silver jublee
-
కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వండి
‘‘ఈ వేదికపై ఉన్న చాలా మంది నిర్మాతలు నా సినిమాలతో స్ఫూర్తి పొందామని చెబుతుండటం సంతోషం. మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్తవాళ్లకి చాన్స్ ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆకాష్ , భావనా వళపండల్ జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. కె.రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఆర్కే టెలీఫిలింస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సర్కారు నౌకరి’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు. -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
‘పెదరాయుడు’ స్పెషల్ వీడియో
ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం పెదరాయుడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1955 జూన్ 15న విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు బాక్సాఫీసు దగ్గర రికార్డులను బద్దలు కొట్టింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన నాట్టమై సినిమా రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. పెదరాయుడు సినిమా విడుదలై సోమవారం నాటికి 25 ఏళ్లు అయిన సందర్భంగా చిత్ర బృందానికి మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. పెదరాయుడు సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నటీనటులందరూ బాగా సహకరించారు. ఈ సినిమా విడుదలై అప్పుడే 25 సంవత్సరాలు అయ్యిందా అనిపిస్తుంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మనందం, బాబూ మోహన్, రవిరాజా,కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే..తొలి క్లాప్ కొట్టిన ఎన్టీఆర్ లేరు. సౌందర్య, కెమెరామెన్ లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు. లేకుంటే చేసేవాణ్ణి’ అన్నారు. ఇక పెదరాయుడి సినిమాకి ముందు రెండు, మూడు పరాజయాలు ఎదుర్కొన్నానని ఆ విషయం రజనీకాంత్‌కి తెలిసి తనకు రూ. 45 లక్షల ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. నిజంగా రజనీ గొప్ప మనిషి అంటూ కొనియాడారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. (రజనీ.. నాకు దండ వేసి కాళ్లకు దండం పెట్టాడు: మోహన్‌బాబు) -
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ @ 25 ఏళ్లు
ముంబై: ప్రైవేటు రంగంలో అగ్రగామి అయిన ‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు’ మంగళవారం నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 25 లక్షల మొక్కలు నాటాలని, అలాగే, 2,500 తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని బ్యాంకు నిర్ణయించింది. సెంట్రల్ ముంబైలోని మున్సిపల్ పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి జామ మొక్కను నాటారు. ‘‘స్వచ్ఛమైన పర్యావరణానికి, స్మార్ట్ తరగతులకు ప్రత్యామ్నాయాలు ఏవీ లేవు. మన దేశం అంతర్జాతీయ శక్తిగా అవతరించేందుకు ఈ రెండు తప్పనిసరి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ విలువ రూ.6.64 లక్షల కోట్ల మార్క్ వద్ద ఉంది. -
యమలీలకు పాతికేళ్లు
