బి బిగ్‌ అమితాబ్‌ @ 75 | Amitabh Bachchan's Birthday Celebration In Maldives | Sakshi
Sakshi News home page

బి బిగ్‌ అమితాబ్‌ @ 75

Published Sun, Oct 15 2017 12:42 AM | Last Updated on Mon, May 28 2018 4:04 PM

Amitabh Bachchan's Birthday Celebration In Maldives - Sakshi

అమితాబ్‌ను అందరు బిగ్‌ బి అంటారు. ఆయన జీవితాన్ని చూస్తే ఎవరికైనా అంత బిగ్‌గా ఉండాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఒక షెహెన్‌ షా జీవితంలోఅదీ ఒక యాంగ్రీ యంగ్‌మెన్‌ లైఫ్‌లోఏ పాత్రల గురించి మాట్లాడుకోవాలి? ‘వరుసకు నీ అయ్యనవుతాను..నా పేరు షెహెన్‌షా’ అన్న షెహెన్‌ షా పాత్ర?‘నా దగ్గర కారుంది బంగ్లా ఉంది బ్యాంక్‌ బేలెన్స్‌ ఉంది.. నీ దగ్గరఏముంది?’ అన్న దీవార్‌ పాత్ర?‘డాన్‌లాంటి వాణ్ణి పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యం కూడా’ అన్న డాన్‌ పాత్ర...‘అప్పుడప్పుడు మనసులోఒక ఆలోచన వస్తుంది’ అన్న కభీ కభీ పాత్ర?ఆ... ఈ పాత్రలు ఏ హీరో అయినా చేస్తాడు.కాని ‘బ్లాక్‌’లో అంధురాలికి
కాంతి చూపించిన టీచర్‌..‘పింక్‌’లో మహిళ ‘నో’ అంటే‘నో’ అని కోర్టును గడగడలాడించిన లాయర్‌.. ‘పికూ’లో మలబద్ధకంతో జీవించిఎమోషన్‌తో.. మోషన్‌తో మరణించిన తండ్రి..ప్రతి పాత్రలో జీవించాడు..ఒక్కోటి ఒక్కో సిల్వర్‌ జూబ్లీ.జీవితంలో మూడు సిల్వర్‌ జూబ్లీలు అదే... మూడుపాతికలు నిండాయి. ఇంకో పాతికలో మనందరినీ అలరిస్తాడనీ పాత్రల్లో జీవిస్తాడని నమ్ముతూ...

 

మొదటి పాతిక (1942–1967): రాజీవ్‌గాంధీ ఫ్రెండ్‌
రాముడికి ఒక లక్ష్మణుడు ఉన్నాడని అందరికీ తెలుసు. కాని అమితాబ్‌కు కూడా ఒక లక్ష్మణుడు ఉన్నాడని చాలా కొద్దిమందికే తెలుసు. అతడి పేరు అజితాబ్‌బచ్చన్‌. అమితాబ్‌లో మంచి నటుడు ఉన్నాడని, అతడు సినిమాల్లో నటించాలని గట్టిగా కోరుకున్నది ప్రయత్నించింది అతడే. అమితాబ్‌ ప్రఖ్యాత కవి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ ప్రథమ పుత్రుడు. హరివంశరాయ్‌ భార్య తేజీ బచ్చన్‌ ఢిల్లీలో ఇందిరాగాంధీ బాల్య స్నేహితురాలు. నెహ్రూది అలహాబాద్‌ కాబట్టి హరివంశరాయ్‌ది కూడా అలహాబాదే కాబట్టి వాళ్లకు ఆ రోజుల నుంచి స్నేహం ఉంది. ఢిల్లీలో అది బలపడింది.

అమితాబ్‌ నాలుగేళ్ల వయసులో తన కంటే రెండేళ్ల చిన్నవాడైన రాజీవ్‌గాంధీతో ఆడుకునేవాడు. ఆ స్నేహం అలా పెరిగి పెద్దదైంది. కాని కవుల కష్టం కాగితాల పాలు. హరివంశ్‌రాయ్‌కు డబ్బు పెద్దగా రాదు. అందువల్ల అమితాబ్‌ జీవితం ఒక మధ్యతరగతి కుర్రాడి జీవితంలానే గడిచింది. నైనిటాల్‌లో ఢిల్లీలో చదివాక అతడు ఉద్యోగాల్లో చేరక తప్పలేదు. కొన్నాళ్లు చెన్నైలో మరికొన్నాళ్లు కలకత్తాలో ఉద్యోగం చేశాడు. స్కూల్లోనూ కాలేజీలోనూ నాటకాలు వేసి రాణించిన సంగతి మర్చిపోయాడు. కాని అజితాబ్‌ మాత్రం తన అన్నకు మంచి మంచి ఫొటోలు తీసి సినిమాల్లో ప్రయత్నించమని కోరుతూనే ఉన్నాడు. అమితాబ్‌కు కూడా తాను అమాంబాపతు ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదని క్రమంగా నమ్మకం కుదిరింది. సినిమాల్లో ప్రయత్నిస్తానని తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లకు తెలిసింది ఎవరు? ఇందిరా గాంధీయే. సినిమాల్లో పొలిటీషియన్ల రికమండేషన్లు చెల్లవని తెలిసినా ఇందిరాగాంధీ ప్రేమ కొద్దీ అమితాబ్‌కు సినిమాల్లో అవకాశాల కోసం రికమండేషన్‌ లెటర్లు రాసి ఇచ్చేది. అలాంటి ఒక లెటర్‌ అప్పటి దర్శకుడు, జర్నలిస్ట్, రచయిత అయిన కె.ఎ. అబ్బాస్‌కు కూడా రాసి ఇచ్చింది. చూద్దాం ఏమవుతుందో.
 


మంచి గృహస్థే... అయినా
అమితాబ్‌ నటి జయబాధురితో వివాహం చేసుకున్నాడు ఆ బంధాన్ని చక్కగా నిర్వహిస్తున్నాడన్న పేరు సంపాదించుకున్నాడు. అయితే అతని జీవితంలో స్త్రీలు లేకపోలేదు. అమితాబ్‌ తనకు వహిదా రహెమాన్‌ అంటే చాలా ఇష్టం అని బహిరంగంగా చాలాసార్లు చెప్పాడు. అది కేవలం మోహం మాత్రమే. వయసు తేడా ఉంది.

కాని రేఖ అతడి జీవితంలో కొన్ని పేజీలను ఆక్రమించిందన్న సంగతి అందరికీ తెలుసు. కాని ఆ బంధాన్ని జయ సమర్థంగా తెంప గలిగింది. ఆ తర్వాత అమితాబ్‌ పర్వీన్‌ బాబీతో క్లోజ్‌గా ఉన్నాడన్న వార్తలు ఉన్నాయి. జీనత్‌ అమాన్‌ కూడా ఆయన మనసును చలింప చేసిందని అంటారు. సౌత్‌ హీరోయిన్లలో జయప్రద, మాధవి ఒక దశలో ఆయనతో తరచూ సినిమాలు చేశారు. స్త్రీల విషయంలో ఆయన తన వంతు విహారం చేశాడనే గిట్టనివాళ్ల ఉవాచ. కాని అదృష్టం ఎప్పుడూ ఎవరూ రోడ్డున పడే ఘటనలు జరగకపోవడం.

3చాలా బలహీనుడు అయినా...
అమితాబ్‌ రివాల్వర్‌ పట్టుకుంటే చాలా కాన్ఫిడెంట్‌గా శక్తితో పట్టుకున్నట్టు కనిపిస్తుంది కాని ఆయన భౌతికంగా చాలా బలహీనుడు. బాల్యంలోనే ఆయనకు చాలా జ్వరాలు గట్రా వచ్చేవి. ‘కూలీ’ సినిమా ప్రమాదం తర్వాత ఆయన ఆరోగ్యం మరీ సున్నితంగా మారింది.

ఆ సమయంలో కలుషిత రక్తమార్పిడి జరిగి ప్రస్తుతం ఆయన ఒంట్లో కాలేయం సగమే మిగిలింది. మిగిలింది డాక్టర్లు తీసేశారు. సాఫ్ట్‌ డ్రింక్స్‌ హద్దుకు మించి తాగడంతో పెద్ద ప్రేవులో కొంత కత్తిరించి తీసేశారు. ఒక దశలో ఆయనకు కంటి రెప్పలు మూత పడే నరాల జబ్బు వచ్చింది. ప్రస్తుతం మందులు లేకపోతే ఆయన జీవితం గడవదు. అయినప్పటికీ ఆయన ఆగకుండా పని చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉండాలనుకుంటాడు.

రెండవ పాతిక (1967– 1992)
యాంగ్రీ యంగ్‌మేన్‌

మనిషి ఆరడగుల పొడవు ఉన్నాడు. అంత పొడవు హీరో అప్పటి దాకా హిందీ సినిమాలకు తెలియదు. గొంతు కూడా మెటాలిక్‌గా ఉంది. ఇలాంటి గొంతు కూడా ప్రేక్షకులకు నచ్చదు. రాజ్‌కపూర్, దేవ్‌ ఆనంద్, దిలీప్‌ కుమార్‌ ప్రభావంలో ఉన్నవారికి ఇలాంటి కుర్రాడు ఆనే అవకాశమే లేదు. అందరూ అమితాబ్‌ని ‘లంబూ’ అనడం మొదలుపెట్టారు. కాని రికమండేషన్‌ పని చేసింది. కె.ఏ. అబ్బాస్‌ తాను తీస్తున్న ‘సాత్‌ హిందూస్తానీ’ అనే సినిమాలో నలుగురైదుగురు కొత్తవాళ్ల మధ్య అమితాబ్‌కు కూడా అవకాశం ఇచ్చాడు.

ఆ సినిమా 1969లో రిలీజ్‌ అయ్యింది. కాని అదే సంవత్సరం ఇంకో సినిమా కూడా రిలీజ్‌ అయ్యింది. దాని పేరు ‘ఆరాధన’. రాజేష్‌ ఖన్నా అనబడు జతిన్‌ ఖన్నా ఆ సినిమాతో రాత్రికి రాత్రి సూపర్‌స్టార్‌ అయిపోయాడు. అతడి స్టైల్, డైలాగ్, బాడీ లాంగ్వేజ్‌... లోకం వెర్రెత్తి పోతూ ఉంది. అలాంటి టైమ్‌లో అమితాబ్‌ ఒకటి రెండు సినిమాల హీరోగా ముంబైలో బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ ఉన్నాడు. తినడానికి తిండి లేదు. ఉండటానికి ఇల్లు లేదు. కమెడియన్‌ మెహమూద్‌ పరిచయమయ్యి అమితాబ్‌ని తన తోబుట్టువులా ఇంట్లో ఉంచుకున్నాడు. అన్నం పెట్టాడు.

ఆదరించాడు. అంతే కాదు ‘బాంబే టు గోవా’(1972) ప్రొడ్యూస్‌ చేసి అమితాబ్‌ను హీరోను చేశాడు. అమితాబ్‌ చూసిన మొదటి హిట్‌ సినిమాల్లో అది ముఖ్యమైనది. ఎందుకంటే ఆ సినిమాయే అమితాబ్‌ను యాంగ్రీ యంగ్‌మేన్‌ను చేసింది. అప్పటి వరకూ ‘జంజీర్‌’ స్క్రిప్ట్‌ పట్టుకుని షమ్మీ కపూర్, దేవ్‌ ఆనంద్, రాజ్‌ కుమార్‌ల చుట్టూ తిరిగి విసిగిపోయిన దర్శకుడు ప్రకాష్‌ మెహ్రా వీళ్లు కాదు ఎవరైనా కొత్త కుర్రాడు కావాలని ‘బాంబే టు గోవా’ చూసినప్పుడు అమితాబ్‌ వెంటనే నచ్చేశాడు. జంజీర్‌ స్క్రిప్ట్‌ రాసిన సలీమ్‌–జావేద్‌లు కూడా అమితాబ్‌ను గట్టిగా రికమండ్‌ చేశారు. ‘జంజీర్‌’ తయారైంది. 1973లో విడుదలైంది. అప్పటి వరకూ రంగు రంగుల చొక్కాలు వేసుకుని ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే హీరోల స్థానంలో గంభీరంగా, సీరియస్‌గా, విలువల కోసం నిలబడే వ్యక్తిగా అమితాబ్‌ కనిపించి ఆశ్చర్యం కలిగించాడు.

గట్టి స్పర్శ ఇవ్వగలిగాడు. జనం యాంగ్రీ యంగ్‌మేన్‌గా అమితాబ్‌కు జేజేలు పలికారు. కాని రాజేష్‌ ఖన్నా ప్రభ వెలుగుతూనే ఉంది. దానిని మసకబార్చే హిట్స్‌ అమితాబ్‌కు 1975లో వచ్చాయి. అవి యష్‌ చోప్రా ‘దీవార్‌’. రమేశ్‌ సిప్పీ ‘షోలే’. ఓ... దేశమంతా ఊగిపోయింది. చెలరేగిపోయింది. అమితాబ్‌ను భుజాల మీద పెట్టుకుని ఊరేగించింది. ఆ తర్వాత అమితాబ్‌ దర్శకుడు మన్‌ మోహన్‌ దేశాయ్‌ చేతుల్లో పడ్డాడు. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘సుహాగ్‌’, ‘నసీబ్‌’... ఈ సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్స్‌. మరోవైపు ప్రకాష్‌ మెహ్రాతో ‘ముకద్దర్‌ కా సికిందర్‌’, ‘లావారిస్‌’, ‘నమక్‌ హలాల్‌’, ‘షరాబీ’... బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా అమితాబ్‌బచ్చన్‌ చెక్కుచెదరని స్థానంలో నిలబడ్డాడు. కాని జీవితం అనే రివాల్వర్‌ ఒక్కోసారి వెనక్కు పేలుతూ ఉంటుంది. ఎంతటివారిలో అయినా బుల్లెట్‌ దించుతూ ఉంటుంది. అమితాబ్‌కు కూడా దిగింది.

1983లో మన్‌మోహన్‌ దేశాయ్‌ ‘కూలీ’ షూటింగ్‌లో అమితాబ్‌ డొక్కలో టేబుల్‌ అంచు దిగబడింది. ఎనిమిది నెలలు హాస్పిటల్‌లో ఉండిపోయాడు. ప్రాణం పోయిందనే అనుకున్నారు. హిందు ముస్లిం క్రిస్టియన్‌ అని లేకుండా ప్రజలందరూ అతడి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. అమితాబ్‌ లేచి వచ్చాడు. కాని పూర్వపు ప్రభ ఇక ముగిసినట్టే. అప్పటికే ప్రత్యర్థులు అమితాబ్‌కు పోటీ వెతుకుతున్నారు. వినోద్‌ ఖన్నా, మిధున్‌ చక్రవర్తిలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు అనిల్‌ కపూర్, రిషి కపూర్, జాకీ ష్రాఫ్, సన్ని డియోల్‌ బలపడ్డారు. ఇక లాభం లేదని 1984లో అమితాబ్‌ రాజకీయాల్లో దిగాడు. బోఫార్స్‌ బురద అంటింది. ఆ వివాదంలో సొంత తమ్ముడు అజితాబ్‌ను శాశ్వతంగా దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ బురద నా వల్ల కాదు అని బయటకు వచ్చాడు. తన స్నేహితుడు టీనూ ఆనంద్‌ దర్శకత్వంలో ‘షెహన్‌షా’ చేశాడు. అది ఓ మోస్తారు హిట్‌. కాని ఆ తర్వాత చేసిన ‘జాదూగర్‌’, ‘తూఫాన్‌’ ఘోరంగా ఫ్లాప్‌ అయ్యాయి. మేకప్‌ వేసుకోవడానికి కూడా నోచుకోలేని స్థితి. బలవంతపు రిటైర్‌మెంట్‌.

చీమూడవ పాతిక (1992–2017)
నుసి నుంచి నింగి
కి

జీవితంలో అమితాబ్‌ చేసిన అతి పెద్ద తప్పు ‘ఏబిసిఎల్‌’ స్థాపించడం. దేశభాషలలో సినిమాలు తీయడానికి 1996లో స్థాపించిన ఈ సంస్థ దారుణమైన నష్టాలను తీసుకొచ్చి చివరకు అమితాబ్‌ను అతడి బంగ్లా ‘ప్రతీక్ష’ నుంచి కూడా బయటకు ఈడ్చే స్థితికి తీసుకువచ్చింది. డబ్బు లేదు. సినిమాలు లేవు. కొడుకు కూతురు ఇంకా ఎదిగి రాలేదు. నింగికి ఎగిరిన సూపర్‌స్టార్‌ నేలన చతికిల పడి ఉన్నాడు. కాని అమితాబ్‌ ఓటమిని స్వీకరించే మనిషి కాడు. అది వాళ్ల వంశంలోనే లేదు. అమితాబ్‌ లేచి నిలబడ్డాడు. తన చిరకాల మిత్రుడు యశ్‌ చోప్రా దగ్గరకు వెళ్లి ప్రాధేయ పడ్డాడు.

ఆయన ప్రమేయంతో ఆదిత్యా చోప్రా తీస్తున్న ‘మొహబ్బతే’ (2000)లో అవకాశం వచ్చింది. అది కొంచెం ఓదార్పు. కాని ఒక నష్టం జరిగాక ఒక లాభం ఉంటుందనడానికి నిదర్శనంగా అమితాబ్‌కు అదే సంవత్సరం వచ్చిన ఒక గొప్ప అవకాశం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో యాంకర్‌రోల్‌ దక్కడం. అప్పటి దాకా నటుడిగా చూసిన ప్రేక్షకులు ఈ షోలో అమితాబ్‌లోని వ్యక్తిని చూశారు. ఆయన ప్రవర్తన, మాట తీరు, దగ్గరితనం తిరిగి ఆయనకే కాదు ప్రేక్షకులకు కూడా మేజిక్‌ ఇచ్చాయి. మరో వైపు కొత్త దర్శకులు కొత్త పాత్రలతో ఆయనను పైకి లాగడం మొదలుపెట్టారు.

‘బ్లాక్‌’, ‘బంటీ ఔర్‌ బబ్లీ’, ‘సర్కార్‌’, ‘చీనీ కమ్‌’... ఈ సినిమాలన్నీ అమితాబ్‌ స్టార్‌డమ్‌ ఎక్కడికీ పోలేదని నిరూపించాయి. ఇటీవలి ‘పా’, ‘పికూ’, ‘పింక్‌’ సినిమాలైతే అమితాబ్‌ ఒక పరిపూర్ణమైన నటుడు ఇంతకు ముందు ఏదైనా, ఇక మీదట ఏదైనా ఆయన పరిపూర్ణంగా తాను చేయవలసిందంతా చేసేశాడు అనే నిర్థారణతో ఆయన కెరీర్‌ను మూల్యాంకనం చేశాయి.
‘సినిమాల్లో రాణించడానికి అందంగా అయినా ఉండాలి. లేదా భిన్నంగా అయినా చేయాలి. అమితాబ్‌ అందంగా ఉండి భిన్నంగా చేయగలడు. అందుకే నిలబడ్డాడు’ అని శతృఘ్నసిన్హా అన్నాడు. అమితాబ్‌ యాక్షన్, కరుణ, హాస్యం, రొమాన్స్‌ అన్నీ భిన్నంగా చేయడం వల్లే మన గుండెల్లో నిలబడిపోయాడు. ‘డాన్‌’, ‘చుప్‌ కే చుప్‌ కే’, ‘అభిమాన్‌’, ‘కభీ కభీ’, ‘సిల్‌ సిలా’... ఎన్నో సినిమాలు ఎన్నో జ్ఞాపకాలు.
షారూక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌... బాలీవుడ్‌కు ‘కింగ్‌’లే కావచ్చు.
కాని అమితాబ్‌ ఎప్పటికీ కింగ్‌లకు కింగ్‌.
అతడు షెహెన్‌షా. అతడే షెహెన్‌ షా.

మంచి మామగారు...


ఐశ్వర్యా రాయ్‌ మామగారుగా అమితాబ్‌ చాలా బాధ్యతా యుతంగా కనిపిస్తుంటారు. చాలా పార్టీలకు ఆయన తన కోడలితో హాజరు కావడం చూడవచ్చు. ఐశ్వర్య రాయ్‌ ఒక పాపకు జన్మనిచ్చాక ఆ పాపే లోకం అయ్యింది అమితాబ్‌కు. కుమార్తె శ్వేత అన్నా ఆయనకు ఎంతో ఇష్టం. కుమారుడు అభిషేక్‌ బచ్చన్, భార్య జయబాధురి... అందరు కుటుంబ సభ్యులతో ఆయన కంప్లీట్‌ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement