Pandavulu Pandavulu Tummeda
-
సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా....
విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ అందాలంటే తనకెంతో ఇష్టమని తాను సినిమాలకు రాసే కథలు, డైలాగులు ఇక్కడికే వచ్చి రాసుకుంటానని వర్థమాన సినిమా కథల రచయిత డైమండ్ రత్నంబాబు తెలిపారు. కటుంబ సభ్యులతో నాగార్జున సాగర్ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దిల్ రాజు బ్యానర్‌పై తీసిన 'పిల్లా నీవులేని జీవితం' సినిమా ఈ నెల 30న విడుదల కానుందని ఆ సినిమాకు కథలో పాటు డైలాగులు తానే రాసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి మేనల్లుడు సాయిరామ్తేజ హీరో నటించినట్లు చెప్పారు. కల్యాణ్‌రాం హీరోగా తీసిన షేర్ సినిమా, సీమశాస్త్రి సినిమాకు కథలు తానే రాసినట్లు రత్నంబాబు తెలిపారు. 'సోలో' సినిమాకు డైలాగులు సాగర్‌లో కూర్చొని రాసినట్లు ఆయన వివరించారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు కథతో పాటు డైలాగులు రాసినట్లు చెప్పారు. తన శ్రమను గుర్తించిన ప్రముఖ హీరో మోహన్ బాబు సినిమా ఆడియో ఫంక్షన్లో తనకు లక్ష నగదు ప్రోత్సాహకం ఇవ్వడం మరచిపోలేనన్నారు. ఇప్పటికీ 7 సినిమాలకు కథలు మరికొన్ని సినిమాలకు డైలాగులు రాసినట్లు వివరించారు. నాగార్జున సాగర్‌తో పాటు తాను ఇక్కడ నుంచి బాపట్లకు వెళ్లి సముద్ర సమీప రిసార్ట్‌లలో కూర్చోని కథలు, డైలాగులు రాసుకుంటానని రచయిత రత్నంబాబు చెప్పారు. -
హిట్ ఫెయిర్
-
ఆ విషయంలో నేను లక్కీ
‘‘సినీ పరిశ్రమలో పేరెన్నికగన్న కుటుంబాలు నాలుగైదుంటాయి. వారు తమ ఫ్యామిలీస్‌తో సినిమాలు చేస్తే... ఓ నాలుగైదు సినిమాలొస్తాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఓ సినిమా చేసే అవకాశం నాకొచ్చింది. ఆ విషయంలో నేను లక్కీ’’ అని దర్శకుడు శ్రీవాస్ అన్నారు. ఆయన దర్శకత్వంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్‌సందేశ్, తనీష్, హన్సిక, ప్రణీత కలిసి నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. గత వారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘‘మోహన్‌బాబు లాంటి లెజెండ్‌తో పనిచేసేటప్పుడు ఏదైనా తేడా వస్తే మళ్లీ మొహం చూపించలేం. అందుకే.. ముగ్గురు రచయితలతో కలిసి కష్టపడి ఈ చిత్రానికి పనిచేశాను. మోహన్‌బాబు కూడా ఎంతో సహకరించారు. జనరేషన్‌కి తగ్గట్టుగా మాడ్యులేషన్ మార్చుకుని ప్రేక్షకుల్ని మెప్పించారు’’ అని శ్రీవాస్ తెలిపారు. ‘‘నా తొలి చిత్రం ‘లక్ష్యం’, తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’. ఇప్పుడు ఇది. నా మూడు సినిమాలూ మల్టీస్టారర్లే కావడం యాదృచ్ఛికం’’ అన్నారు శ్రీవాస్. సినిమా బాగా తీశావ్ అని కొందరంటే... ఇంతమంది హీరోల్ని బాగా హ్యాండిల్ చేశావ్ అని ఇంకొందరు అన్నారని, తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అదే అనిపించిందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేశారు. కథా విస్తరణ సమయంలోనే మనోజ్‌తో లేడీ గెటప్ వేయించాలనే ఆలోచన వచ్చిందని, మనోజ్‌కి ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేశాడని, ‘నర్తనశాల’ స్ఫూర్తిగా ద్వితీయార్ధాన్ని తీర్చిదిద్దామని, బృహన్నల పాత్రే మనోజ్ స్త్రీ వేషానికి ప్రేరణ అని శ్రీవాస్ చెప్పారు. మోహన్‌బాబు సలహా మేరకు లక్ష్మీప్రసన్నతో ఓ పాట అనుకున్నామని, పాట రికార్డింగ్ కూడా చేశామని, కానీ ఆ పాటను సినిమాలో చేర్చడం కుదర్లేదని శ్రీవాస్ చెప్పారు. -
ఆడవాళ్ల కష్టం ఏంటో తెలిసొచ్చింది!
చురుకుతనానికి చిరునామా మంచు మనోజ్. కొత్తదనం కోసం తపించే నేటి హీరోల్లో మనోజ్ కూడా ఒకరు. గత ఏడాది వచ్చిన ‘పోటుగాడు’లో కూడా మనోజ్‌ది భిన్నమైన పాత్రే. తండ్రి మోహన్‌బాబు, అన్నయ్య విష్ణుతో కలిసి మనోజ్ నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం ఇటీవలే విడుదలైంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్త్రీ పాత్రను కూడా సమర్థవంతంగా పోషించి అదరహో అనిపించారు మనోజ్. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం విలేకరులతో చెప్పిన ముచ్చట్లు... ఈ సినిమాలో ముందు నేను లేను. నాన్నగారు, అన్నయ్య, వరుణ్, తనీష్ హీరోలు. ‘పోటుగాడు’ షూటింగ్లో ఉండగా నాన్నగారు ఫోన్ చేసి ‘మన సినిమాలో నువ్వు కూడా ఉన్నావ్’ అని చెప్పారు. శ్రీవాస్, కోన వెంకట్, గోపిమోహన్లకు ఫోన్ చేస్తే, ‘కథలో క్యారెక్టర్లు రాస్తుంటే ఫలానా పాత్రకు నువ్వు అయితే బాగుంటావనిపించింది. ఆ విషయమే మీ నాన్నగారికి చెప్పాం. ఆయన ఓకే అనేశారు’ అని అన్నారు. అలా అనుకోకుండా ఎంటరయ్యాను. బ్యాంకాక్‌లో షూటింగ్ పూర్తయ్యాక ‘లేడీ గెటప్’ థాట్ వచ్చింది. ఈ గెటప్ బాగా రావడానికి మా అక్క లక్ష్మీప్రసన్న సహకరించింది. రాజేంద్రప్రసాద్ వీరాభిమానిని నేను రాజేంద్రప్రసాద్‌గారి వీరాభిమానిని. ఆయన సినిమా విడుదలైతే బ్యానర్లు కట్టేవాణ్ణి. ‘మేడమ్’ సినిమాలో ఆయన వేసిన లేడీగెటప్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. అలాగే, రవీనాటాండన్, హన్సికలను గమనించేవాణ్ణి. బ్రహ్మానందం అంకుల్ సలహాలు కూడా తీసుకున్నాను. ఈ గెటప్ వేయడానికి మూడు గంటలు పట్టేది. ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆడవాళ్ల కష్టమేంటో, అలంకరణకు అంత టైమ్ ఎందుకు తీసుకుంటారో ఈ సినిమా చేశాక తెలిసొచ్చింది. హన్సిక మా ఫ్యామిలీ హీరోయిన్! వరుణ్, తనిష్ చక్కగా సహకరించారు. మాతో పాటు వాళ్ళు కూడా ఈ సినిమాలో చేయడంతో ఈ సినిమాకు భారీ మల్టీస్టారర్ లుక్ వచ్చింది. ఇక, హన్సిక మా ఫ్యామిలీ హీరోయిన్ అయిపోయింది. త్వరలో నా సరసన కూడా తను చేయనుంది. మూడేళ్ల తర్వాత ఆలోచిస్తా. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్, సాగర్ అనే కొత్త దర్శకునితో ‘సన్నాఫ్ పెదరాయుడు’ అనే సినిమా చేయబోతున్నా. పెళ్లి గురించి మూడేళ్ల తర్వాత ఆలోచిస్తా. -
సినిమా సక్సెస్ పై హర్షం వ్యక్తం చేసిన మోహన్ బాబు
-
నేనేనా...నమ్మలేకపోతున్నా...!
