
మాతృదేవత చిత్రంలోని ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ/త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ’ అనే పాట అంటే చాలా ఇష్టం. ఈ చిత్రానికి అమ్మ (సావిత్రి) దర్శకత్వం వహించింది. ఈ పాటలో స్త్రీశక్తి ప్రతిబింబింబిస్తుంది. మహిళ గొప్పదనాన్ని డా. సి. నారాయణరెడ్డి ఎంతో ఉదాత్తమై పదాలతో ఈ పాటలో చూపారు. అందమైన పదాలు ఉపయోగించారు. పాటలోని పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా లయబద్ధంగా ఉంటాయి. పాటలో ‘మాత్రల’ (సిలబుల్స్) ను అలా పరుగులు పెట్టించారు ఆయన. నా చిన్నప్పుడు ఈ పాటకు డాన్స్ చేసేదాన్ని. అమ్మ మురిసిపోయేది.
అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో.
మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సామాన్యంగా చెప్పారు. అంటే ఆమె ఒక సామాన్యురాలిగా ఎలా ఉంటుందో వివరించారు. ‘ఒక అన్నకు ముద్దుల చెల్లి/ ఒక ప్రియునికి వలపుల మల్లి/ఒక రామయ్యనే కన్నతల్లి/ సకలావనికే కల్పవల్లి’ అంటూ స్త్రీ అంటే చెల్లి, చెలి అంటూనే, ఒక తల్లి అని సామాన్యంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అన్నారు. సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ ఔన్నత్యాన్ని శిఖరాయమానంగా చూపారుు సినారె. ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది.
రెండవ చరణంలో... సీతగా ధరణి జాతగా సహన శీలం చాటినది/రాధగా మధురబాధగా ప్రణయగాథల మీటినది/మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది/లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది’ అంటూ స్త్రీ ఏయే రంగాలలో, ఏయే సందర్భాలలో ఎంత నిబ్బరంగా, ఎంత సహనంగా, ఎంత ప్రణయంగా, ఎంత వీరత్వంతో పోరాడిందో.. అంతా కళ్లకు బొమ్మ కట్టినట్లు చూపారు. ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు.
మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు/కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని హృదయానికి హత్తుకునేలా వర్ణించారు. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది. బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం. అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె.
మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ వేరే ఏ రచయితా చూపలేదేమో అనిపిస్తుంది నాకు.ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. అమ్మ సినిమాలో ఈ పాట ఉండటం నాకు చాలా సంతోషం. ఈ పాట విన్నప్పుడల్లా ఆమ్మ అంతరంగం ఇదేనేమో అనిపిస్తుంది.
చిత్రం : మాతృదేవత
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి. సుశీల, వసంత
సంభాషణ : వైజయంతి పురాణపండ