తమిళసినిమా: ఆ మూడు నాకు సినిమా అంటే నేర్పించాయి అని చెప్పింది నటి మనీషాయాదవ్. ఈ బ్యూటీలో మంచి నటి ఉందన్న విషయాన్ని తొలి చిత్రంతోనే నిరూపించుకుంది. అయితే రాజీ పడని మనస్తత్వం, నిర్ణయానికి కట్టుబడే వ్యక్తిత్వం మనీషా యాదవ్ ఎదుగుదలకు అవరోధాలయ్యాయని చెప్పవచ్చు. లేకపోతే బాలాజీ శక్తివేల్ అనే మంచి దర్శకుడి స్కూల్ నుంచి వచ్చిన మనీషాయాదవ్ తొలి చిత్రం వళక్కు ఎన్ 18/9తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వరుసగా ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన మనీషా యాదవ్ ఇటీవల ఒరు కుప్పై చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తూ ఒప్పుకున్న కథా పాత్రలను అంకితభావంతో నటించి న్యాయం చేయడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తోందట. అలా నటిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ తన అనుభవాలను పంచుకుంటూ దర్శకులు బాలాజి శక్తివేల్, సుశీంద్రన్, కరు.పళనీయప్పన్ ముగ్గురు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో వరుసగా నటించాను.
అలా నటించడం నిజంగా నాకు దక్కిన అదృష్టంగానే భావిస్తాను. వళక్కు ఎన్ 18/9 చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే విధంగా జన్నల్ ఓరం చిత్రం అవకాశం వచ్చింది. ఆ మూడు చిత్రాలు నాకు సినిమాను పూర్తిగా నేర్పించాయి. ఆ అనుభవంతోనే ఒరు కుప్‌పైకథ చిత్రంలో నటించాను నేను కోలీవుడ్‌కు పరిచయం అయ్యి ఐదేళ్లు అయ్యింది. ఈ ఐదేళ్లలో నటననే కాకుండా తమిళ భాషనూ నేర్చుకున్నాను. ఇంతకు ముందు కొంచెం కొంచెం తమిళంలో మాట్లాడే నేను ఇప్పుడు చాలా సరళంగా మాట్లాడగలుగుతున్నాను. నా మనసుకు సంతృప్తి కలిగించిన పాత్రల్లో నటించడం ఇష్టం లేదు. అదే విధంగా ఒట్టి బొమ్మలా కనిపించి పోయే పాత్రల్లోనూ నటించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. ఇలాంటి నిర్ణయంతో చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను. అయినా పర్వాలేదు నాకు కథ, కథా పాత్ర చాలా ముఖ్యం అని అంటున్న మనీషాయాదవ్ త్వరలో ఒక ప్రముఖ హీరోతో నటించే చిత్రం గురించి చర్చల్లో ఉందని త్వరలోనే ఆ వివరాలు చెబుతానని అంది. అదే విధంగా మరి కొన్ని చిత్రాల అవకాశాలు చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment