
30 కోట్లతో పాండవులు.. తీశాం: మోహన్ బాబు
రొమాంటిక్ డ్రామా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెదా'ను 30 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీగా రూపొందించినట్లు నటుడు, నిర్మాత మోహన్ బాబు తెలిపారు. తన ఇద్దరు కుమారులు మంచు మనోజ్, విష్ణు ఇద్దరితో కలిసి మోహన్ బాబు కలిసి తొలిసారిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన కుమారులిద్దరూ నటిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు బాగా పెరిగాయని, అందుకే తాము ఈ విషయంలో రాజీ పడదలచుకోలేదని ఆయన తెలిపారు. అందుకే 30 కోట్లతో సినిమా తీశామన్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం షడ్రసోపేతమైన విందు అందిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పోస్టర్ విడుదల నుంచి ఆడియో రిలీజ్, ట్రైలర్ల విడుదల వరకు ప్రతి స్థాయిలో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సినిమాలో ఇంకా రవీనా టాండన్, వరుణ్ సందేశ్, హన్సిక, ప్రణీత, తనీష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బప్పా లహరి, అచ్చు రాజమణి, చిన్నా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది.