‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది... | i have done same thing in pedarayudu movie too | Sakshi
Sakshi News home page

‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...

Published Wed, Jan 29 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...

‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...

 40 ఏళ్ల సినీ ప్రస్థానం.. 500 పైచిలుకు సినిమాలు.. భిన్నమైన పాత్రలు.. నిర్మాతగా 50కి పైన సినిమాలు. ఇంకా రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ. నిజంగా మోహన్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన రూటే సెపరేట్ అనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష... ఈ మూడింటి వల్లే ఇంత సాధించగలిగానంటారు మోహన్‌బాబు. చాలా విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. శ్రీవాస్ దర్శకత్వంలో మంచు విష్ణు, మనోజ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు మోహన్‌బాబు. 
 
 ఏ ఒక్కరి వంశమూ తక్కువ కాదు: హీరోగా నటించి చాలాకాలం అయ్యింది. అందుకే ‘రావణ’ సినిమా చేయాలనుకున్నా. అయితే... అది వంద కోట్ల ప్రాజెక్ట్. కాస్త టైమ్ పడుతుంది. అందుకే... ఈ లోపు ఏదైనా మంచి పాత్ర దొరికితే చేద్దాం అనుకుంటున్న టైమ్‌లో... ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో నా కుమారులు విష్ణు, మనోజ్‌లు ఉండటంతో చాలామంది ‘మంచు వంశం’ అని మాట్లాడుతున్నారు. వంశం, వంశపారంపర్యం లాంటి మాటలు నాకస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరి వంశం గొప్పదే. ఏ ఒక్కరి వంశం తక్కువది కాదు. ఇక్కడ గొప్పవాళ్లు ఎవరూ ఉండరు. దేవుడొక్కడే గొప్పవాడు. ‘కులం’ అనే రెండక్షరాలను వినడానికి కూడా ఇష్టపడను. ‘మనుషులంతా ఒక్కటే’ అని చెప్పిన అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తా.  
 
 టూరిస్ట్ గైడ్ నాయుడిగా: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్.. వెనక్కి తీసుకోవడంలో వీక్’ అనేది ఇందులో నా డైలాగ్. నా పాత్ర స్వభావానికి అద్దం పట్టే డైలాగ్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘టూరిస్ట్‌గైడ్ నాయుడు’. రెండు రకాల షేడ్స్ ఉన్న ఈ తరహా పాత్రను నేనెప్పుడూ చేయలేదు. చాలా రోజుల తర్వాత మంచి డైలాగులు చెప్పే ఛాన్స్ ఈ పాత్రతో నాకు దక్కింది. ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టించేలా నా డైలాగులుంటాయి. ‘జీవితం ఓ పుస్తకం లాంటిది. మొదటి పేజీలో పుట్టుకని, చివరి పేజీలో మరణాన్ని రాసిపెట్టాడు దేవుడు. మధ్యలో పేజీలన్నీ ఖాళీ. అందులో నువ్వు ఏది రాసుకుంటే అదే జీవితం’ అని ఓ సందర్భంలో అంటా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. భార్యాభర్తల అనుబంధంపై ‘పెదరాయుడు’లో ఓ డైలాగ్ చెప్పాను. అంతటి గొప్ప డైలాగ్ ఇందులోనూ ఉంది. కొన్ని డైలాగుల్లో 
 
 వినిపించే తాత్వికత ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. 
 ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకుంటాడు మనోజ్: ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టామో ఇప్పుడే రివీల్ చేయలేను. ఇందులో మనోజ్ ఆడవేషం వేసిన సంగతి తెలిసిందే. ‘నర్తనశాల’లో అన్నగారు చేసిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంత పేరు తెచ్చిందో.. ఇందులోని ఆడ వేషం మనోజ్‌కి అంత పేరు తెస్తుంది. మనోజ్ నా బిడ్డ అని ఈ మాట చెప్పడంలేదు. సినిమా చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ద్వితీయార్ధమంతా తన భుజస్కందాలపై మోసాడు మనోజ్. 
 
 ఇది ‘గోల్‌మాల్-3’ కాదు: రవి అనే వ్యక్తి దగ్గర ఈ కథ కొన్నాం. తర్వాతే తెలిసింది.. ఈ కథకు  బాలీవుడ్  ‘గోల్‌మాల్-3’కి సంబంధం ఉందని. అతణ్ణి అడిగితే.. ‘వాళ్లే నా కథను కాపీ కొట్టారు’ అన్నాడు. అందుకే... కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.ఎస్.రవి కలిసి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ విషయంలో నేను చెప్పేదొక్కటే.. ‘గోల్‌మాల్-3’ చిత్రానికీ మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.
 
 మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుంది: 30 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీశాం. కానీ బయ్యర్లు పాతిక కోట్లకే సినిమాను అడిగారు. అందుకే సొంతంగా విడుదల చేస్తున్నాను. ‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాహసం చేసి సొంతంగా విడుదల చేశాను. ఆ సినిమా చరిత్ర సృష్టించింది. మళ్లీ ఆ చరిత్ర ఈ సినిమా విషయంలో పునరావృతం అవుతుందని నా నమ్మకం. దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం.
  ప్రభాస్ అంటే ఇష్టం: నేటి హీరోల్లో ఎవరి స్టైల్ వారిది. అందరిలో ప్రభాస్ అంటే ఇష్టం. మేమిద్దరం ‘బావ.. బావ’ అని పిలుచు కుంటాం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement