Avika gore
-
దీపావళికి షణ్ముఖ
ఆది సాయికుమార్ హీరోగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పాన్ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుంది. రవి బస్రూర్ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీపావళి సీజన్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అవికా గోర్ సినిమా
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్ కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డ్ దక్కింది. గతేడాదిలో నిర్మాతగా పాప్‌కార్న్ అనే చిన్న సినిమాను ఆమె నిర్మించింది. కానీ, ఆ సినిమా నష్టాలను మిగిల్చింది. అవికా గోర్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో 'బ్లడీ ఇష్క్' అనే హారర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్లో '1920, రాజ్ వంటి హారర్ సినిమాలతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే కాన్సెప్ట్‌తోనే 'బ్లడీ ఇష్క్' చిత్రాన్ని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఓటీటీలో ఎప్పుడు విడుదలబ్లడీ ఇష్క్ సినిమా జులై 26న ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ట్రైలర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అవికా గోర్‌కు తెలుగు మార్కెట్ ఎక్కువని చెప్పవచ్చు. -
విలేజ్ లవ్‌స్టోరీ
అనురాగ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు ఊర్ల మధ్య గొడవలు హీరో హీరోయిన్ల ప్రేమకు ఎలా అడ్డంకిగా మారాయి? ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఎలా ముగుస్తుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందన్నట్లుగా విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, నేపథ్య సంగీతం: జీవన్ బాబు. -
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్‌పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను’’ అన్నారు. -
నా కల నెరవేరింది
‘‘నేను హారర్ సినిమాలను భయపడుతూ చూస్తాను. ‘రాజుగారి గది 3’ హారర్ కామెడీ. కానీ ‘1920’ సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి.. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత మరిన్ని హారర్ కథల కోసం దర్శక–నిర్మాతలు నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేష్ భట్ రచన, సమర్పణలో రూపొందిన చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’. కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవికా గోర్ లీడ్ రోల్లో నటించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘మహేష్ భట్, విక్రమ్ భట్‌లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడం నా కల. ‘1920’ చిత్రంతో అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. మహేష్ భట్, విక్రమ్ భట్ గార్లతో మాట్లాడుతునప్పుడు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాగార్జునగారిలో కూడా ఆ క్వాలిటీ చూశాను. ‘1920’ కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ఈడీ స్క్రీన్) వాడాం.. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను నటించిన ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. ఆది సాయికుమార్‌కి జోడీగా నటించనున్న ‘అమరన్’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 1920
‘‘నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం. కానీ ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా చూడాలనిపిస్తోంది. చూడాలని పించేలా ఈ సినిమాను చేశారు’’ అన్నారు నాగార్జున. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’. దర్శక–నిర్మాత మహేశ్‌భట్ రచన, సమర్పణలో కృష్ణాభట్ దర్శకత్వంలో రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్భట్గారు చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ‘తెలుసా మనసా’ (‘క్రిమినల్’) పాటను ఆయన చేయించుకున్న విధానం నాకిప్పటికీ గుర్తు ఉంది. ఇక ‘1920’ ట్రైలర్ బాగుంది. ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అవికా కెరీర్లో ఈ సినిమా పెద్దహిట్‌గా నిలవాలి. అలాగే ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అందరినీ మళ్లీ థియేటర్లోకి తీసుకు రావాలి.. జై శ్రీరామ్’’ అన్నారు నాగార్జున. ‘‘నాగార్జునగారి వల్లే ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ను తెలుగులో విడుదల చేస్తున్నాం. వాళ్ల నాన్నగారి విలువలు, సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నాగార్జున. విలువలు, సంస్కారం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘1920’ సినిమా కథ ఈ అంశాల గురించే’’ అన్నారు మహేశ్‌భట్. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ నుంచి నాగార్జునగారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలో నా తొలి చిత్రం ‘1920’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ‘1920’ నా కెరీర్లో స్పెషల్ మూవీ’’ అన్నారు అవికా గోర్. ‘‘ఇదొక ఎమోషనల్ లవ్‌స్టోరీ. హారర్‌లో ఎమోషన్ ను ప్రయత్నించడం ఇదే తొలిసారి’’ అన్నారు కృష్ణాభట్. -
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్‌కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్‌గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్‌లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
సౌందర్య తర్వాత ఆమె అంటేనే నాకు ఇష్టం: సి. కల్యాణ్
‘‘సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో ఎప్పుడూ సక్సెస్ రాదు.. ఒకరికొకరు తోడవ్వాలి. మా గురువుగారు (దాసరి నారాయణరావు) అదే చెప్పేవారు’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్‌ను సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ వస్తుంది’’ అన్నారు. ‘‘అంజిని చూస్తే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తీసిన దర్శకుడిలా లేడు. బి. గోపాల్, వీవీ వినాయక్‌లా కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నాడు’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ‘‘మేం ఈ సినిమా ఆరంభించినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతోందని అనుకున్నప్పుడు సపోర్ట్ అవసరమని అడగ్గానే రవి కొల్లిపర ముందుకొచ్చారు ’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘96, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఉంటుంది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేశాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో నా క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు అవికా గోర్. -
ఇటలీలో ల్యాండ్ అయిన నాగచైతన్య
కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’ చిత్రబృందం ఇటలీలో ల్యాండ్ అయింది. పదిహేను రోజుల షూటింగ్‌ను అక్కడ ప్లాన్ చేశారు. ఇటీవల వైజాగ్‌లో ఒక షెడ్యూల్ జరిగింది. ఇప్పుడు ఇటలీలో జరుగుతున్న షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్లాన్ చేశారు. ఇటలీలో జోరుగా షూటింగ్ చేస్తున్నారు. మరి.. యూనిట్ ఇటలీ నుంచి వచ్చాక ఇక్కడి పరిస్థితులను బట్టి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ‘మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ ఇందులో కీలక పాత్రధారి. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: -
రాజుగారి గది 10 కూడా ఉండొచ్చు
‘‘మంచి మంచి సినిమాలు చేయాలి. అవి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయాలి. ‘వీడు బాగా చేశాడ్రా’ అని ప్రేక్షకులు అనుకుంటే చాలు ’’ అంటున్నారు అశ్విన్‌బాబు. ‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తున్న మరో చిత్రం ‘రాజుగారి గది 3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికా గోర్ జంటగా నటించారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ – ‘‘రాజుగారి గది’ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే ఆలోచనే లేదు. ప్రేక్షకులు కోరుకోవడంతో సీక్వెల్ రూపొందించాం. మూడో పార్ట్ వరకూ వచ్చింది. వాళ్లకు నచ్చితే ‘రాజుగారి గది 10’ కూడా ఉండొచ్చు. సెకండ్ పార్ట్‌లో కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నారు. అందుకే థర్డ్ పార్ట్‌లో ఫుల్ ఎంటర్టైన్మైంట్ గ్యారెంటీ. ఓ మలయాళ సినిమా నుంచి తీసుకున్న పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేశాం. ముందు హీరోయిన్గా తమన్నాను అనుకున్నాం. డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడి ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. మొదటి రెండు భాగాల్లో నేను కీలక పాత్రలు చేసినా ఈ సినిమా మాత్రం నా భుజాల మీద నడుస్తుంది. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రస్తుతం నాకు మార్కెట్ లేదు. మార్కెట్ ఏర్పరచుకుంటున్నాను. నాతో సినిమా చేసే నిర్మాతకు డబ్బు మిగలాలన్నదే నా లక్ష్యం. అన్నయ్య (ఓంకార్) టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటి నుంచి ప్రొడక్షన్లో ఉన్నాం. అందుకే నిర్మాతల గురించి ఆలోచిస్తాను. విభిన్న కథల్లో నటించాలనుంది. కుస్తీ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించిన కథ చర్చల్లో ఉంది. ఆ సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
అవికా గోర్ స్థానంలో హేబా పటేల్
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతోందన్న విషయం మరోసారి రుజువైంది. సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా కుమారి 21 ఎఫ్. విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్, హేబా పటేల్‌లు లీడ్ రోల్స్‌లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్‌కు రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా తొలుత అవికా గోర్‌ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్‌లో హేబాను సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఆ తరువాత జి నాగేశ్వరరెడ్డి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
వెళ్ళాలని తను.. వద్దని నేను!
