ఎవరూ విమర్శించలేదు.. అదే సంతోషం అంటున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రభుత్వం మనోజ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. దాంతో చాలా సంతోషంగా ఫీలయ్యాను’ అన్నారు.
అంతేకాక ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ దారుణంగా విమర్శించేవారు. ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నార’ని తెలిపారు.
పద్మ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగ్గా.. ‘ఆ రోజు రాత్రి పడుకునే ముందు అనుపమ్ ఖేర్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఫ్రీజ్ అయిపోయాను. ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment