ధనుష్‌ను... పెళ్లి చేసుకుందామనుకున్నా! | Married to Dhanush says | Sakshi
Sakshi News home page

ధనుష్‌ను... పెళ్లి చేసుకుందామనుకున్నా!

Published Tue, Aug 11 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

ధనుష్‌ను... పెళ్లి చేసుకుందామనుకున్నా!

ధనుష్‌ను... పెళ్లి చేసుకుందామనుకున్నా!

గాళ్ నెక్ట్స్ డోర్‌లా ఉంటుంది అవికా గోర్. లంగా ఓణీల్లో పదహారణాల తెలుగు పిల్లలా కనబడే ఈ గుజరాతీ చిన్నది ‘బాలికా వధు’ సీరియల్‌తో ఆలిండియా ఫేమస్. అటు నుంచి వెండితెరకొచ్చాక ఇప్పటివరకూ చేసినవి మూడు సినిమాలే. మూడూ తెలుగే. కానీ క్రేజ్ మాత్రం బోలెడంత. ‘సినిమా చూపిస్త మావ’తో ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించనున్న అవికతో కాసేపు...
 
 ***   చాలా రోజులైంది చూసి. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నట్టున్నారే?
 ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ తర్వాత చాలా ఆఫర్లొచ్చాయి. వాటిలో నాకు బాగా నచ్చిన కథ ఈ ‘సినిమా చూపిస్త మావ’. ఇది నచ్చడానికీ, దీన్ని ఎంచుకోవడానికీ కారణం ఉంది. నాకెప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండడమే ఇష్టం. ప్రయోగాల జోలికి వెళ్లను. నా వయసుకు తగ్గ కథ ఇది. సింపుల్ లవ్‌స్టోరీ విత్ మాస్ ఎలిమెంట్స్.
 
 ***   ఈ సినిమాకు సంబంధించి మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్?
 నాకు మొదటి నుంచి ‘రౌడీ రాథోడ్’, ‘రాంబో రాజ్‌కుమార్’ లాంటి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్స్ అంటే చాలా ఇష్టం. ‘ఉయ్యాల జంపాల’ తరహాలో సాగే అందమైన ప్రేమకథే అయినా రొమాన్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి.
 
 ***   అంటే... ఇది మాస్ ఎంటర్‌టైనర్ అనుకోవచ్చా?
 పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్ అని చెప్పను గానీ హీరో పాత్ర చాలా మాస్‌గా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. యూత్ అయితే హీరో పాత్రలో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక బ్యూటిఫుల్ క్లాసీ లవ్ స్టోరీగా ఈ సినిమాను చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే అమ్మాయి తండ్రి పాత్ర. రావు రమేశ్ గారు చాలా బాగా చేశారు. చెప్పాలంటే మా ముగ్గురిదీ మంచి కాంబినేషన్. అందరం చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది.
 
 ***   రావు రమేశ్‌తో గతంలోనూ పనిచేస్తున్నట్లున్నారుగా!
 అవును. ఆయనతో ఇది నా రెండో సినిమా. గతంలో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’లో చేశా. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ. మేమిద్దరం కలిస్తే ఫిల్మ్ మేకింగ్ గురించే కబుర్లు.
 
 ***   ఇంతకీ, ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
 ఈ సినిమాలో బెంగాలీ అమ్మాయిగా చేశాను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన అమ్మాయిని నేను. ఇక్కడ ఓ అబ్బాయితో ఎలా ప్రేమలో పడ్డాను, త ర్వాత మా ఇద్దరి ప్రేమ ఎలా సక్సెస్ అయిందన్నది ప్రధాన కథ. ముఖ్యంగా మా ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
 
 ***   రాజ్‌తరుణ్ తో మీరు కలసి నటించిన మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’ పెద్ద హిట్. మీ జంటకు మంచి పేరొచ్చింది. మళ్ళీ రాజ్‌తరుణ్‌తో నటించిన ఎక్స్‌పీరియన్స్ గురించి?
 మొదటి సినిమా నుంచి రాజ్‌తరుణ్ అంటే నాకు ఇష్టం. ఆన్‌స్క్రీన్ తనకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయినా, ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచే శాడు. ముందుగా తనకు ఏం కావాలో, ఎలా నటించగలనో ఆ క్లారిటీ ఉంది. ఎంత కష్టమైన సీన్ అయినా ఇష్టపడి చేసే తత్త్వం అతనిది. నాలాగా మంబయ్ నుంచి వచ్చి ఒక కొత్త ప్రాంతంలో యాక్ట్ చేస్తున్నవారికి ఎంతో కొంత సహకారం ఉండాలి. అది రాజ్‌తరుణ్‌లో ఉంది. నేను పక్కా గుజరాతీ అమ్మాయిని. నాకు ఒక్క ముక్క తెలుగు రాదు. నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు రాజ్‌తరుణ్ హెల్ప్ చేసేవాడు.
 
 ***   అలాంటి రాజ్‌తరుణ్ గురించి రెండులైన్లలో చెప్పమంటే...?
 చూడండి. నేను సినీ పరిశ్రమకు వచ్చి పదే ళ్లయింది. హీరోలుగా ఒక రేంజ్‌లో ఉండి తర్వాత యాటిట్యూడ్ ప్రాబ్లమ్‌తో తెరమరుగైన వాళ్లను చాలా మందిని చూశాను. కానీ రాజ్‌తరుణ్‌లో అలాంటి లక్షణాలుండవు. కామ్‌గోయింగ్, ఫన్నీ గై. కరెక్ట్ రూట్‌లో ఉన్నాడు. బాగా సక్సెస్ అవుతాడు.
 
 ***   నటన కాకుండా మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్‌లు ఉన్నాయా?
 చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. కొరియోగ్రఫీ అంటే ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ప్రభుదేవా, ఫరాఖాన్, రెమో వీళ్లందరూ చాలా ఇష్టం. వీళ్లు డ్యాన్స్ చేస్తోంటే మూమెంట్స్ గమనించేదాన్ని. ప్రస్తుతం ట్వల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేశా. అలాగే దర్శకత్వం మీద ఆసక్తితో, న్యూయార్క్ ఫిలిం అకాడమీలో స్క్రీన్‌రైటింగ్ కోర్సు చేస్తున్నా. ముఖ్యంగా రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్.
 
 ***   చదువుకునే రోజుల్లో ఎవరైనా మీ వెంటపడ్డారా?
 నాకు లవ్‌లెటర్సా? ఎవరైనా అబ్బాయి వేరే ఉద్దేశంతో మాట్లాడడానికి వస్తేనే చెంప చెళ్లుమనిపించేదాన్ని. చిన్నప్పటి నుంచి నన్ను టామ్‌బాయ్‌లా పెంచారు. నా సినిమాల్లో చూపించేంత సెలైంట్ అయితే కాదు. చాలా బ్యాడ్ గర్ల్‌ని.
 
 ***   కథానాయిక పాత్రలేనా? క్యారెక్టర్ రోల్స్ చేయడానికీ రెడీనా?
 లేదండి. నాకు ఆ ఆలోచన లేదు. ఎందుకంటే నాకెప్పుడూ కీలక పాత్రలే చేయాలని కోరిక. ఇంకా చెప్పాలంటే, హీరో తరహా పాత్రలు చేయాలని ఉండేది. కానీ నాకా చాన్స్ ఉండదు కదా! కాబట్టి, ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలు చేస్తుంటా. చెల్లి. మరదలు తరహా పాత్రల జోలికే వెళ్లను. ఈ మధ్యే మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమా వచ్చింది. అందులో ముగ్గురు హీరోయిన్స్, ఒక హీరో. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమా చేస్తావా అని! నాకెందుకో చేయాలనిపించదు. లీడ్ రోల్ చేయడమే నాకు ఇష్టం.
 
 ***   ప్రేమకథలకే పరిమితమా? డిఫరెంట్ సినిమా చేయాలని లేదా?
 ఇప్పుడు నన్ను ప్రేక్షకులు లవ్‌స్టోరీస్‌లో చూడటానికే ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే గుర్తుపట్టి మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఏది ఇష్టమో అదే చేయాలి. బోర్ కొట్టేంత వరకూ ఇలాంటి సినిమాల్లోనే చేస్తా.
 
 ***   అంటే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు కూడా చేయరా?
 లేదండి. నాకు నాకు సెట్ కావు. లీడ్ రోల్స్ చేస్తాను తప్పితే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అయితే చేయను.
 
 ***   ఆర్ట్ ఫిలిమ్స్ చేయాలనే ఆలోచన ఉందా?
 చేస్తాను. కానీ అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. నేను ప్రస్తుతం కన్నడలో ‘కేర్ ఆఫ్ ఫుట్‌పాత్-2’ అనే సినిమాలో చేస్తున్నా. చాలా డిఫరెంట్ స్టోరీ అది. గతంలో నేను చేస్తున్న సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ . అంతకు మించి ప్రస్తుతం బయటకు చెప్పలేను.
 
