ఆ విషయంలో నేను లక్కీ
ఆ విషయంలో నేను లక్కీ
Published Wed, Feb 5 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
‘‘సినీ పరిశ్రమలో పేరెన్నికగన్న కుటుంబాలు నాలుగైదుంటాయి. వారు తమ ఫ్యామిలీస్‌తో సినిమాలు చేస్తే... ఓ నాలుగైదు సినిమాలొస్తాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఓ సినిమా చేసే అవకాశం నాకొచ్చింది. ఆ విషయంలో నేను లక్కీ’’ అని దర్శకుడు శ్రీవాస్ అన్నారు. ఆయన దర్శకత్వంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్‌సందేశ్, తనీష్, హన్సిక, ప్రణీత కలిసి నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. గత వారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘‘మోహన్‌బాబు లాంటి లెజెండ్‌తో పనిచేసేటప్పుడు ఏదైనా తేడా వస్తే మళ్లీ మొహం చూపించలేం. అందుకే.. ముగ్గురు రచయితలతో కలిసి కష్టపడి ఈ చిత్రానికి పనిచేశాను. మోహన్‌బాబు కూడా ఎంతో సహకరించారు. జనరేషన్‌కి తగ్గట్టుగా మాడ్యులేషన్ మార్చుకుని ప్రేక్షకుల్ని మెప్పించారు’’ అని శ్రీవాస్ తెలిపారు. ‘‘నా తొలి చిత్రం ‘లక్ష్యం’, తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’. ఇప్పుడు ఇది. నా మూడు సినిమాలూ మల్టీస్టారర్లే కావడం యాదృచ్ఛికం’’ అన్నారు శ్రీవాస్. సినిమా బాగా తీశావ్ అని కొందరంటే... ఇంతమంది హీరోల్ని బాగా హ్యాండిల్ చేశావ్ అని ఇంకొందరు అన్నారని, తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అదే అనిపించిందని శ్రీవాస్ ఆనందం వ్యక్తం చేశారు.
కథా విస్తరణ సమయంలోనే మనోజ్‌తో లేడీ గెటప్ వేయించాలనే ఆలోచన వచ్చిందని, మనోజ్‌కి ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేశాడని, ‘నర్తనశాల’ స్ఫూర్తిగా ద్వితీయార్ధాన్ని తీర్చిదిద్దామని, బృహన్నల పాత్రే మనోజ్ స్త్రీ వేషానికి ప్రేరణ అని శ్రీవాస్ చెప్పారు. మోహన్‌బాబు సలహా మేరకు లక్ష్మీప్రసన్నతో ఓ పాట అనుకున్నామని, పాట రికార్డింగ్ కూడా చేశామని, కానీ ఆ పాటను సినిమాలో చేర్చడం కుదర్లేదని శ్రీవాస్ చెప్పారు.
Advertisement
Advertisement