ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం పెదరాయుడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1955 జూన్ 15న విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు బాక్సాఫీసు దగ్గర రికార్డులను బద్దలు కొట్టింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన నాట్టమై సినిమా రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. పెదరాయుడు సినిమా విడుదలై సోమవారం నాటికి 25 ఏళ్లు అయిన సందర్భంగా చిత్ర బృందానికి మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
పెదరాయుడు సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నటీనటులందరూ బాగా సహకరించారు. ఈ సినిమా విడుదలై అప్పుడే 25 సంవత్సరాలు అయ్యిందా అనిపిస్తుంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మనందం, బాబూ మోహన్, రవిరాజా,కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే..తొలి క్లాప్ కొట్టిన ఎన్టీఆర్ లేరు. సౌందర్య, కెమెరామెన్ లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు. లేకుంటే చేసేవాణ్ణి’ అన్నారు. ఇక పెదరాయుడి సినిమాకి ముందు రెండు, మూడు పరాజయాలు ఎదుర్కొన్నానని ఆ విషయం రజనీకాంత్‌కి తెలిసి తనకు రూ. 45 లక్షల ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. నిజంగా రజనీ గొప్ప మనిషి అంటూ కొనియాడారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. (రజనీ.. నాకు దండ వేసి కాళ్లకు దండం పెట్టాడు: మోహన్‌బాబు)
Comments
Please login to add a commentAdd a comment