కమెడియన్ అలీ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘యమలీల’. కిశోర్ రాఠి సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్ 28) పాతికేళ్లు పూర్తి చేసుకుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు నిండి ఉండటం చిత్రవిజయానికి ఓ కారణం. తల్లిగా మంజు భార్గవి, యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ల భరణి ఇలా సినిమాలో ప్రతి పాత్రా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లోడో..’, సిరులొలికించే చిన్ని నవ్వులే..., జుంబారే జుంజుంబారే...’ పాటలు హైలైట్. సూపర్ స్టార్ కృష్ణ, ఇంద్రజ ఓ స్పెషల్ సాంగ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. రిలీజ్ అయిన కొన్ని కేంద్రాల్లో ఏడాది పాటు ఏకధాటిగా ప్రదర్శితం అవ్వడం విశేషం. అలా ‘యమలీల’ అలీ కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. -
సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం
నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఏర్పాటుకు పునాది రాళ్లు వేశారు. 1995 నుంచి స్విమ్స్ ఆస్పత్రి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకులకు సిద్ధమైంది. మహతీ వేదికగా సోమవారం సాయంత్రం 5.15 గంటలకు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి (అలిపిరి): 2001లో ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచిత శస్త్ర చికిత్స సేవలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడంతో స్విమ్స్‌లో నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీæ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ 38 విభాగాల్లో 500 మంది వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిత్యం 1500 నుంచి 2 వేల మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. 898 పడకలతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోంది. విద్యా నిలయం.. స్విమ్స్‌లో యూజీ, పీజీ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 1,765 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రెండేళ్లలో 2 వేలకు పెరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీలో 2,218 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా 540 మంది 66 కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. 2014లో స్విమ్స్ ఆధ్వర్యంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రారంభమైంది. హాజరుకానున్న ప్రముఖులు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. -
బి బిగ్ అమితాబ్ @ 75
అమితాబ్‌ను అందరు బిగ్ బి అంటారు. ఆయన జీవితాన్ని చూస్తే ఎవరికైనా అంత బిగ్గా ఉండాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఒక షెహెన్ షా జీవితంలోఅదీ ఒక యాంగ్రీ యంగ్‌మెన్ లైఫ్లోఏ పాత్రల గురించి మాట్లాడుకోవాలి? ‘వరుసకు నీ అయ్యనవుతాను..నా పేరు షెహెన్షా’ అన్న షెహెన్ షా పాత్ర?‘నా దగ్గర కారుంది బంగ్లా ఉంది బ్యాంక్ బేలెన్స్ ఉంది.. నీ దగ్గరఏముంది?’ అన్న దీవార్ పాత్ర?‘డాన్లాంటి వాణ్ణి పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యం కూడా’ అన్న డాన్ పాత్ర...‘అప్పుడప్పుడు మనసులోఒక ఆలోచన వస్తుంది’ అన్న కభీ కభీ పాత్ర?ఆ... ఈ పాత్రలు ఏ హీరో అయినా చేస్తాడు.కాని ‘బ్లాక్’లో అంధురాలికి కాంతి చూపించిన టీచర్..‘పింక్’లో మహిళ ‘నో’ అంటే‘నో’ అని కోర్టును గడగడలాడించిన లాయర్.. ‘పికూ’లో మలబద్ధకంతో జీవించిఎమోషన్తో.. మోషన్‌తో మరణించిన తండ్రి..ప్రతి పాత్రలో జీవించాడు..ఒక్కోటి ఒక్కో సిల్వర్ జూబ్లీ.జీవితంలో మూడు సిల్వర్ జూబ్లీలు అదే... మూడుపాతికలు నిండాయి. ఇంకో పాతికలో మనందరినీ అలరిస్తాడనీ పాత్రల్లో జీవిస్తాడని నమ్ముతూ... మొదటి పాతిక (1942–1967): రాజీవ్‌గాంధీ ఫ్రెండ్ రాముడికి ఒక లక్ష్మణుడు ఉన్నాడని అందరికీ తెలుసు. కాని అమితాబ్‌కు కూడా ఒక లక్ష్మణుడు ఉన్నాడని చాలా కొద్దిమందికే తెలుసు. అతడి పేరు అజితాబ్బచ్చన్. అమితాబ్‌లో మంచి నటుడు ఉన్నాడని, అతడు సినిమాల్లో నటించాలని గట్టిగా కోరుకున్నది ప్రయత్నించింది అతడే. అమితాబ్ ప్రఖ్యాత కవి హరివంశ్రాయ్ బచ్చన్ ప్రథమ పుత్రుడు. హరివంశరాయ్ భార్య తేజీ బచ్చన్ ఢిల్లీలో ఇందిరాగాంధీ బాల్య స్నేహితురాలు. నెహ్రూది అలహాబాద్ కాబట్టి హరివంశరాయ్ది కూడా అలహాబాదే కాబట్టి వాళ్లకు ఆ రోజుల నుంచి స్నేహం ఉంది. ఢిల్లీలో అది బలపడింది. అమితాబ్ నాలుగేళ్ల వయసులో తన కంటే రెండేళ్ల చిన్నవాడైన రాజీవ్‌గాంధీతో ఆడుకునేవాడు. ఆ స్నేహం అలా పెరిగి పెద్దదైంది. కాని కవుల కష్టం కాగితాల పాలు. హరివంశ్రాయ్కు డబ్బు పెద్దగా రాదు. అందువల్ల అమితాబ్ జీవితం ఒక మధ్యతరగతి కుర్రాడి జీవితంలానే గడిచింది. నైనిటాల్లో ఢిల్లీలో చదివాక అతడు ఉద్యోగాల్లో చేరక తప్పలేదు. కొన్నాళ్లు చెన్నైలో మరికొన్నాళ్లు కలకత్తాలో ఉద్యోగం చేశాడు. స్కూల్లోనూ కాలేజీలోనూ నాటకాలు వేసి రాణించిన సంగతి మర్చిపోయాడు. కాని అజితాబ్ మాత్రం తన అన్నకు మంచి మంచి ఫొటోలు తీసి సినిమాల్లో ప్రయత్నించమని కోరుతూనే ఉన్నాడు. అమితాబ్‌కు కూడా తాను అమాంబాపతు ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదని క్రమంగా నమ్మకం కుదిరింది. సినిమాల్లో ప్రయత్నిస్తానని తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లకు తెలిసింది ఎవరు? ఇందిరా గాంధీయే. సినిమాల్లో పొలిటీషియన్ల రికమండేషన్లు చెల్లవని తెలిసినా ఇందిరాగాంధీ ప్రేమ కొద్దీ అమితాబ్‌కు సినిమాల్లో అవకాశాల కోసం రికమండేషన్ లెటర్లు రాసి ఇచ్చేది. అలాంటి ఒక లెటర్ అప్పటి దర్శకుడు, జర్నలిస్ట్, రచయిత అయిన కె.ఎ. అబ్బాస్‌కు కూడా రాసి ఇచ్చింది. చూద్దాం ఏమవుతుందో. మంచి గృహస్థే... అయినా అమితాబ్ నటి జయబాధురితో వివాహం చేసుకున్నాడు ఆ బంధాన్ని చక్కగా నిర్వహిస్తున్నాడన్న పేరు సంపాదించుకున్నాడు. అయితే అతని జీవితంలో స్త్రీలు లేకపోలేదు. అమితాబ్ తనకు వహిదా రహెమాన్ అంటే చాలా ఇష్టం అని బహిరంగంగా చాలాసార్లు చెప్పాడు. అది కేవలం మోహం మాత్రమే. వయసు తేడా ఉంది. కాని రేఖ అతడి జీవితంలో కొన్ని పేజీలను ఆక్రమించిందన్న సంగతి అందరికీ తెలుసు. కాని ఆ బంధాన్ని జయ సమర్థంగా తెంప గలిగింది. ఆ తర్వాత అమితాబ్ పర్వీన్ బాబీతో క్లోజ్‌గా ఉన్నాడన్న వార్తలు ఉన్నాయి. జీనత్ అమాన్ కూడా ఆయన మనసును చలింప చేసిందని అంటారు. సౌత్ హీరోయిన్లలో జయప్రద, మాధవి ఒక దశలో ఆయనతో తరచూ సినిమాలు చేశారు. స్త్రీల విషయంలో ఆయన తన వంతు విహారం చేశాడనే గిట్టనివాళ్ల ఉవాచ. కాని అదృష్టం ఎప్పుడూ ఎవరూ రోడ్డున పడే ఘటనలు జరగకపోవడం. 3చాలా బలహీనుడు అయినా... అమితాబ్ రివాల్వర్ పట్టుకుంటే చాలా కాన్ఫిడెంట్‌గా శక్తితో పట్టుకున్నట్టు కనిపిస్తుంది కాని ఆయన భౌతికంగా చాలా బలహీనుడు. బాల్యంలోనే ఆయనకు చాలా జ్వరాలు గట్రా వచ్చేవి. ‘కూలీ’ సినిమా ప్రమాదం తర్వాత ఆయన ఆరోగ్యం మరీ సున్నితంగా మారింది. ఆ సమయంలో కలుషిత రక్తమార్పిడి జరిగి ప్రస్తుతం ఆయన ఒంట్లో కాలేయం సగమే మిగిలింది. మిగిలింది డాక్టర్లు తీసేశారు. సాఫ్ట్ డ్రింక్స్ హద్దుకు మించి తాగడంతో పెద్ద ప్రేవులో కొంత కత్తిరించి తీసేశారు. ఒక దశలో ఆయనకు కంటి రెప్పలు మూత పడే నరాల జబ్బు వచ్చింది. ప్రస్తుతం మందులు లేకపోతే ఆయన జీవితం గడవదు. అయినప్పటికీ ఆయన ఆగకుండా పని చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉండాలనుకుంటాడు. రెండవ పాతిక (1967– 1992) యాంగ్రీ యంగ్‌మేన్ మనిషి ఆరడగుల పొడవు ఉన్నాడు. అంత పొడవు హీరో అప్పటి దాకా హిందీ సినిమాలకు తెలియదు. గొంతు కూడా మెటాలిక్‌గా ఉంది. ఇలాంటి గొంతు కూడా ప్రేక్షకులకు నచ్చదు. రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ ప్రభావంలో ఉన్నవారికి ఇలాంటి కుర్రాడు ఆనే అవకాశమే లేదు. అందరూ అమితాబ్‌ని ‘లంబూ’ అనడం మొదలుపెట్టారు. కాని రికమండేషన్ పని చేసింది. కె.ఏ. అబ్బాస్ తాను తీస్తున్న ‘సాత్ హిందూస్తానీ’ అనే సినిమాలో నలుగురైదుగురు కొత్తవాళ్ల మధ్య అమితాబ్‌కు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా 1969లో రిలీజ్ అయ్యింది. కాని అదే సంవత్సరం ఇంకో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. దాని పేరు ‘ఆరాధన’. రాజేష్ ఖన్నా అనబడు జతిన్ ఖన్నా ఆ సినిమాతో రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయిపోయాడు. అతడి స్టైల్, డైలాగ్, బాడీ లాంగ్వేజ్... లోకం వెర్రెత్తి పోతూ ఉంది. అలాంటి టైమ్‌లో అమితాబ్ ఒకటి రెండు సినిమాల హీరోగా ముంబైలో బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉన్నాడు. తినడానికి తిండి లేదు. ఉండటానికి ఇల్లు లేదు. కమెడియన్ మెహమూద్ పరిచయమయ్యి అమితాబ్‌ని తన తోబుట్టువులా ఇంట్లో ఉంచుకున్నాడు. అన్నం పెట్టాడు. ఆదరించాడు. అంతే కాదు ‘బాంబే టు గోవా’(1972) ప్రొడ్యూస్ చేసి అమితాబ్‌ను హీరోను చేశాడు. అమితాబ్ చూసిన మొదటి హిట్ సినిమాల్లో అది ముఖ్యమైనది. ఎందుకంటే ఆ సినిమాయే అమితాబ్‌ను యాంగ్రీ యంగ్మేన్ను చేసింది. అప్పటి వరకూ ‘జంజీర్’ స్క్రిప్ట్ పట్టుకుని షమ్మీ కపూర్, దేవ్ ఆనంద్, రాజ్ కుమార్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన దర్శకుడు ప్రకాష్ మెహ్రా వీళ్లు కాదు ఎవరైనా కొత్త కుర్రాడు కావాలని ‘బాంబే టు గోవా’ చూసినప్పుడు అమితాబ్ వెంటనే నచ్చేశాడు. జంజీర్ స్క్రిప్ట్ రాసిన సలీమ్–జావేద్‌లు కూడా అమితాబ్‌ను గట్టిగా రికమండ్ చేశారు. ‘జంజీర్’ తయారైంది. 1973లో విడుదలైంది. అప్పటి వరకూ రంగు రంగుల చొక్కాలు వేసుకుని ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే హీరోల స్థానంలో గంభీరంగా, సీరియస్‌గా, విలువల కోసం నిలబడే వ్యక్తిగా అమితాబ్ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు. గట్టి స్పర్శ ఇవ్వగలిగాడు. జనం యాంగ్రీ యంగ్‌మేన్‌గా అమితాబ్‌కు జేజేలు పలికారు. కాని రాజేష్ ఖన్నా ప్రభ వెలుగుతూనే ఉంది. దానిని మసకబార్చే హిట్స్ అమితాబ్‌కు 1975లో వచ్చాయి. అవి యష్ చోప్రా ‘దీవార్’. రమేశ్ సిప్పీ ‘షోలే’. ఓ... దేశమంతా ఊగిపోయింది. చెలరేగిపోయింది. అమితాబ్‌ను భుజాల మీద పెట్టుకుని ఊరేగించింది. ఆ తర్వాత అమితాబ్ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ చేతుల్లో పడ్డాడు. ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘సుహాగ్’, ‘నసీబ్’... ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. మరోవైపు ప్రకాష్ మెహ్రాతో ‘ముకద్దర్ కా సికిందర్’, ‘లావారిస్’, ‘నమక్ హలాల్’, ‘షరాబీ’... బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా అమితాబ్‌బచ్చన్ చెక్కుచెదరని స్థానంలో నిలబడ్డాడు. కాని జీవితం అనే రివాల్వర్ ఒక్కోసారి వెనక్కు పేలుతూ ఉంటుంది. ఎంతటివారిలో అయినా బుల్లెట్ దించుతూ ఉంటుంది. అమితాబ్‌కు కూడా దిగింది. 1983లో మన్మోహన్ దేశాయ్ ‘కూలీ’ షూటింగ్లో అమితాబ్ డొక్కలో టేబుల్ అంచు దిగబడింది. ఎనిమిది నెలలు హాస్పిటల్లో ఉండిపోయాడు. ప్రాణం పోయిందనే అనుకున్నారు. హిందు ముస్లిం క్రిస్టియన్ అని లేకుండా ప్రజలందరూ అతడి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. అమితాబ్ లేచి వచ్చాడు. కాని పూర్వపు ప్రభ ఇక ముగిసినట్టే. అప్పటికే ప్రత్యర్థులు అమితాబ్‌కు పోటీ వెతుకుతున్నారు. వినోద్ ఖన్నా, మిధున్ చక్రవర్తిలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు అనిల్ కపూర్, రిషి కపూర్, జాకీ ష్రాఫ్, సన్ని డియోల్ బలపడ్డారు. ఇక లాభం లేదని 1984లో అమితాబ్ రాజకీయాల్లో దిగాడు. బోఫార్స్ బురద అంటింది. ఆ వివాదంలో సొంత తమ్ముడు అజితాబ్‌ను శాశ్వతంగా దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ బురద నా వల్ల కాదు అని బయటకు వచ్చాడు. తన స్నేహితుడు టీనూ ఆనంద్ దర్శకత్వంలో ‘షెహన్షా’ చేశాడు. అది ఓ మోస్తారు హిట్. కాని ఆ తర్వాత చేసిన ‘జాదూగర్’, ‘తూఫాన్’ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. మేకప్ వేసుకోవడానికి కూడా నోచుకోలేని స్థితి. బలవంతపు రిటైర్మెంట్. చీమూడవ పాతిక (1992–2017) నుసి నుంచి నింగికి జీవితంలో అమితాబ్ చేసిన అతి పెద్ద తప్పు ‘ఏబిసిఎల్’ స్థాపించడం. దేశభాషలలో సినిమాలు తీయడానికి 1996లో స్థాపించిన ఈ సంస్థ దారుణమైన నష్టాలను తీసుకొచ్చి చివరకు అమితాబ్‌ను అతడి బంగ్లా ‘ప్రతీక్ష’ నుంచి కూడా బయటకు ఈడ్చే స్థితికి తీసుకువచ్చింది. డబ్బు లేదు. సినిమాలు లేవు. కొడుకు కూతురు ఇంకా ఎదిగి రాలేదు. నింగికి ఎగిరిన సూపర్‌స్టార్ నేలన చతికిల పడి ఉన్నాడు. కాని అమితాబ్ ఓటమిని స్వీకరించే మనిషి కాడు. అది వాళ్ల వంశంలోనే లేదు. అమితాబ్ లేచి నిలబడ్డాడు. తన చిరకాల మిత్రుడు యశ్ చోప్రా దగ్గరకు వెళ్లి ప్రాధేయ పడ్డాడు. ఆయన ప్రమేయంతో ఆదిత్యా చోప్రా తీస్తున్న ‘మొహబ్బతే’ (2000)లో అవకాశం వచ్చింది. అది కొంచెం ఓదార్పు. కాని ఒక నష్టం జరిగాక ఒక లాభం ఉంటుందనడానికి నిదర్శనంగా అమితాబ్‌కు అదే సంవత్సరం వచ్చిన ఒక గొప్ప అవకాశం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో యాంకర్రోల్ దక్కడం. అప్పటి దాకా నటుడిగా చూసిన ప్రేక్షకులు ఈ షోలో అమితాబ్‌లోని వ్యక్తిని చూశారు. ఆయన ప్రవర్తన, మాట తీరు, దగ్గరితనం తిరిగి ఆయనకే కాదు ప్రేక్షకులకు కూడా మేజిక్ ఇచ్చాయి. మరో వైపు కొత్త దర్శకులు కొత్త పాత్రలతో ఆయనను పైకి లాగడం మొదలుపెట్టారు. ‘బ్లాక్’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘సర్కార్’, ‘చీనీ కమ్’... ఈ సినిమాలన్నీ అమితాబ్ స్టార్డమ్ ఎక్కడికీ పోలేదని నిరూపించాయి. ఇటీవలి ‘పా’, ‘పికూ’, ‘పింక్’ సినిమాలైతే అమితాబ్ ఒక పరిపూర్ణమైన నటుడు ఇంతకు ముందు ఏదైనా, ఇక మీదట ఏదైనా ఆయన పరిపూర్ణంగా తాను చేయవలసిందంతా చేసేశాడు అనే నిర్థారణతో ఆయన కెరీర్‌ను మూల్యాంకనం చేశాయి. ‘సినిమాల్లో రాణించడానికి అందంగా అయినా ఉండాలి. లేదా భిన్నంగా అయినా చేయాలి. అమితాబ్ అందంగా ఉండి భిన్నంగా చేయగలడు. అందుకే నిలబడ్డాడు’ అని శతృఘ్నసిన్హా అన్నాడు. అమితాబ్ యాక్షన్, కరుణ, హాస్యం, రొమాన్స్ అన్నీ భిన్నంగా చేయడం వల్లే మన గుండెల్లో నిలబడిపోయాడు. ‘డాన్’, ‘చుప్ కే చుప్ కే’, ‘అభిమాన్’, ‘కభీ కభీ’, ‘సిల్ సిలా’... ఎన్నో సినిమాలు ఎన్నో జ్ఞాపకాలు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్... బాలీవుడ్‌కు ‘కింగ్’లే కావచ్చు. కాని అమితాబ్ ఎప్పటికీ కింగ్‌లకు కింగ్. అతడు షెహెన్షా. అతడే షెహెన్ షా. మంచి మామగారు... ఐశ్వర్యా రాయ్ మామగారుగా అమితాబ్ చాలా బాధ్యతా యుతంగా కనిపిస్తుంటారు. చాలా పార్టీలకు ఆయన తన కోడలితో హాజరు కావడం చూడవచ్చు. ఐశ్వర్య రాయ్ ఒక పాపకు జన్మనిచ్చాక ఆ పాపే లోకం అయ్యింది అమితాబ్‌కు. కుమార్తె శ్వేత అన్నా ఆయనకు ఎంతో ఇష్టం. కుమారుడు అభిషేక్ బచ్చన్, భార్య జయబాధురి... అందరు కుటుంబ సభ్యులతో ఆయన కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు. -
యువోత్సాహం
పోటాపోటీగా యువమహోత్సవ్ క్రీడలు కర్నూలు(హాస్పిటల్): యువమహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిల్వర్‌జూబ్లీ కళాశాలలో ఆటల పోటీలు హోరాహోరీగా జరిగాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువమహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఖో–ఖో, కబడ్డీ, షటిల్ బ్యాట్మింటన్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను సెట్కూరు సీఈవో మస్తాన్‌వలీ ప్రారంభించారు. విజేతలకు ఆదివారం సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, సిల్వర్‌జూబ్లీ, కేవీఆర్, వాసవి, పీసీరెడ్డి, సెయింట్ జోసఫ్, హజీరా డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే... –క్యారమ్స్(గర్ల్స్)–1.వాసవి మహిళా కళాశాల, 2. వాసవి మహిళా కళాశాల, 3. సిల్వర్‌జూబ్లీ కళాశాల –క్యారమ్స్(బాయ్స్)–1. చైతన్య శ్రీనివాస్,సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 2. సాయి కృష్ణ శంకరాస్ డిగ్రీ కళాశాల, 3. బాబూరావు, సిల్వర్‌జూబ్లీ కళాశాల –కబడ్డి(ఉమెన్స్)–1. సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాల, 2. కేవీఆర్ కళాశాల, 3. వాసవి కళాశాల –ఖోఖో(ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. ఆర్సీ రెడ్డి కాలేజి –వాలీబాల్ (ఉమెన్)–1. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. సిల్వర్‌జూబ్లీ కళాశాల –చెస్ (గర్ల్స్)–1. తస్నీమ్, కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 2. అనూషా, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 3. మనీషా, సిల్వర్‌జూబ్లీ కళాశాల –చెస్(బాయ్స్)–1. రామ్‌ప్రదీప్, రాయలసీమ యూనివర్శిటి, 2. భాస్కర్, కర్నూలు, 3. వెంకటనాయుడు, కర్నూలు –టేబుల్ టెన్నిస్(బాయ్స్)–1. సీహెచ్ బాబురావు, సిల్వర్‌జూబ్లీ కళాశాల, 2. శ్రీకాంత్‌రెడ్డి, సిల్వర్‌జూబ్లీ కళాశాల –షటిల్ బాట్మింటన్(బాయ్స్)–1. విజయదుర్గ డిగ్రీ కళాశాల, 2. నారాయణ జూనియర్ కళాశాల, 3. విజయదుర్గ డిగ్రీ కళాశాల –టగ్ ఆఫ్ వార్–1. సిల్వర్‌జూబ్లీ కళాశాల, 2. కేవీఆర్ డిగ్రీ కళాశాల, 3. వాసవి డిగ్రీ కళాశాల -
గర్వంగా బతికేది రైతే
– భవిష్యత్తులో ఉద్యాన పంటలకే ప్రాధాన్యత – 2020 నాటికి మహానందిలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు – దేశంలో ఏపీ వ్యవసాయ విశ్వ విద్యాలయం నెంబర్ వ¯Œ – ఆంగ్రో ద్వారా 410 వంగడాల సృష్టి మహానంది: గర్వంగా చెప్పుకుని బతికేస్తున్న వృత్తులో రైతన్నది ప్రథమస్థానమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు డైరెక్టర్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చదివిన వారు సైతం తమ ఉద్యోగాలను వదిలి స్వగ్రామాలకు వస్తూ రైతులుగా మారుతుండటం రైతు గొప్పతనానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యానపంటలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తంగెడంచలో సీడ్‌హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ అనుభవాలకు తోడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుని మరింత ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. నంద్యాల పరిశోధనలు కీర్తివంతంగా ఉన్నాయన్నారు. కర్నూలు, నంద్యాల సోనాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. దేశంలోనే నెంబర్ 1: భారతదేశంలోని 72 వ్యవసాయ కళాశాలల్లో మన రాష్ట్రమే ఉన్నత స్థానంలో ఉందని, 825 మంది అధ్యాపకులతో భారతదేశంలో నెంబరువన్‌గా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ టి.రమేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సదస్సులో మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ఐదు వ్యవసాయ కళాశాలలు, రెండు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ కళాశాలలు, 39 పరిశోధనా స్థానాలు, ఆరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ఒక గృహ విజ్ఞాన కళాశాల, 13 ఏరువాక కేంద్రాలు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు కలిగి విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 10,700 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అన్ని పంటలలో కలిపి 410 రకాల నూతన వంగడాలను సృష్టించినట్లు తెలిపారు. ప్రస్తుతం మహానందిలో ప్లాంట్ బ్రీడింగ్ మరియు అగ్రానమీ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టామన్నారు. 2020 నాటికి మహానంది కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. కార్యక్రమంలో విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ వి.దామోదరనాయుడు, మేకల లక్ష్మినారాయణ, విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, డీప్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ వీరరాఘవయ్య, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘జలవిద్యుదుత్పత్తి’ కేంద్రానికి పాతికేళ్లు
బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకుని శనివారం 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 1988 డిసెం బర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారాక రామారావు చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుదుత్పత్తి. దీంతో ప్రభుత్వం కాకతీయ కాలువ ప్రారంభంలో సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభిం చారు. రెండో దశలో నాల్గవ టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండో టర్బయిన్ 1987 డిసెంబర్లో, మూడో టర్బయిన్ 1988 జూలైలో పను లు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెం బర్లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పనులు పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా విరాజిల్లుతోంది. స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో.. జల విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు. టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్‌కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వి విధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 24 గంటలకోసా రి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుదుత్పత్తి కేం ద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుదుత్పత్తి జరుగుతుంది. 24 ఏళ్లలో కేవలం నాల్గు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్వీర్యమయ్యేలా ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాల్గు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడ ంలేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకాతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టి కాలువ కు గండి పడే ప్రమాదం లేక పోలేదు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న జల విద్యుదుత్పత్తి కేంద్రంపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.