సెలబ్రిటీల న్యూడ్ ఫొటోలు లీక్ చేసి..!
- నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు
హాలీవుడ్ టాప్ హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీల జీమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి న్యూడ్ ఫొటోలను లీక్ చేసిన వ్యవహారంలో తన పాత్ర కూడా ఉందని ఓ వ్యక్తి న్యాయస్థానం ముందు నేరాన్ని ఒప్పుకొన్నాడు. జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్, కిర్‌స్టెన్ డంస్ట్ తదితరులు వందమందికిపైగా సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి నగ్న ఫొటోలను 2014 సెప్టెంబర్‌లో 'ద ఫాప్పెనింగ్' పేరిట ఇంటర్నెట్‌లో పెట్టడం పెనుదుమారం రేపింది. 4చాన్ అనే ఇంటర్నెట్ ఫోరంలో ఈ ఫొటోలు దర్శనమిచ్చాయి.
ఈ వ్యవహారంలో కొంతవరకు తన పాత్ర ఉందని అమెరికా పెన్సిల్వేనియాలోని లాంక్‌స్టర్‌కు చెందిన ర్యాన్ కొలిన్స్ అనే వ్యక్తి కాలిఫోర్నియా జిల్లా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. అయితే సెలబ్రిటీల ఫొటోలు ఇంటర్నెట్‌లో పోస్టు చేయడంగానీ, లీక్ చేయడంగానీ తాను చేయలేదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని అతను కోర్టుకు తెలిపాడు. అయితే అక్రమంగా ప్రముఖ వ్యక్తుల అంకౌంట్ల యాక్సెస్ పొందిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. ఈ అభియోగం కింద అతనికి 18 నెలల జైలుశిక్ష పడే అవకాశముంది.
హాలీవుడ్ హీరోయిన్లకు యాపిల్, గూగుల్ పేరిట బూకటపు ఈమెయిళ్లు పంపి, వారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను అతడు తెలుసుకున్నాడు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో 'ఫిషింగ్' అంటారు. ఈ వివరాలతో పలువురి ప్రైవేటు ఈమెయిల్ అకౌంట్లలోకి చొరబడి, వారి నగ్న ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని అతడు లీక్ చేశాడు. సెలబ్రిటీల ప్రైవేటు ఫొటోలు, వ్యక్తిగత సమాచారం లీక్ చేయడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని అతను చెప్తున్నప్పటికీ, ఎఫ్‌బీఐ మాత్రం అతడు చేసింది తీవ్రమైన నేరమని, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలతో అతను ఆడుకున్నాడని కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ యూజర్లు తమ వ్యక్తిగత అకౌంట్ల పాస్‌వర్డ్స్ బలోపేతం చేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే ఏ మెయిల్స్ పట్లనైనా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎఫ్‌బీఐ సూచించింది.