హైదరాబాద్ : 'పాండవులు పాండవులు తుమ్మెద'కు మంచి టాక్ వచ్చింది. ఇందులో నేను అమ్మాయి గెటప్ వేశా. అది చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. ఆ క్యారెక్టర్ చేసింది నేనేనా అని నమ్మకం కలగటం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు హీరో మంచు మనోజ్. ఈ చిత్రంలో అతడు స్త్రీ పాత్ర పోషించాడు. ఆ లేడీ గెటప్‌కు మంచి స్పందన రావటంతో మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బేగంపేట బిగ్ ఎఫ్ఎం 92.7లో శుక్రవారం అతడు సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆర్జే జోసు ఈవెనింగ్ డ్రైవ్ టైమ్‌కు హోస్ట్‌గా నియమించారు. ‘గోల్మాల్-3’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ డా. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కాంబినేషన్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం . విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. రవీనా టండన్ ప్రధాన పాత్ర పోషించారు. -
సినిమా రివ్యూ: పాండవులు పాండవులు తుమ్మెద
పాజిటివ్ పాయింట్స్: మోహన్ బాబు యాక్టింగ్ ఎంటర్ టైన్ మెంట్ యాక్షన్ సీన్లు నెగిటివ్ పాయింట్స్: రొటీన్ కథ మోహన్ బాబు, రవీనా టాండన్, విష్ణు, మనోజ్, హన్సిక, ప్రణీత లాంటి భారీ తారాగాణంతో రూపొందిన 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి దర్శకుడు శ్రీవాస్. ఓ హిందీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మంచు విష్ణు, మనోజ్ లు నిర్మించిన ఈ మల్టీ స్టారర్ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. . చాలా కాలం తర్వాత మోహన్ బాబు, రవీనా టాండన్ జంటగా కనిపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజిలో మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. బ్యాంకాక్ లోని పట్టయాలో నాయుడు టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తుంటాడు. నాయుడుకి అల్లరి చిల్లరిగా తిరిగే ముగ్గురు (మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్) కొడుకులుంటారు. అదే ప్రాంతంలో సత్యమీనన్ (రవీనా టాండన్) హోటల్ వ్యాపారం చేస్తుంటుంది. సత్య మీనన్ కి ఇద్దరు (విష్ణు, వెన్నెల కిషోర్) కొడుకులుంటారు. నాయుడు (మోహన్ బాబు), సత్యమీనన్ (రవీనా టాండన్) ల మధ్య ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు నిరాకరించడం, ఇతర కారణాల వల్ల విడిపోతారు. సత్య వద్ద పేయింగ్ గెస్ట్ గా ఉండే హనీ(హన్సిక)కి నాయుడు, సత్యల ప్రేమ కథ తెలుస్తుంది. విడిపోయిన నాయుడు, సత్యలను హనీ కలిపి పెళ్లి చేస్తుంది. అయితే అప్పటికే విజయ్ (విష్ణు)ని ప్రేమిస్తున్న హనీని ఓ విలన్ గ్యాంగ్ వచ్చి ఎత్తుకెళ్తుంది. విలన్ గ్యాంగ్ చెరలో ఉన్న హనీని నాయుడు కుటుంబం కాపాడాలని బ్యాంకాక్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి బయలుదేరుతారు. అయితే హనీని విలన్ గ్యాంగ్ ఎందుకు ఎత్తుకెళ్లింది? ముగ్గురు కొడుకులున్న నాయుడు, ఇద్దరు కుమారులున్న సత్యల గతమేంటి. వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాడానికి ఏ పరిస్థితులు దారి తీశాయి? హనీని ఏ విధంగా విలన్ గ్యాంగ్ నుంచి రక్షించుకున్నారు?. 'మహాభారతం' నేపథ్యం ఉన్న టైటిల్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర కథ. నాయుడు పాత్రతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మళ్లీ చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే పాత్రను ఎంచుకుని మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ చిత్ర భారాన్ని మోహన్ బాబు తన భుజాన వేసుకుని ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ బాబు తన నటనతో గతాన్ని గుర్తు చేశారు. ఇక మోహన్ బాబుకు చేదోడు వాదోడుగా విజయ్ పాత్రలో విష్ణు, మోహన్ పాత్రలో మనోజ్ లు తమ పాత్రను సమర్థంగానే పోషించారు. విష్టు లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ ను తనదైన శైలిలో నడపగా, మనోజ్ 'మోహిని' పాత్రతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక వరుణ్ సందేశ్, తనీష్ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్ గురించి. సత్య మీనన్ గా గ్లామర్ తోపాటు, నటనతో అదరగొట్టేసింది. చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించిన రవీనా నేటితరం తారలకు ధీటుగా గ్లామర్ తో ఆకట్టుకున్నారు. హన్సిక, ప్రణిత పాత్రలు గ్లామర్ కే పరిమితమయ్యాయి. ఈ చిత్రంలో విలనిజానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ముఖేశ్ రుషి ఓకే అనిపించారు. కమెడియన్లలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. సెకాండాఫ్ లో మనోజ్, బ్రహ్మనందం, సుప్రీత్ ఇతర పాత్రలతో కలిసి పండించిన వినోదం ఈ చిత్రానికి బలానిచ్చింది. దాసరి నారాయణరావు ఓప్రత్యేక పాత్రలో కాసేపు కనిపించినా తన మార్కుతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ: 'ఢీ', 'దేనికైనా రెఢీ', 'దూసుకెళ్తా' చిత్రాలు అందించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అదే పంథాలో 'పాండవులు పాండవులు తుమ్మెద' రూపొందించారనిపిస్తుంది. మోహన్ బాబు నాయుడు, పక్కాగా పాత్రలను డిజైన్ చేసుకుని.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుని జాగ్రత్త పడ్డారు. మంచు మనోజ్ అందించిన ఫైట్స్, చిన్నా బ్యాంక్ గ్రౌండ్ స్కోర్, బప్పా లహిరి, కీరవాణి, అంచు సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. మోహన్ బాబు చేత చెప్పించిన డైలాగ్స్ అక్కడక్కడ బ్రహ్మండంగా పేలాయి. సెకండాఫ్ లో మోహిని పాత్ర ద్వారా పండించిన వినోదం లో దర్శకుడు శ్రీవాస్ సఫలమయ్యారు. మోహినిగా మనోజ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఎక్కడ అశ్లీలతకు తావివ్వకుండా హస్యాన్ని మోహిని పాత్ర ద్వారా మనోజ్ మేనేజ్ చేశారు. ఇక భారీ తారాగణంతో మల్టీ స్టారర్ చిత్రాలను తెరకెక్కించడం ప్రస్తుత ట్రెండ్ లో కత్తి మీద సామే. అయితే మోహన్ బాబు, విష్ణు, మనోజ్, రవీనా టాండన్, హన్సిక కాంబినేషన్ లో వారి ఇమేజ్ కు తగినట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో సఫలమైన దర్శకుడు శ్రీవాసుకు టాలీవుడ్ లో ప్రమోషన్ లభించినట్టే. ఈ చిత్రంలో అనేక సానుకూల అంశాలు డామినేట్ చేయడంతో కొన్ని లోపాలు మరుగున పడ్డాయి. ఏది ఏమైనా అనవసరపు ప్రయోగాలకు తావివ్వకుండా పక్కా సక్సెస్ ఫార్ములాతో రూపొందించిన ఈ చిత్రం గురించి ఎలాంటి లాజిక్కులతో ఆలోచించకుండా.. వినోదాన్నిఆశించే వీకెండ్ ప్రేక్షకులు 'పాండవులు పాండవులు తుమ్మెద'ను హాయిగా ఆస్వాదించవచ్చు. -
‘పద్మశ్రీ’ చూసి సినిమాకు జనాలొస్తారని అనుకోను!
‘‘రాష్ట్రంలో కీలకమైన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి... అందరూ నాన్నగారి ‘పద్మశ్రీ’ ఇష్యూ మీదే ఎందుకు దృష్టి సారిస్తున్నారో అర్థం కావడంలేదు’’ అని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల అవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా... పేరుకు ముందు ‘పద్మశ్రీ’ అనే అక్షరాల్ని చూసి సినిమాకు జనాలు వస్తారని తాను అనుకోనని, దాని వల్ల తమకు రికార్డులేం సొంతం కావని విష్ణు ఘాటుగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు నటించిన సినిమాల్లో కూడా టైటిల్స్‌లో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ’ ఉంచేవారు. దాంతో అదేం తప్పుకాదు అనుకున్నాం. కానీ కోర్టు తీర్పు తర్వాత ‘పద్మశ్రీ’ బిరుదు విషయంలో మాకొక క్లారిటీ వచ్చింది. అవార్డు పొందిన వారి పేరు ముందు కానీ, పేరు వెనుక గానీ ‘పద్మశ్రీ’ అని వాడకూడదు. పేరు తర్వాత ‘రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన’ అని వేసుకోవచ్చు. ఇక నుంచి అలాగే చేస్తాం’’ అని చెప్పారు విష్ణు. -
‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...
40 ఏళ్ల సినీ ప్రస్థానం.. 500 పైచిలుకు సినిమాలు.. భిన్నమైన పాత్రలు.. నిర్మాతగా 50కి పైన సినిమాలు. ఇంకా రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ. నిజంగా మోహన్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన రూటే సెపరేట్ అనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష... ఈ మూడింటి వల్లే ఇంత సాధించగలిగానంటారు మోహన్‌బాబు. చాలా విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. శ్రీవాస్ దర్శకత్వంలో మంచు విష్ణు, మనోజ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు మోహన్‌బాబు. ఏ ఒక్కరి వంశమూ తక్కువ కాదు: హీరోగా నటించి చాలాకాలం అయ్యింది. అందుకే ‘రావణ’ సినిమా చేయాలనుకున్నా. అయితే... అది వంద కోట్ల ప్రాజెక్ట్. కాస్త టైమ్ పడుతుంది. అందుకే... ఈ లోపు ఏదైనా మంచి పాత్ర దొరికితే చేద్దాం అనుకుంటున్న టైమ్‌లో... ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో నా కుమారులు విష్ణు, మనోజ్‌లు ఉండటంతో చాలామంది ‘మంచు వంశం’ అని మాట్లాడుతున్నారు. వంశం, వంశపారంపర్యం లాంటి మాటలు నాకస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరి వంశం గొప్పదే. ఏ ఒక్కరి వంశం తక్కువది కాదు. ఇక్కడ గొప్పవాళ్లు ఎవరూ ఉండరు. దేవుడొక్కడే గొప్పవాడు. ‘కులం’ అనే రెండక్షరాలను వినడానికి కూడా ఇష్టపడను. ‘మనుషులంతా ఒక్కటే’ అని చెప్పిన అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తా. టూరిస్ట్ గైడ్ నాయుడిగా: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్.. వెనక్కి తీసుకోవడంలో వీక్’ అనేది ఇందులో నా డైలాగ్. నా పాత్ర స్వభావానికి అద్దం పట్టే డైలాగ్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘టూరిస్ట్‌గైడ్ నాయుడు’. రెండు రకాల షేడ్స్ ఉన్న ఈ తరహా పాత్రను నేనెప్పుడూ చేయలేదు. చాలా రోజుల తర్వాత మంచి డైలాగులు చెప్పే ఛాన్స్ ఈ పాత్రతో నాకు దక్కింది. ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టించేలా నా డైలాగులుంటాయి. ‘జీవితం ఓ పుస్తకం లాంటిది. మొదటి పేజీలో పుట్టుకని, చివరి పేజీలో మరణాన్ని రాసిపెట్టాడు దేవుడు. మధ్యలో పేజీలన్నీ ఖాళీ. అందులో నువ్వు ఏది రాసుకుంటే అదే జీవితం’ అని ఓ సందర్భంలో అంటా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. భార్యాభర్తల అనుబంధంపై ‘పెదరాయుడు’లో ఓ డైలాగ్ చెప్పాను. అంతటి గొప్ప డైలాగ్ ఇందులోనూ ఉంది. కొన్ని డైలాగుల్లో వినిపించే తాత్వికత ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకుంటాడు మనోజ్: ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టామో ఇప్పుడే రివీల్ చేయలేను. ఇందులో మనోజ్ ఆడవేషం వేసిన సంగతి తెలిసిందే. ‘నర్తనశాల’లో అన్నగారు చేసిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంత పేరు తెచ్చిందో.. ఇందులోని ఆడ వేషం మనోజ్‌కి అంత పేరు తెస్తుంది. మనోజ్ నా బిడ్డ అని ఈ మాట చెప్పడంలేదు. సినిమా చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ద్వితీయార్ధమంతా తన భుజస్కందాలపై మోసాడు మనోజ్. ఇది ‘గోల్మాల్-3’ కాదు: రవి అనే వ్యక్తి దగ్గర ఈ కథ కొన్నాం. తర్వాతే తెలిసింది.. ఈ కథకు బాలీవుడ్ ‘గోల్మాల్-3’కి సంబంధం ఉందని. అతణ్ణి అడిగితే.. ‘వాళ్లే నా కథను కాపీ కొట్టారు’ అన్నాడు. అందుకే... కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.ఎస్.రవి కలిసి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ విషయంలో నేను చెప్పేదొక్కటే.. ‘గోల్మాల్-3’ చిత్రానికీ మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుంది: 30 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీశాం. కానీ బయ్యర్లు పాతిక కోట్లకే సినిమాను అడిగారు. అందుకే సొంతంగా విడుదల చేస్తున్నాను. ‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాహసం చేసి సొంతంగా విడుదల చేశాను. ఆ సినిమా చరిత్ర సృష్టించింది. మళ్లీ ఆ చరిత్ర ఈ సినిమా విషయంలో పునరావృతం అవుతుందని నా నమ్మకం. దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. ప్రభాస్ అంటే ఇష్టం: నేటి హీరోల్లో ఎవరి స్టైల్ వారిది. అందరిలో ప్రభాస్ అంటే ఇష్టం. మేమిద్దరం ‘బావ.. బావ’ అని పిలుచు కుంటాం. -
