మోహన్‌బాబులాంటి నిర్మాతకే థియేటర్లు దొరకడం లేదు - దాసరి
. ‘‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సంక్రాంతికే విడుదల చేయమన్నాను. థియేటర్లు దొరకడం లేదని మోహన్‌బాబు చెప్పాడు. మోహన్‌బాబు లాంటి నిర్మాతకే థియేటర్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, రవీనాటాండన్, ప్రణీత తదితరులు ముఖ్యతారలుగా శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని దాసరి ఆవిష్కరించి, కె.రాఘవేంద్రరావుకి ఇచ్చారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘ఈ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఉయ్యాల జంపాల, పాండవులు పాండవులు తుమ్మెద... లాంటి అచ్చ తెలుగు టైటిల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ తర్వాత విలక్షణమైన పాత్రలు అత్యధికంగా చేసింది మోహన్‌బాబు. తెర నిండుగా ఇంతమంది తారలతో సినిమా చేయడం చాలా కష్టం.
ఈ విషయంలో శ్రీవాస్‌ని అభినందించాలి’’ అన్నారు. వరుణ్ సందేశ్, తనీష్ చాలా అద్భుతంగా చేశారని మోహన్‌బాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. మనోజ్ మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్, నరేష్ తదితరులు స్త్రీ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఇందులో నేను అమ్మాయిగా వేషం వేశాను. మేకప్‌కి చాలా సమయం పట్టేది. అమ్మాయిగా పుడితే ఇంత కష్టమా అనిపించింది. నిర్మాతగా నా పేరు ఉన్నా అంతా అన్నయ్యే చూసుకున్నాడు’’ అని తెలిపారు. ఈ వేడుకలో నిర్మల, విష్ణు, విరానికా, బేబి అరియానా, బేబి వివియానా, బి.గోపాల్, వరప్రసాద్‌రెడ్డి, బ్రహ్మానందం, పరుచూరి బ్రదర్స్, ప్రణీత, అచ్చు తదితరులు పాల్గొన్నారు.