సినిమా రివ్యూ: పాండవులు పాండవులు తుమ్మెద
సినిమా రివ్యూ: పాండవులు పాండవులు తుమ్మెద
Published Fri, Jan 31 2014 5:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
పాజిటివ్ పాయింట్స్:
మోహన్ బాబు యాక్టింగ్
ఎంటర్ టైన్ మెంట్
యాక్షన్ సీన్లు
నెగిటివ్ పాయింట్స్:
రొటీన్ కథ
మోహన్ బాబు, రవీనా టాండన్, విష్ణు, మనోజ్, హన్సిక, ప్రణీత లాంటి భారీ తారాగాణంతో రూపొందిన 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి దర్శకుడు శ్రీవాస్. ఓ హిందీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మంచు విష్ణు, మనోజ్ లు నిర్మించిన ఈ మల్టీ స్టారర్ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. . చాలా కాలం తర్వాత మోహన్ బాబు, రవీనా టాండన్ జంటగా కనిపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజిలో మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
బ్యాంకాక్ లోని పట్టయాలో నాయుడు టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తుంటాడు. నాయుడుకి అల్లరి చిల్లరిగా తిరిగే ముగ్గురు (మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్) కొడుకులుంటారు. అదే ప్రాంతంలో సత్యమీనన్ (రవీనా టాండన్) హోటల్ వ్యాపారం చేస్తుంటుంది. సత్య మీనన్ కి ఇద్దరు (విష్ణు, వెన్నెల కిషోర్) కొడుకులుంటారు. నాయుడు (మోహన్ బాబు), సత్యమీనన్ (రవీనా టాండన్) ల మధ్య ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు నిరాకరించడం, ఇతర కారణాల వల్ల విడిపోతారు. సత్య వద్ద పేయింగ్ గెస్ట్ గా ఉండే హనీ(హన్సిక)కి నాయుడు, సత్యల ప్రేమ కథ తెలుస్తుంది. విడిపోయిన నాయుడు, సత్యలను హనీ కలిపి పెళ్లి చేస్తుంది. అయితే అప్పటికే విజయ్ (విష్ణు)ని ప్రేమిస్తున్న హనీని ఓ విలన్ గ్యాంగ్ వచ్చి ఎత్తుకెళ్తుంది. విలన్ గ్యాంగ్ చెరలో ఉన్న హనీని నాయుడు కుటుంబం కాపాడాలని బ్యాంకాక్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి బయలుదేరుతారు. అయితే హనీని విలన్ గ్యాంగ్ ఎందుకు ఎత్తుకెళ్లింది? ముగ్గురు కొడుకులున్న నాయుడు, ఇద్దరు కుమారులున్న సత్యల గతమేంటి. వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాడానికి ఏ పరిస్థితులు దారి తీశాయి? హనీని ఏ విధంగా విలన్ గ్యాంగ్ నుంచి రక్షించుకున్నారు?. 'మహాభారతం' నేపథ్యం ఉన్న టైటిల్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర కథ.
నాయుడు పాత్రతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మళ్లీ చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే పాత్రను ఎంచుకుని మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ చిత్ర భారాన్ని మోహన్ బాబు తన భుజాన వేసుకుని ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ బాబు తన నటనతో గతాన్ని గుర్తు చేశారు. ఇక మోహన్ బాబుకు చేదోడు వాదోడుగా విజయ్ పాత్రలో విష్ణు, మోహన్ పాత్రలో మనోజ్ లు తమ పాత్రను సమర్థంగానే పోషించారు. విష్టు లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ ను తనదైన శైలిలో నడపగా, మనోజ్ 'మోహిని' పాత్రతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక వరుణ్ సందేశ్, తనీష్ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్ గురించి. సత్య మీనన్ గా గ్లామర్ తోపాటు, నటనతో అదరగొట్టేసింది. చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించిన రవీనా నేటితరం తారలకు ధీటుగా గ్లామర్ తో ఆకట్టుకున్నారు. హన్సిక, ప్రణిత పాత్రలు గ్లామర్ కే పరిమితమయ్యాయి. ఈ చిత్రంలో విలనిజానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ముఖేశ్ రుషి ఓకే అనిపించారు.
కమెడియన్లలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. సెకాండాఫ్ లో మనోజ్, బ్రహ్మనందం, సుప్రీత్ ఇతర పాత్రలతో కలిసి పండించిన వినోదం ఈ చిత్రానికి బలానిచ్చింది. దాసరి నారాయణరావు ఓప్రత్యేక పాత్రలో కాసేపు కనిపించినా తన మార్కుతో ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
'ఢీ', 'దేనికైనా రెఢీ', 'దూసుకెళ్తా' చిత్రాలు అందించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అదే పంథాలో 'పాండవులు పాండవులు తుమ్మెద' రూపొందించారనిపిస్తుంది. మోహన్ బాబు నాయుడు, పక్కాగా పాత్రలను డిజైన్ చేసుకుని.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుని జాగ్రత్త పడ్డారు. మంచు మనోజ్ అందించిన ఫైట్స్, చిన్నా బ్యాంక్ గ్రౌండ్ స్కోర్, బప్పా లహిరి, కీరవాణి, అంచు సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. మోహన్ బాబు చేత చెప్పించిన డైలాగ్స్ అక్కడక్కడ బ్రహ్మండంగా పేలాయి. సెకండాఫ్ లో మోహిని పాత్ర ద్వారా పండించిన వినోదం లో దర్శకుడు శ్రీవాస్ సఫలమయ్యారు. మోహినిగా మనోజ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఎక్కడ అశ్లీలతకు తావివ్వకుండా హస్యాన్ని మోహిని పాత్ర ద్వారా మనోజ్ మేనేజ్ చేశారు. ఇక భారీ తారాగణంతో మల్టీ స్టారర్ చిత్రాలను తెరకెక్కించడం ప్రస్తుత ట్రెండ్ లో కత్తి మీద సామే. అయితే మోహన్ బాబు, విష్ణు, మనోజ్, రవీనా టాండన్, హన్సిక కాంబినేషన్ లో వారి ఇమేజ్ కు తగినట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో సఫలమైన దర్శకుడు శ్రీవాసుకు టాలీవుడ్ లో ప్రమోషన్ లభించినట్టే.
ఈ చిత్రంలో అనేక సానుకూల అంశాలు డామినేట్ చేయడంతో కొన్ని లోపాలు మరుగున పడ్డాయి. ఏది ఏమైనా అనవసరపు ప్రయోగాలకు తావివ్వకుండా పక్కా సక్సెస్ ఫార్ములాతో రూపొందించిన ఈ చిత్రం గురించి ఎలాంటి లాజిక్కులతో ఆలోచించకుండా.. వినోదాన్నిఆశించే వీకెండ్ ప్రేక్షకులు 'పాండవులు పాండవులు తుమ్మెద'ను హాయిగా ఆస్వాదించవచ్చు.
Advertisement
Advertisement