పంచ్ పాండవులు
బొక్కా లంబోదరం ఉరఫ్ లంబోరా.. తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకుని.. అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా... ది రిలేషన్షిప్ బిట్వీన్ టు పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్‌మేన్..లాంటి డైలాగ్స్‌ని చెప్పడంలో మోహన్‌బాబు స్టయిలే వేరు. ఈ డైలాగులు ఆయన ఎప్పుడో చెప్పినా... ఇప్పటికీ గుర్తుండిపోయాయి. దానికి కారణం ఆ డైలాగ్స్‌ని మోహన్‌బాబు చెప్పిన తీరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ పదేళ్లల్లో మోహన్‌బాబు పూర్తి స్థాయి కథానాయకునిగా నటించకపోవడంతో ఇలాంటి పంచ్ డైలాగుల్ని ఆయన నుంచి ప్రేక్షకులు మిస్సయ్యారు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఆ కొరత తీరుస్తుందని విష్ణు, మనోజ్ అంటున్నారు. డా. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కాంబినేషన్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఇది. విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నా తరహా సెటైరికల్ డైలాగ్స్, మనోజ్ సమకూర్చిన పోరాట దృశ్యాలు, డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డా. దాసరి నారాయణరావు చేసిన కీలక పాత్ర మరో ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత నాయికలుగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
30 కోట్లతో పాండవులు.. తీశాం: మోహన్ బాబు
రొమాంటిక్ డ్రామా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెదా'ను 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో భారీగా రూపొందించినట్లు నటుడు, నిర్మాత మోహన్ బాబు తెలిపారు. తన ఇద్దరు కుమారులు మంచు మనోజ్, విష్ణు ఇద్దరితో కలిసి మోహన్ బాబు కలిసి తొలిసారిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన కుమారులిద్దరూ నటిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు బాగా పెరిగాయని, అందుకే తాము ఈ విషయంలో రాజీ పడదలచుకోలేదని ఆయన తెలిపారు. అందుకే 30 కోట్లతో సినిమా తీశామన్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం షడ్రసోపేతమైన విందు అందిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పోస్టర్ విడుదల నుంచి ఆడియో రిలీజ్, ట్రైలర్ల విడుదల వరకు ప్రతి స్థాయిలో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సినిమాలో ఇంకా రవీనా టాండన్, వరుణ్ సందేశ్, హన్సిక, ప్రణీత, తనీష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బప్పా లహరి, అచ్చు రాజమణి, చిన్నా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. -
మనోజ్ కాదు...మనోజ
‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో మూడు ప్రత్యేకతలున్నాయి. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్... ఇలా ‘మంచు’ కుటుంబం మొత్తం ఈ సినిమాలో నటిస్తోంది. ఒకప్పటి హిందీ కథానాయిక రవీనా టాండన్ పన్నెండేళ్ల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఇక మూడోప్రత్యేకత ఏంటంటే... మంచు మనోజ్ ఇందులో స్త్రీ పాత్ర పోషించారు. ఆ లేడీ గెటప్‌కు సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ‘‘నా తమ్ముడు మనోజ్ పోషించిన లేడీ కేరెక్టర్ ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని విష్ణు చెప్పారు. ఈ స్త్రీ పాత్ర పోషణ కోసం మనోజ్ చాలా కష్టపడ్డానని చెబుతున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘గోల్మాల్-3’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. వరుణ్‌సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు విష్ణు, మనోజ్ చెప్పారు. -
మోహన్‌బాబులాంటి నిర్మాతకే థియేటర్లు దొరకడం లేదు - దాసరి
. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సంక్రాంతికే విడుదల చేయమన్నాను. థియేటర్లు దొరకడం లేదని మోహన్‌బాబు చెప్పాడు. మోహన్‌బాబు లాంటి నిర్మాతకే థియేటర్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, రవీనాటాండన్, ప్రణీత తదితరులు ముఖ్యతారలుగా శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని దాసరి ఆవిష్కరించి, కె.రాఘవేంద్రరావుకి ఇచ్చారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘ఈ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఉయ్యాల జంపాల, పాండవులు పాండవులు తుమ్మెద... లాంటి అచ్చ తెలుగు టైటిల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ తర్వాత విలక్షణమైన పాత్రలు అత్యధికంగా చేసింది మోహన్‌బాబు. తెర నిండుగా ఇంతమంది తారలతో సినిమా చేయడం చాలా కష్టం. ఈ విషయంలో శ్రీవాస్‌ని అభినందించాలి’’ అన్నారు. వరుణ్ సందేశ్, తనీష్ చాలా అద్భుతంగా చేశారని మోహన్‌బాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. మనోజ్ మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్, నరేష్ తదితరులు స్త్రీ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఇందులో నేను అమ్మాయిగా వేషం వేశాను. మేకప్‌కి చాలా సమయం పట్టేది. అమ్మాయిగా పుడితే ఇంత కష్టమా అనిపించింది. నిర్మాతగా నా పేరు ఉన్నా అంతా అన్నయ్యే చూసుకున్నాడు’’ అని తెలిపారు. ఈ వేడుకలో నిర్మల, విష్ణు, విరానికా, బేబి అరియానా, బేబి వివియానా, బి.గోపాల్, వరప్రసాద్‌రెడ్డి, బ్రహ్మానందం, పరుచూరి బ్రదర్స్, ప్రణీత, అచ్చు తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీ వేషంలో మంచు మనోజ్!
డా.మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కలిసి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలు. వరుణ్‌సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ప్రత్యేక పాత్రధారులు. ‘లక్ష్యం’ఫేం శ్రీవాస్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మోహన్‌బాబు ఓ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మనోజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అయితే... ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో మనోజ్ స్త్రీ వేషంలో కనిపించనుండటం విశేషం. టైటిల్‌కి, టైటిల్ లోగోకు మంచి ఆదరణ లభిస్తోందని చిత్రం యూనిట్ ఓ ప్రకటన ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మనోజ్ ఫస్ట్‌లుక్‌ని మీడియాకు విడుదల చేశారు. జనవరిలో ఈ చిత్రం పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. -
పాండవులు పాండవులు తుమ్మెద...
‘పాండవులు పాండవులు తుమ్మెద... పంచ పాండవులోయమ్మ తుమ్మెద’ అంటూ ‘అక్కా చెల్లెలు’ సినిమాలో ‘షావుకారు జానకి పాట పాడుతుంది. చాలా చక్కటి ఫీల్ ఉన్న పాట అది. ఇప్పుడా పాట పల్లవే సినిమా టైటిల్ అయ్యింది. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ మొత్తం నటిస్తున్న చిత్రానికి ఈ టైటిల్‌నే నిర్ణయించారు. టైటిల్లోనే ఏదో ఆసక్తి ధ్వనిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత నాయికలు. ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. అరియాన-వివియాన సమర్పణలో మంచు విష్ణువర్థన్‌బాబు - మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థలో ఇది 58వ చిత్రం. మోహన్‌బాబు విభిన్న గెటప్‌తో ఉన్న ఫస్ట్‌లుక్‌ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి, బప్పీలహరి, మణిశర్మ, బాబా సెహగల్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫలణి కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.ఆర్.