ఆడవాళ్ల కష్టం ఏంటో తెలిసొచ్చింది!
ఆడవాళ్ల కష్టం ఏంటో తెలిసొచ్చింది!
Published Sun, Feb 2 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
చురుకుతనానికి చిరునామా మంచు మనోజ్. కొత్తదనం కోసం తపించే నేటి హీరోల్లో మనోజ్ కూడా ఒకరు. గత ఏడాది వచ్చిన ‘పోటుగాడు’లో కూడా మనోజ్‌ది భిన్నమైన పాత్రే. తండ్రి మోహన్‌బాబు, అన్నయ్య విష్ణుతో కలిసి మనోజ్ నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం ఇటీవలే విడుదలైంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్త్రీ పాత్రను కూడా సమర్థవంతంగా పోషించి అదరహో అనిపించారు మనోజ్. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం విలేకరులతో చెప్పిన ముచ్చట్లు...
ఈ సినిమాలో ముందు నేను లేను. నాన్నగారు, అన్నయ్య, వరుణ్, తనీష్ హీరోలు. ‘పోటుగాడు’ షూటింగ్‌లో ఉండగా నాన్నగారు ఫోన్ చేసి ‘మన సినిమాలో నువ్వు కూడా ఉన్నావ్’ అని చెప్పారు. శ్రీవాస్, కోన వెంకట్, గోపిమోహన్‌లకు ఫోన్ చేస్తే, ‘కథలో క్యారెక్టర్లు రాస్తుంటే ఫలానా పాత్రకు నువ్వు అయితే బాగుంటావనిపించింది. ఆ విషయమే మీ నాన్నగారికి చెప్పాం. ఆయన ఓకే అనేశారు’ అని అన్నారు. అలా అనుకోకుండా ఎంటరయ్యాను. బ్యాంకాక్‌లో షూటింగ్ పూర్తయ్యాక ‘లేడీ గెటప్’ థాట్ వచ్చింది. ఈ గెటప్ బాగా రావడానికి మా అక్క లక్ష్మీప్రసన్న సహకరించింది.
రాజేంద్రప్రసాద్ వీరాభిమానిని
నేను రాజేంద్రప్రసాద్‌గారి వీరాభిమానిని. ఆయన సినిమా విడుదలైతే బ్యానర్లు కట్టేవాణ్ణి. ‘మేడమ్’ సినిమాలో ఆయన వేసిన లేడీగెటప్‌ని స్ఫూర్తిగా తీసుకున్నాను. అలాగే, రవీనాటాండన్, హన్సికలను గమనించేవాణ్ణి. బ్రహ్మానందం అంకుల్ సలహాలు కూడా తీసుకున్నాను. ఈ గెటప్ వేయడానికి మూడు గంటలు పట్టేది. ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆడవాళ్ల కష్టమేంటో, అలంకరణకు అంత టైమ్ ఎందుకు తీసుకుంటారో ఈ సినిమా చేశాక తెలిసొచ్చింది.
హన్సిక మా ఫ్యామిలీ హీరోయిన్!
వరుణ్, తనిష్ చక్కగా సహకరించారు. మాతో పాటు వాళ్ళు కూడా ఈ సినిమాలో చేయడంతో ఈ సినిమాకు భారీ మల్టీస్టారర్ లుక్ వచ్చింది. ఇక, హన్సిక మా ఫ్యామిలీ హీరోయిన్ అయిపోయింది. త్వరలో నా సరసన కూడా తను చేయనుంది.
మూడేళ్ల తర్వాత ఆలోచిస్తా.
జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్, సాగర్ అనే కొత్త దర్శకునితో ‘సన్నాఫ్ పెదరాయుడు’ అనే సినిమా చేయబోతున్నా. పెళ్లి గురించి మూడేళ్ల తర్వాత ఆలోచిస్తా.
Advertisement
Advertisement