►చిత్రం: ‘తను - నేను’ ►తారాగణం: సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు ►కథ - స్క్రీన్‌ప్లే - మాటలు:సాయి సుకుమార్, పి. రామ్మోహన్ ►ఆర్ట్: ఎస్. రవీందర్ ►ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్ ►సంగీతం: సన్నీ ఎం.ఆర్ ►సమర్పణ: డి. సురేశ్‌బాబు ►నిర్మాత - దర్శకుడు: పి. రామ్మోహన్ కథ చెబుతూ... కళ్ళకు కట్టించడం వేరు. కళ్ళెదుట తెరపై చూపిస్తూ, మెప్పించడం వేరు. మొదటిది రచన, కథన సామర్థ్యాలకు గీటురాయి అయితే, రెండోది తెరపై కథాకథనమనే దర్శకత్వ నైపుణ్యానికి పరీక్ష. గతంలో ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’ లాంటి విభిన్న తరహా ప్రయత్నాలను తెర పైకి తేవడంలో పేరు తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు పి. రామ్మోహన్ ఈసారి దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. అమెరికా డబ్బు మీద మోజు, ఆ జీవితం మీద వ్యామోహం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ అల్లారు. కథేమిటంటే... హైదరాబాద్‌లో ‘ఈస్ట్ వెస్ట్’ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ కాల్సెంటర్లో పనిచేస్తుంటాడు కిరణ్ (సంతోష్ శోభన్). పెంచిన నాయనమ్మ చనిపోతే, ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు. అతనికి నరేశ్ (అభిషేక్ మహర్షి) వగైరా మంచి ఫ్రెండ్స్. బెంగుళూరులో ఉంటున్న నరేశ్ ఫ్రెండ్ కీర్తి (అవికా గోర్) ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఆమెను చూసీ చూడగానే హీరో ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తరువాత ఆమె కూడా అతని ప్రేమలో పడుతుంది. కీర్తి కుటుంబానిదో కథ. తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు)కు అమెరికా పిచ్చి. కొడుకు, కూతురైనా బాగా చదివి, అమెరికా వెళ్ళి, డబ్బు సంపాదిస్తే, తాను పెద్ద ఇల్లు, కారు కొనుక్కోవాలనుకొనే తరహా. కొడుకేమో లవ్ మ్యారేజ్ చేసుకొని, చెక్కేస్తాడు. తండ్రి కోరికకు కట్టుబడి, ఎనిమిదో ఏటే దేవుడి మీద ఒట్టేసి మరీ ఒప్పుకున్న కూతురు కీర్తి. అమెరికా వెళ్ళాలన్నది ఆమె ధ్యేయం. హీరో అందుకు పూర్తిగా విరుద్ధం. అమెరికా అన్నా, అక్కడ సెటిలైన ఎన్నారైలన్నా కడుపు మంట. ఛస్తే అక్కడికి పోనంటాడు. అక్కడికి ‘బ్రేక్’ (అప్). సెకండాఫ్‌కి వస్తే, హీరోకూ, అమెరికా అంటే అతనికున్న అసహ్యానికీ ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్. ఏడాది వయసున్న హీరోను వదిలేసి, అతని అమ్మా నాన్న డబ్బు సంపాదన వేటలో అమెరికా వెళ్ళిపోతారు. గత 20 ఏళ్ళలో మూడే మూడుసార్లు ఇండియా వచ్చి, చూసిపోతారు. నాయనమ్మ దగ్గరే పెరిగిన హీరోకు, ఆమె చనిపోయినా రాని నాన్న అంటే సహజంగానే అసహ్యం. అందుకే, ఎవరూ లేరన్నట్లు పెరుగుతుంటాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ అమెరికా వెళ్ళడం మానేసి అయినా, హీరోనే పెళ్ళాడాలనుకుంటుంది. కానీ, వాళ్ళ పెళ్ళికి హీరోయిన్ తండ్రి అడ్డంకి అవుతాడు. అప్పుడు హీరో ఏం కోరుకున్నాడు? ఏమైంది? వినోదం నిండిన ఈ ప్రేమకథ సంతోష్ శోభన్‌కు హీరోగా తొలి సినిమా. ఆ అనుభవ రాహిత్యమేదీ కనిపించనివ్వలేదీ కొత్త కుర్రాడు. అవికా గోర్ కెరీర్ జాబితా లెక్క ఈ సినిమాతో మరో అంకె పెరిగింది. పురుషాధిక్య భావజాలం, బద్ధకం నిండిన శాడిస్టు బండిరెడ్డి సర్వేశ్వరరావు పాత్రలో హీరోయిన్ తండ్రిగా రవిబాబు ఉన్న కాసేపు హాలులో కొత్త ఉత్సాహం తెస్తారు. ఇక, హీరోయిన్ తల్లి పాత్రలో సత్యా కృష్ణన్‌ది మొగుడి ప్రవర్తనను సదా మనసులోనే తిట్టుకొనే మహిళ పాత్ర. అందుకే, భర్త చనిపోయాక ఆమెలో విషాదఛాయలేమీ లేకపోవడం సహజమనుకోవాలి. అభిషేక్ మహర్షి వినోదం పంచుతారు. ఇప్పటి వరకు నిర్మాతగా ఉన్న పి. రామ్మోహన్‌కు దర్శకుడవడంతో వంట చేయించుకొనే బాధ్యత నుంచి చేసే బాధ్యతకు మారినట్లయింది. దాని వల్ల వచ్చే పాజిటివ్‌లు, నెగటివ్‌లు కూడా సహజమే. ఆ శైలి చూస్తే - నగేశ్ కుకునూర్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల తొలినాళ్ళు, స్వతంత్ర సినీ రూపకర్తల సినిమాలు గుర్తుకొస్తాయి. అందుకే, దీన్ని పూర్తి కమర్షియల్ సినిమాగా చూడలేం. సాంకేతిక విభాగాల తీరూ అందుకు తగ్గట్లే ఉన్నాయి. సెపరేట్ కామెడీ, స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు లేని ఈ ప్రేమకథలో తీసుకున్న పాయింట్ చిన్నది. 130 నిమిషాల సినిమాగా మజ్జిగ పల్చ నైంది. వరస చూస్తే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదని ఈ దర్శక, నిర్మాతల అభిప్రాయమేమో అనిపిస్తుంది. వేగంగా పరుగులు తీయకున్నా, ఫస్టాఫ్ బాగుందనిపించేలా నడిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్ కథ బయటికొచ్చి, కథలో కీలక పాయింట్ తెలిసిన తరువాత పరిస్థితి మారింది. ఒక్కముక్కలో- ఈ కథ సంసారపక్షం. కథనమే కాదు, నిర్మాణమూ అంతే. రొమాంటిక్ కామెడీలు చూసేవారి కిది ఓ.కె. అంతకు మించి అదనంగా ఏదైనా కోరుకుంటేనే చిక్కు! ►ఈ స్క్రిప్ట్ రామానాయుడు ఫిల్మ్‌స్కూల్ సాయిసుకుమార్ రాసింది. ► కేవలం 33 షూటింగ్ డేస్. ►హైదరాబాద్ పరిసరాల్లో, వికారాబాద్‌లో షూటింగ్. సెకండాఫ్‌లోని డ్యూయట్ పుణే దగ్గర లోనావాలా పరిసరాల్లో తీశారు. ► హీరో సంతోష్ శోభన్ ‘వర్షం’ చిత్ర దర్శకుడైన శోభన్ కుమారుడు. గతంలో ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో క్రికెట్ టీవ్ు కెప్టెన్ పాత్ర పోషించారు. ఇప్పుడు హీరోగా పరిచయం. - రెంటాల జయదేవ్ -
థ్రిల్ చేసే... మాంజ
కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాఠక్, నరేష్ డింగ్రీ, ఈషా డియోల్ కాంబినేషన్లో కిషన్ ఎస్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘ఫుట్‌పాత్-2’ తెలుగులో ‘మాంజ’ పేరుతో రానుంది. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన అవికా గోర్ మాట్లాడుతూ - ‘‘ఇది డిఫరెంట్ మూవీ. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. కిషన్ మాట్లాడుతూ - ‘‘బాల నేరస్థుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని ‘ఫుట్‌పాత్ -2’ కథ తయారు చేశాం. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జనరల్ కేటగిరీలో లేటరల్ ఎంట్రీ కోసం సబ్మిట్ చేశాం’’ అని తెలిపారు. అవికా గోర్‌తో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యామనీ, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు. -
ధనుష్‌ను... పెళ్లి చేసుకుందామనుకున్నా!
గాళ్ నెక్ట్స్ డోర్లా ఉంటుంది అవికా గోర్. లంగా ఓణీల్లో పదహారణాల తెలుగు పిల్లలా కనబడే ఈ గుజరాతీ చిన్నది ‘బాలికా వధు’ సీరియల్‌తో ఆలిండియా ఫేమస్. అటు నుంచి వెండితెరకొచ్చాక ఇప్పటివరకూ చేసినవి మూడు సినిమాలే. మూడూ తెలుగే. కానీ క్రేజ్ మాత్రం బోలెడంత. ‘సినిమా చూపిస్త మావ’తో ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించనున్న అవికతో కాసేపు... *** చాలా రోజులైంది చూసి. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నట్టున్నారే? ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ తర్వాత చాలా ఆఫర్లొచ్చాయి. వాటిలో నాకు బాగా నచ్చిన కథ ఈ ‘సినిమా చూపిస్త మావ’. ఇది నచ్చడానికీ, దీన్ని ఎంచుకోవడానికీ కారణం ఉంది. నాకెప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండడమే ఇష్టం. ప్రయోగాల జోలికి వెళ్లను. నా వయసుకు తగ్గ కథ ఇది. సింపుల్ లవ్‌స్టోరీ విత్ మాస్ ఎలిమెంట్స్. *** ఈ సినిమాకు సంబంధించి మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్? నాకు మొదటి నుంచి ‘రౌడీ రాథోడ్’, ‘రాంబో రాజ్‌కుమార్’ లాంటి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. ‘ఉయ్యాల జంపాల’ తరహాలో సాగే అందమైన ప్రేమకథే అయినా రొమాన్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. *** అంటే... ఇది మాస్ ఎంటర్టైనర్ అనుకోవచ్చా? పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పను గానీ హీరో పాత్ర చాలా మాస్‌గా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. యూత్ అయితే హీరో పాత్రలో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక బ్యూటిఫుల్ క్లాసీ లవ్ స్టోరీగా ఈ సినిమాను చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే అమ్మాయి తండ్రి పాత్ర. రావు రమేశ్ గారు చాలా బాగా చేశారు. చెప్పాలంటే మా ముగ్గురిదీ మంచి కాంబినేషన్. అందరం చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. *** రావు రమేశ్‌తో గతంలోనూ పనిచేస్తున్నట్లున్నారుగా! అవును. ఆయనతో ఇది నా రెండో సినిమా. గతంలో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’లో చేశా. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ. మేమిద్దరం కలిస్తే ఫిల్మ్ మేకింగ్ గురించే కబుర్లు. *** ఇంతకీ, ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఈ సినిమాలో బెంగాలీ అమ్మాయిగా చేశాను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన అమ్మాయిని నేను. ఇక్కడ ఓ అబ్బాయితో ఎలా ప్రేమలో పడ్డాను, త ర్వాత మా ఇద్దరి ప్రేమ ఎలా సక్సెస్ అయిందన్నది ప్రధాన కథ. ముఖ్యంగా మా ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. *** రాజ్‌తరుణ్ తో మీరు కలసి నటించిన మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’ పెద్ద హిట్. మీ జంటకు మంచి పేరొచ్చింది. మళ్ళీ రాజ్‌తరుణ్‌తో నటించిన ఎక్స్పీరియన్స్ గురించి? మొదటి సినిమా నుంచి రాజ్‌తరుణ్ అంటే నాకు ఇష్టం. ఆన్‌స్క్రీన్ తనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా, ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచే శాడు. ముందుగా తనకు ఏం కావాలో, ఎలా నటించగలనో ఆ క్లారిటీ ఉంది. ఎంత కష్టమైన సీన్ అయినా ఇష్టపడి చేసే తత్త్వం అతనిది. నాలాగా మంబయ్ నుంచి వచ్చి ఒక కొత్త ప్రాంతంలో యాక్ట్ చేస్తున్నవారికి ఎంతో కొంత సహకారం ఉండాలి. అది రాజ్‌తరుణ్‌లో ఉంది. నేను పక్కా గుజరాతీ అమ్మాయిని. నాకు ఒక్క ముక్క తెలుగు రాదు. నేను డైలాగ్స్ చెప్పేటప్పుడు రాజ్‌తరుణ్ హెల్ప్ చేసేవాడు. *** అలాంటి రాజ్‌తరుణ్ గురించి రెండులైన్లలో చెప్పమంటే...? చూడండి. నేను సినీ పరిశ్రమకు వచ్చి పదే ళ్లయింది. హీరోలుగా ఒక రేంజ్లో ఉండి తర్వాత యాటిట్యూడ్ ప్రాబ్లమ్‌తో తెరమరుగైన వాళ్లను చాలా మందిని చూశాను. కానీ రాజ్‌తరుణ్‌లో అలాంటి లక్షణాలుండవు. కామ్‌గోయింగ్, ఫన్నీ గై. కరెక్ట్ రూట్లో ఉన్నాడు. బాగా సక్సెస్ అవుతాడు. *** నటన కాకుండా మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్‌లు ఉన్నాయా? చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. కొరియోగ్రఫీ అంటే ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ప్రభుదేవా, ఫరాఖాన్, రెమో వీళ్లందరూ చాలా ఇష్టం. వీళ్లు డ్యాన్స్ చేస్తోంటే మూమెంట్స్ గమనించేదాన్ని. ప్రస్తుతం ట్వల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేశా. అలాగే దర్శకత్వం మీద ఆసక్తితో, న్యూయార్క్ ఫిలిం అకాడమీలో స్క్రీన్‌రైటింగ్ కోర్సు చేస్తున్నా. ముఖ్యంగా రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్. *** చదువుకునే రోజుల్లో ఎవరైనా మీ వెంటపడ్డారా? నాకు లవ్లెటర్సా? ఎవరైనా అబ్బాయి వేరే ఉద్దేశంతో మాట్లాడడానికి వస్తేనే చెంప చెళ్లుమనిపించేదాన్ని. చిన్నప్పటి నుంచి నన్ను టామ్‌బాయ్‌లా పెంచారు. నా సినిమాల్లో చూపించేంత సెలైంట్ అయితే కాదు. చాలా బ్యాడ్ గర్ల్‌ని. *** కథానాయిక పాత్రలేనా? క్యారెక్టర్ రోల్స్ చేయడానికీ రెడీనా? లేదండి. నాకు ఆ ఆలోచన లేదు. ఎందుకంటే నాకెప్పుడూ కీలక పాత్రలే చేయాలని కోరిక. ఇంకా చెప్పాలంటే, హీరో తరహా పాత్రలు చేయాలని ఉండేది. కానీ నాకా చాన్స్ ఉండదు కదా! కాబట్టి, ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలు చేస్తుంటా. చెల్లి. మరదలు తరహా పాత్రల జోలికే వెళ్లను. ఈ మధ్యే మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమా వచ్చింది. అందులో ముగ్గురు హీరోయిన్స్, ఒక హీరో. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమా చేస్తావా అని! నాకెందుకో చేయాలనిపించదు. లీడ్ రోల్ చేయడమే నాకు ఇష్టం. *** ప్రేమకథలకే పరిమితమా? డిఫరెంట్ సినిమా చేయాలని లేదా? ఇప్పుడు నన్ను ప్రేక్షకులు లవ్‌స్టోరీస్‌లో చూడటానికే ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే గుర్తుపట్టి మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఏది ఇష్టమో అదే చేయాలి. బోర్ కొట్టేంత వరకూ ఇలాంటి సినిమాల్లోనే చేస్తా. *** అంటే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు కూడా చేయరా? లేదండి. నాకు నాకు సెట్ కావు. లీడ్ రోల్స్ చేస్తాను తప్పితే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అయితే చేయను. *** ఆర్ట్ ఫిలిమ్స్ చేయాలనే ఆలోచన ఉందా? చేస్తాను. కానీ అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. నేను ప్రస్తుతం కన్నడలో ‘కేర్ ఆఫ్ ఫుట్‌పాత్-2’ అనే సినిమాలో చేస్తున్నా. చాలా డిఫరెంట్ స్టోరీ అది. గతంలో నేను చేస్తున్న సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది. ఓ క్రైమ్ థ్రిల్లర్ . అంతకు మించి ప్రస్తుతం బయటకు చెప్పలేను. *** సినీ రంగంలో మీకు బాగా ఇష్టమైన నటి? బాలీవుడ్లో ఇష్టమైన నటి కాజోల్. ఆమె చేసినవన్నీ నాకు చాలా ఇష్టమైన రోల్స్. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా సరే, ఆమె నటన ను ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే, కాజోల్ నా రోల్ మోడల్. ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారో...ఆన్ స్క్రీన్‌లో కూడా అలాగే ఉంటారు. *** మరి, మీకు బాగా ఇష్టమైన హీరో? ధనుష్ అంటే ఇష్టం. ఆయన నటించిన తమిళ సినిమాలు ఒక్కటీ చూడలేదు. హిందీ ‘రాన్‌ఝానా’ చూసి ఫ్లాట్ అయిపోయా. ఆయనను పెళ్లి చేసుకుందామనుకున్నా. తర్వాతే తెలిసింది ఆయనకు పెళ్లయిందని. చాలా హర్ట్ అయ్యా. *** రియల్ లైఫ్‌లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేరండి. నా కన్నా బెటర్‌గా ఉన్న వ్యక్తినే ఎంచుకుంటా. రెండో తరగతిలోనే షాహిద్ కపూర్‌ను చూసి ఫ్లాట్ అయిపోయా. నిజం చెప్పనా, ఆయన్ని అప్పుడే పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు నా డ్రీమ్‌బోయ్ ఆయనే! *** మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి? ‘ఉయ్యాల జంపాల’ టీమ్‌తో మళ్లీ చేస్తున్నా. అలాగే ఓ హిందీ సినిమాలో హీరోయిన్గా చేయనున్నా. *** టీవీ సీరియల్ ‘బాలికా వధు’లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? నాకు చిన్నతనం నుంచి నటనంటే చాలా ఇంట్రస్ట్. కొన్ని సీరియల్స్ కోసం ఆడిషన్స్‌కు వెళ్లా గానీ సెలక్ట్ కాలేదు. లక్కీగా ‘బాలికా వధు’ సీరియల్లో ఆనంది పాత్రకు ఎంపికయ్యా. *** మరి, ఫస్ట్ఫిల్మ్ ‘ఉయ్యాల జంపాల’ ఎలా వచ్చింది? ‘బాలికా వధు’ చేస్తున్నప్పుడే సినిమాలు కూడా చేద్దామని డిసైడయ్యా. చాలా కథలు విన్నా. ఏమీ నచ్చలేదు. అప్పుడే సరిగ్గా ‘ఉయ్యాల జంపాల’ స్క్రిప్ట్ వచ్చింది. జీవితానికి దగ్గరగా ఉండే సింపుల్ లవ్ స్టోరీ. నచ్చింది, చేశా. *** ఇప్పుడున్న కథానాయికలతో పోలిస్తే మీరు కాస్త లావుగా ఉన్నారు. మరి సన్నబడాలనే ఆలోచన ఏమైనా ఉందా? అది నేను చేసే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలంటే తగ్గుతా, పెరగాలంటే పెరుగుతా. *** జీరో సైజ్ మీద మీకు నమ్మకం ఉందా? లేదు. నా దృష్టిలో అన్నింటి కన్నా యాక్టింగ్ ముఖ్యం. *** ఇండియన్ బ్యూటీ అంటే మీ దృష్టిలో అర్థం? సింప్లిసిటీ. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాజోల్. *** మీరు తొమ్మిదేళ్లు ఆస్తమాతో బాధపడ్డారని విన్నాం. అది నిజమేనా? అది పూర్తి నిజం కాదు. ఒకప్పుడు ఆస్తమా ఉండేది కానీ, మరీ అంత ఇబ్బంది పడేంత కాదు. *** అమ్మాయిలు హెల్దీగా ఉండడానికి మీరిచ్చే సలహా ఏంటి? డైట్ గురించి ఏం చెబుతారు? మన మనసు ఏం చెబుతుందో అదే చేయాలి. అంతకు మించిన సూత్రం ఇంకేమీ లేదు. నా మటుకు నేనైతే, నాకు ఏది తినాలని అనిపిస్తే అది తినేస్తా. అయితే, లిమిట్స్‌లో ఉంటా. ప్రత్యేకంగా డైట్ ఫాలో కాను. ఎక్కువగా నీళ్లు తాగుతా. రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తా. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ చిట్కా చాలు. - శశాంక్ బి. -
సినిమా చూపిస్తాడు!
అటు ప్రేమను, ఇటు మామను సాధించుకున్న ఓ అల్లరి కుర్రాడి కథే ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. బెక్కెం గోపి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చూసి ‘దిల్’ రాజుగారు నైజాంలో విడుదల చేస్తున్నారు. దాంతో మా సినిమాపై ఇంకా నమ్మకం పెరిగింది’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని తెలిపారు. -
మామా అల్లుళ్ల కథ
సరదా సరదాగా జీవితాన్ని గడిపేసే ఓ యువకుని గుండెల్లో అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమ గంట మోగించేసింది. ఏదో మాయ చేసి ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు ఆ కుర్రాడు. అంతా సరిగ్గా ఉందనుకున్న సమయంలో వాళ్ల ప్రేమకథకు బ్రేకులు వేశాడు ఆ అమ్మాయి తండ్రి. తనకు కాబోయే మామను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఆ కుర్రాడు. ఈ మామా-అల్లుళ్ల సందడిని తెలుసుకోవాలంటే ‘సినిమా చూపిస్త మామ’ చూడాల్సిందే. రాజ్‌తరుణ్, అవికా గోర్ జంటగా రావు రమేశ్ ప్రధాన పాత్రలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రూపేష్, బోగాది అంజిరెడ్డి, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రానికి, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్న జె.కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్ దాశరథి శివేంద్ర. -
బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’
మార్చి 8, ఆదివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా జీ-తెలుగు చానల్లో అదే రోజు సాయంత్రం 6 గంటలకు అవికా గోర్, నాగ శౌర్య జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రసారం కానుంది. విజయనగరంలో ‘కొంచెం ఇష్టం - కొంచెం కష్టం’ రోహిణి, రేవతి, గౌతమ్ ఈ పేర్లు వింటే గుర్తొచ్చే సీరియల్ ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ అని ప్రేక్షకులు ఠక్కున చెబుతారు. రోహిణి , రేవతి ఇద్దరూ గౌతమ్‌ను ప్రేమిస్తారు. కానీ వారిలో ఎవరికి గౌతమ్ దక్కనున్నాడో తెలియాలంటే మార్చి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలోని అయోధ్య మైదానంలో జరిగే చిత్రీకరణకు ప్రేక్షకులు హాజరు కావాలని ‘జీ -తెలుగు’ టీవీ చానల్ ప్రతినిధులు తెలిపారు. -
‘బొమ్మరిల్లు’లో...‘ఇడియట్’ కుర్రాణ్ణి!
‘‘ ‘బొమ్మరిల్లు’ లాంటి ఇంట్లోకి ‘ఇడియట్’ లాంటి కుర్రాడు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంలో నా పాత్ర అలా ఉంటుంది’’ అంటున్నారు యువ హీరో నాగశౌర్య. నంద్యాల రవి దర్శకత్వంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ఇందులో అవికా గోర్‌ను ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అని పిలుస్తుంటాను. అందుకే... ఈ టైటిల్ పెట్టారనుకుంటా. కథంతా అవిక చుట్టూనే తిరుగుతుంది. నేనేమో ఆమె చుట్టూ తిరుగుతుంటాను. మా జంట ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది విడుదల అవుతున్న నా నాలుగో చిత్రమిది. ఇప్పటివరకూ విడుదలైన నా మూడు చిత్రాలూ విజయాలను అందుకున్నాయి. ఈ నాలుగో చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాంక్షించారు నాగశౌర్య. తను పోషించిన పాత్ర గురించి వివరిస్తూ -‘‘తన తండ్రిని ఒప్పిస్తేనే మన పెళ్లి అని హీరోయిన్ షరతు పెడుతుంది. దీంతో హీరోయిన్ ఇంట్లోకి ప్రవేశించిన హీరో... వాళ్లను పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేదే సినిమా. ఇందులో నేను పూర్తిగా ఎనర్జిటిక్‌గా ఉంటా. అలాగే నా పాత్రకు బాధ్యత కూడా ఉంటుంది. రవితేజకు ‘ఇడియట్’ ఎంతటి పేరు తెచ్చిందో, ఈ సినిమా నాకు అంతటి పేరు తెస్తుంది. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే కచ్చితంగా ఇది కొత్త పాత్రే’’ అన్నారు నాగశౌర్య.