సావిత్రి, ఎన్టీఆర్‌లు పాడుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు వారికి నీరాజనం పట్టారు. అంతా బ్రాంతియేనా.. దేవదాస్ చిత్రంలో పారు ఏడుస్తుంటే.. అందరీ కళ్లు చెమ్మగిల్లాయి. నా పాట నీ నోట పలకలా చిలకా.. అని నాగేశ్వర్రావు మూగమనుసులు సినిమాలో సావిత్రికి నేర్పిస్తుంటే.. ప్రేక్షకలోకం కూడా వంతపాడింది. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అంటూ ఏఎన్నార్ పాడితే.. కుర్రలోకం మత్తులో మునిగిపోయింది. జానకీ కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. అంటూ జయసుధ, శోభన్ బాబు పాడుకున్న ఈ పాట తరాలు మారినా దానిలోని స్వచ్చత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సందర్భానుసారంగా వచ్చే కొన్ని పాటలు మనిషి జీవితంలో భాగమైపోయాయి. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ పెళ్లి తంతులో కొన్ని పాటలను ప్లే చేయాల్సిందే అన్నట్లు అదొక రివాజుగా మారింది. పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు.. శుభమస్తు, మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే గీతాలు పెళ్లి మండపంలో మార్మోగాల్సిందే. ఇలా మనిషి పుట్టినప్పటి నుంచీ పోయేవరకు ఉండే ప్రతిఘట్టాన్ని పాటల రూపంలో మన చిత్రసీమ అందించింది. ఒక్కపాట ఓ జాతి మొత్తాన్ని కదిలించింది అంటే.. అది ఎంతటిప్రభంజాన్ని సృష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపేందుకు తెలుగు వీర లేవరా.. అంటూ గొంతెత్తితే వెండితెర దద్దరిల్లింది. మళ్లీ ప్రేక్షకుల నాడీ వేగాన్ని, రక్తపు ప్రవాహవేగాన్ని పెంచిన పాటలెన్నో చిత్రప్రపంచంలో వచ్చాయి. అందులో అందరికీ సుపరిచితమైనవి, ఇప్పటికీ అవి అక్షరసత్యంగా నిలిచినవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించినవవే. సిందూరంలో సినిమాలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.., గాయం చిత్రంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే రెండు పాటలు అప్పటి సమాజాన్నే కాదు ఇప్పటి సమాజాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. బందాలు, బంధుత్వాలు, ప్రేమజంట, విరాహవేదన, ఇలా ప్రతీఒక్క అంశంపై ఎన్నో పాటలు, మనసుపై చెరగని ముద్ర వేసిన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మపై వచ్చిన పాటలన్నీ ప్రేక్షకుల మనసులో నాటుకుపోయాయి. ఏఆర్ రెహమాన్, కీరవాణి, కోటి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ లాంటి దిగ్గజాలు ఎన్నో మరుపురాని అద్భుతమైన పాటలు అందించగా.. యువ సంగీత దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సంగీతం, పాటలు అనే కాన్సెప్ట్ మహాసముద్రం లాంటింది. ఇలా పాటలు, సంగీతం గురించి చెప్పుకుంటూ, రాసుకుంటూ పోతే ఎప్పటికీ ఆది అంతం ఉండదు. ఈ సంగీత ప్రపంచంలో ఎన్నో కొత్త స్వరాలను ప్రేక్షకులకు అందించిన, ప్రస్తుతం అందిస్తున్న ఎంతో మంది సంగీత దర్శకులకు, పాటల రచయితలకు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. -
కోకిలమ్మకు నల్లరంగు నలమిన వాడినేది కోరేది
కళాకారుడితోపాటు ఒక అన్వేషి కూడా అయినవాడు మాత్రమే ఈ ప్రశ్నల్ని సంధించగలడు. తన ఇంటిపేరుగా మారిపోయిన సిరివెన్నెల చిత్రం కోసం సీతారామశాస్త్రి రాసిన ఈ పాట– సృష్టిలోని వైరుధ్యాలను ఒక దగ్గర చేర్చడం వల్ల కవిత్వమైంది. దీనికి సంగీతం కె.వి.మహదేవన్. పాడింది బాలసుబ్రహ్మణ్యం. 1986లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. సుహాసిని, సర్వదమన్ బెనర్జీ నటీనటులు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగు నలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు -
నా పేరులో సగం ‘మామ’ సంగీతానిది!
- సీనియర్ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి సందర్భం నేడు కేవీ మహదేవన్ జయంతి నేను ఇప్పటివరకూ 77 సినిమాలకు డెరైక్ట్ చేస్తే, అందులో 33 చిత్రాలకు ‘మామ’ కె.వి. మహదేవన్ స్వరాలందించారు. నేను సినిమా ఒప్పుకున్నాక తొలి ప్రాధాన్యం ఆయనకే ఇచ్చేవాణ్ణి. ఒకవేళ నిర్మాత గనక సంగీత దర్శకుడిగా వేరే పేరు చెబితే మాత్రం నేను అదేమిటని అడిగేవాణ్ణి కాదు. నాకు ‘మామ’ కావాలని మూర్ఖంగా పట్టుబట్టేవాణ్ణి కాదు. నిజానికి, మామతో నా అనుబంధం నేను దర్శకుడిని కాక ముందే మొదలైంది. దర్శకుడిని కాక ముందు నేను జగపతి సంస్థలో ‘అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు’ చిత్రాలకు వి. మధుసూదనరావు దగ్గర సహకార దర్శకునిగా పనిచేశాను. ఆ సంస్థకు ‘మామ’ కె.వి. మహదేవన్ ఆస్థాన సంగీత దర్శకులు. అప్పుడే ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సంస్థలో అన్ని చిత్రాల సంగీత చర్చల్లోనూ నేనూ పాల్గొనేవాణ్ణి. పాటకు బాణీ కట్టాక నా అభిప్రాయం కూడా అడిగి కనుక్కునేవారు. మామ చిన్నవాళ్లకూ విలువ ఇస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి! నన్ను ‘రెడ్డిగారూ’ అని పిలిచేవారాయన. నన్నలా పిలవకండని చెప్పినా వినేవారు కాదు. గౌరవం ఇవ్వడానికి చిన్నా పెద్దా తారతమ్యం ఉండకూడదని చెప్పేవారు. దర్శకునిగా నా తొలి సినిమా ‘అనూరాధ’ (1971). సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడు. నాకున్న సాన్నిహిత్యంతో ‘మామ’నే సంగీత దర్శకునిగా అడిగా. ఆయనా అనందంగా ఒప్పుకున్నారు. ‘అనూరాధ’ సగంలో ఉండగానే ‘అత్తలూ కోడళ్లూ’ (1971), ‘విచిత్ర దాంపత్యం’ (1971) సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఇందులో ‘అత్తలూ కోడళ్లూ’ చిత్రానికి మామే సంగీత దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ‘అనూరాధ’ నా మూడో చిత్రంగా విడుదలైంది. ‘అత్తలూ కోడళ్లూ’, ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు 1971 ఏప్రిల్ 14న ఒకే రోజు విడుదలయ్యాయి. పాటలకు మంచి పేరొచ్చింది. ఇక, పద్మాలయా సంస్థలో కృష్ణతో చేసిన ‘పాడిపంటలు’ (1976) సినిమాకు మామ అద్భుతమైన పాటలు ఇచ్చారు. అప్పట్లో ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా పెడదామని నిర్మాతలు అంటే, నేను వద్దని చెప్పి ‘మామ’ను రికమెండ్ చేశానని ఎవరో తప్పుగా ప్రచారం చేశారు. అది అవాస్తవం. ఆదినారాయణరావులాంటి గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం వస్తే నేను మాత్రం ఎందుకు వద్దనుకుంటాను. నిర్మాతలు ఎవరి పేరూ సూచించకపోవడంతో, నేను మామ దగ్గరకు వెళ్లానంతే! ఇంకో విషయం ఏంటంటే - ‘పాడి పంటలు’ సినిమా మొదట నందినీ ఫిలిమ్స్‌లో చేద్దామని ప్రయత్నించాం. ఆ సంస్థకు మ్యూజిక్ డెరైక్టర్‌గా మామ పర్మినెంట్. ఆ విధంగా కూడా ‘పాడిపంటలు’కు మామ స్వరాలందించారు. ఈ చిత్రంలోని ‘మన జన్మభూమి...’ పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్. నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ‘బడిపంతులు’ (1972). అది ఎంత గొప్ప కథో, అంత గొప్పగా సంగీతం కుదిరింది. అందులోని 9 పాటలూ వీనుల విందే. ముఖ్యంగా ‘బూచాడమ్మా... బూచాడు’, ‘భారతమాతకు జేజేలు’, ‘నీ నగుమోము నా కనులారా’ పాటలైతే క్లాసిక్స్. ‘ఇల్లు-ఇల్లాలు’ సినిమాకు కూడా చాలా మంచి పాటలిచ్చారు. ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా...’ పాట కామెడీ పాటల్లో అగ్రశ్రేణిలో నిలిచిపోతుంది. సెంటిమెంట్, లవ్, కామెడీ... ఇలా ఏ పాట అయినా మామకు కరతలామలకం. ‘జన్మజన్మల బంధం’ (1977)కు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విడుదల ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల ఇందులోని పాటలు పెద్దగా ప్రజాదరణ పొందలేకపోయాయి. ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి నాకిచ్చిన ఆ కానుక, నాకు సద్వినియోగం కాకుండా పోయింది. మామ వర్కింగ్ స్టయిల్ మిగతావారి కన్నా విభిన్నం. ఎక్కడా ఆర్భాటాలుండేవి కావు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు కూడా. ఏ పాట అయినా సరే 5, 10 నిమిషాల్లో సిద్ధం చేసేవారు. ఏదైనా మేగ్జిమమ్ అరగంటే. మామ, ఆయనకు కుడి భుజంలాంటి పుహళేంది ఇద్దరూ ఏదో గుసగుసలాడుకుని పాట రెడీ చేసేసేవారు. వాళ్లు ఏం మాట్లాడుకునేవారో నాకు అర్థమయ్యేది కాదు కానీ, బాణీ బ్రహ్మాండంగా ఉండేది. సంగీత దర్శకునిగా ఆయన ఎంత గొప్పవాడో, మనిషిగా కూడా అంత గొప్పవాడు. మనుష్యుల్ని ప్రేమించే తీరు, మర్యాద ఇచ్చే పద్ధతి ఆయన్ను ఓ స్థాయిలో కూర్చోబెట్టాయి. డబ్బు గురించి ఆయనకు పట్టింపులుండేవి కావు. ఒక్కోసారి నిర్మాతలు ‘మామ’కు పారితోషికం ఎగ్గొట్టేవారు. ఆ విషయం ఆయన నాకు ఏనాడూ చెప్పలేదు. తర్వాత నాకెప్పుడో తెలిసేది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక దశకు వచ్చాక, సినిమాలు చేయడం మానేశారు. ‘వేరే ఎవరితోనైనా చేయించుకో’ అని చెప్పాకనే, నేను బయటివాళ్ల దగ్గరకు వెళ్లాను. అప్పటికీ, ఇప్పటికీ నాకింత పేరు ఉందంటే అందులో ‘మామ’ మహదేవన్ అందించిన సంగీతం తాలూకు భాగస్వామ్యం సగం ఉంది. అందుకే మామను ఎప్పటికీ మర్చిపోలేను.