పాండవులు పాండవులు తుమ్మెద...
‘పాండవులు పాండవులు తుమ్మెద... పంచ పాండవులోయమ్మ తుమ్మెద’ అంటూ ‘అక్కా చెల్లెలు’ సినిమాలో ‘షావుకారు జానకి పాట పాడుతుంది. చాలా చక్కటి ఫీల్ ఉన్న పాట అది. ఇప్పుడా పాట పల్లవే సినిమా టైటిల్ అయ్యింది. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ మొత్తం నటిస్తున్న చిత్రానికి ఈ టైటిల్‌నే నిర్ణయించారు. టైటిల్లోనే ఏదో ఆసక్తి ధ్వనిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారు.
రవీనాటాండన్, హన్సిక, ప్రణీత నాయికలు. ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. అరియాన-వివియాన సమర్పణలో మంచు విష్ణువర్థన్‌బాబు - మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థలో ఇది 58వ చిత్రం. మోహన్‌బాబు విభిన్న గెటప్‌తో ఉన్న ఫస్ట్‌లుక్‌ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి, బప్పీలహరి, మణిశర్మ, బాబా సెహగల్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫలణి కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.ఆర్.