మామా అల్లుళ్ల కథ
సరదా సరదాగా జీవితాన్ని గడిపేసే ఓ యువకుని గుండెల్లో అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమ గంట మోగించేసింది. ఏదో మాయ చేసి ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు ఆ కుర్రాడు. అంతా సరిగ్గా ఉందనుకున్న సమయంలో వాళ్ల ప్రేమకథకు బ్రేకులు వేశాడు ఆ అమ్మాయి తండ్రి. తనకు కాబోయే మామను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఆ కుర్రాడు. ఈ మామా-అల్లుళ్ల సందడిని తెలుసుకోవాలంటే ‘సినిమా చూపిస్త మామ’ చూడాల్సిందే.
రాజ్‌తరుణ్, అవికా గోర్ జంటగా రావు రమేశ్ ప్రధాన పాత్రలో ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రూపేష్, బోగాది అంజిరెడ్డి, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రానికి, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్న జె.కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్ దాశరథి శివేంద్ర.