 ***   సినీ రంగంలో మీకు బాగా ఇష్టమైన నటి?
 బాలీవుడ్‌లో ఇష్టమైన నటి కాజోల్. ఆమె చేసినవన్నీ నాకు చాలా ఇష్టమైన రోల్స్. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా సరే, ఆమె నటన ను ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే, కాజోల్ నా రోల్ మోడల్. ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారో...ఆన్ స్క్రీన్‌లో కూడా అలాగే ఉంటారు.
 
 ***   మరి, మీకు బాగా ఇష్టమైన హీరో?
 ధనుష్ అంటే ఇష్టం. ఆయన నటించిన తమిళ సినిమాలు ఒక్కటీ చూడలేదు. హిందీ ‘రాన్‌ఝానా’ చూసి ఫ్లాట్ అయిపోయా. ఆయనను పెళ్లి చేసుకుందామనుకున్నా. తర్వాతే తెలిసింది ఆయనకు పెళ్లయిందని. చాలా హర్ట్ అయ్యా.
 
 ***   రియల్ లైఫ్‌లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
 లేరండి. నా కన్నా బెటర్‌గా ఉన్న వ్యక్తినే ఎంచుకుంటా. రెండో తరగతిలోనే షాహిద్ కపూర్‌ను చూసి ఫ్లాట్ అయిపోయా. నిజం చెప్పనా, ఆయన్ని అప్పుడే పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు నా డ్రీమ్‌బోయ్ ఆయనే!
 
 ***  మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి?
 ‘ఉయ్యాల జంపాల’ టీమ్‌తో మళ్లీ చేస్తున్నా. అలాగే ఓ హిందీ సినిమాలో హీరోయిన్‌గా చేయనున్నా.
 
 ***   టీవీ సీరియల్ ‘బాలికా వధు’లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది?
 నాకు చిన్నతనం నుంచి నటనంటే చాలా ఇంట్రస్ట్. కొన్ని సీరియల్స్ కోసం ఆడిషన్స్‌కు వెళ్లా గానీ సెలక్ట్ కాలేదు. లక్కీగా ‘బాలికా వధు’ సీరియల్‌లో ఆనంది పాత్రకు ఎంపికయ్యా.
 
 ***   మరి, ఫస్ట్‌ఫిల్మ్ ‘ఉయ్యాల జంపాల’ ఎలా వచ్చింది?
 ‘బాలికా వధు’ చేస్తున్నప్పుడే సినిమాలు కూడా చేద్దామని డిసైడయ్యా. చాలా కథలు విన్నా. ఏమీ నచ్చలేదు. అప్పుడే సరిగ్గా ‘ఉయ్యాల జంపాల’ స్క్రిప్ట్ వచ్చింది. జీవితానికి దగ్గరగా ఉండే సింపుల్ లవ్ స్టోరీ. నచ్చింది, చేశా.
 
 ***   ఇప్పుడున్న కథానాయికలతో పోలిస్తే మీరు కాస్త లావుగా ఉన్నారు. మరి సన్నబడాలనే ఆలోచన ఏమైనా ఉందా?
 అది నేను చేసే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలంటే తగ్గుతా, పెరగాలంటే పెరుగుతా.
 
 ***   జీరో సైజ్ మీద మీకు నమ్మకం ఉందా?
 లేదు. నా దృష్టిలో అన్నింటి కన్నా యాక్టింగ్ ముఖ్యం.
 
 ***   ఇండియన్ బ్యూటీ అంటే మీ దృష్టిలో అర్థం?
 సింప్లిసిటీ. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాజోల్.
 
 ***   మీరు తొమ్మిదేళ్లు ఆస్తమాతో బాధపడ్డారని విన్నాం. అది నిజమేనా?
 అది పూర్తి నిజం కాదు. ఒకప్పుడు ఆస్తమా ఉండేది కానీ, మరీ అంత ఇబ్బంది పడేంత కాదు.
 
 ***   అమ్మాయిలు హెల్దీగా ఉండడానికి మీరిచ్చే సలహా ఏంటి? డైట్ గురించి ఏం చెబుతారు?
 మన మనసు ఏం చెబుతుందో అదే చేయాలి. అంతకు మించిన సూత్రం ఇంకేమీ లేదు. నా మటుకు నేనైతే, నాకు ఏది తినాలని అనిపిస్తే అది తినేస్తా. అయితే, లిమిట్స్‌లో ఉంటా. ప్రత్యేకంగా డైట్ ఫాలో కాను. ఎక్కువగా నీళ్లు తాగుతా. రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తా. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ చిట్కా చాలు.
 
 - శశాంక్ బి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement