మనోరమకు అశ్రు నివాళి...
ప్రముఖ సీనియర్ నటి, తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మన్ననలందుకున్న మనోరమ శనివారం అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలో మనోరమ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఆమెకు గౌరవ సూచకంగా తమిళ సినీ పరిశ్రమ ఆదివారం షూటింగ్‌లు, సినిమా వేడుకలను రద్దు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సినీప్రముఖులు రజనీకాంత్, కమల్‌హాసన్ శరత్‌కుమార్,
విజయ్‌కాంత్ తదితరులు ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మనోరమ పార్థివ దేహంతో అంతిమ యాత్ర ఆరంభమైంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు దారి పొడవునా పుష్పాంజలి ఘటించారు. ఈ యాత్ర రెండు గంటల పాటుగా సాగింది. ఆరున్నర గంటల సమయంలో మైలాపూర్ కైలాసపురం శ్మశాన వాటికలో మనోరమ భౌతికదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
నటిగా గిన్నిస్ రికార్డ్: తమిళంలో ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఆమెది. తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులతో నటించారు. ఆమె తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ‘అరుంధతి’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఆమె 1500 చిత్రాల్లో న టించారు. ఇందుకు గానూ ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. 2002లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారామె.