Rajtarun
-
మస్తాన్ సాయి విచారణలో విస్తుపోయే నిజాలు
మణికొండ: రెండు రోజులుగా పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొన్న మస్తాన్‌సాయిని(Mastan Sai Case) శనివారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి యువతులకు పార్టీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇవ్వటం, వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడటం, దానిని సీక్రెట్ కెమెరాలు, సెల్ఫోన్ల వీడియా తీసి రికార్డు చేయటం, వాటిని ఆధారంగా చేసుకుని యువతులను పలుమార్లు బ్లాక్మెయిల్ చేయడం చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కోవలో సినీహీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సైతం అతని ఉచ్చులో చిక్కుకుంది. అతని వద్ద తన వీడియోలు ఉన్న హార్డ్డెస్్కను తస్కరించిన ఆమె దాని ఆధారంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన హార్డ్డెస్క్ తిరిగి ఇవ్వాలని మస్తాన్‌సాయి లావణ్యను బెదిరించడమేగాక తనతో పాటు తన ఇంటిపై దాడి చేశాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంటికి వచ్చిన సమయంలో మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు ఖాజా మెయినుద్దీన్ డ్రగ్స్ తీసుకుని ఉండటంతో పరీక్షలు నిర్వహించిన పోలీసులు నార్కోటిక్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ నెల 2న అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్దేశపూర్వకంగానే నేరాలు... మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించటంతో అతను ఉద్దేశపూర్వకంగానే యువతులకు డ్రగ్స్ ఇవ్వటం, నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలు ఉద్దేశ పూర్వకంగానే చేశానని అంగీకరించినట్టు తెలిసింది. తల్లితండ్రుల అతి గారాబం కారణంగా ఉన్నత చదువులు చదువుకున్నా వక్రమార్గంలో పయనించినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్, ఇతర యువతులను నగ్న వీడియోలు తీయటం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అతడి నైజంగా పోలీసులు గుర్తించారు. తను చేసిన నేరాలను విచారణలో అంగీకరించటంతో అదే నివేదికను కోర్టుకు అందించినట్లు తెలిసింది. -
ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్
సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ‘స్టాండప్ రాహుల్’ ఫ్లాప్ తర్వాత సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్న నటుడు ఓ వీడియోలో అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ చాలా ఆగ్రహంతో కనిపించారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న హీరో సడన్ షాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముంది? అతను ఎందుకు అంతగా సీరియస్‌గా ఉన్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. రాజ్ తరుణ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికి హానికరం. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. (చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్) ఆ వీడియోలోరాజ్ తరుణ్ మాట్లాడుతూ..' హాలో అండి. నేను సడన్‌గా ఈ వీడియో పెట్టడానికి ఓ కారణం ఉంది. మీకోక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలా. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలతో తిరుగుతుంటే.. నేను కొత్తిమీర, కరివేపాకు అంటూ తిరిగేవాణ్ని. మా ఫ్రెండ్స్‌ను చూస్తే అసూయ. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. దీంతో నా జీవితానికి ప్రేమ సెట్ కాదని అర్థమైపోయింది. సిన్సియర్‌గా నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. మొదట వాళ్లు కంగారు పడ్డారు. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. ఇంకేముంది పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి సెట్, మండపం సెట్, బంధువులంతా వచ్చారు. గంగిరెద్దులా మండపంలో కూర్చోబెట్టారు. పంతులు అమ్మాయిని తీసుకురండి అనే సరికి షాక్. ఇంకేముంది తీరా చూస్తే అమ్మాయి జంప్. వాళ్ల చెల్లి ఓ లెటర్ తీసుకొచ్చింది. ఇక అప్పుడు మొదలైంది చుట్టాల సానుభూతి. ఒసేయ్.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్లైన్లో పెడతా. ఆమె కనపడితే దయచేసి ఎవరైనా నాకు చెప్పండి' అంటూ వీడియోలో మాట్లాడారు. అయితే ఇదంతా చూస్తుంటే కేవలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు కనిపిస్తోంది. తన రాబోయే చిత్రాన్ని ప్రకటించడం కోసమే ఆయన ఈ వీడియో షేర్ చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజ్ తరుణ్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Raj Tarun (@rajtarunn) -
నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్ : కుర్ర హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరో చైతన్య అక్కినేని దీన్ని లాంచ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగుతో విడుదలైన ఈ ట్రైలర్ ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో జోరుమీదున్న రాజ్‌తరుణ్ ఖాతాలో మరో విజయం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఇంకా నరేష్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్లతోపాటు, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ ఘోష్, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ లాంటి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న విడుదల కానుంది.విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో, కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్ అందించారు. -
చోరీ చేశారా? లేదా?
గళ్ల లుంగీ... మెడలో టవల్... చేతిలో ఇనుప గరిటె... కాళ్లకి సాదాసీదా చెప్పులు... రాజేంద్రప్రసాద్ అసలు సిసలైన వంటోడిలా ఉన్నారు. ఉండడం కాదు... నిజమే! ఈ ఫొటో తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సెట్లో జనాలకి వంట చేస్తున్నారు. ‘‘రాజేంద్రప్రసాద్ గారు సెట్లో ఉంటే నవ్వులకు మాత్రమే కాదు, ఫుడ్‌కీ లోటుండదు. ఆయన వండుతుంటే... చోరీ ఎలా చేయాలా? అని రాజ్‌తరుణ్ ఎదురు చూస్తున్నాడు’’ అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారిగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘రాజుగాడు’ సెట్లో చోటు చేసుకుందీ సీన్! ‘ఈడో రకం ఆడో రకం, అంధగాడు’ సిన్మాల తర్వాత వీళ్ల ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఎన్ని ప్లానులు వేసినా... చివరికి, చోరీ చేయలేకపోయారు. ఎందుకంటే... చోరీ చేయాలని ప్రయత్నించేలోపే వడ్డించేశారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం వెరీ హ్యాపీ. ఆయన వండిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంది’’ అన్నారు రాజ్ తరుణ్. -
దశమికి ‘దిల్’ రాజు చిత్రానికి!
.. కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమవుతున్నారీ హీరో, దర్శకుడు! రాజ్‌తరుణ్ హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారనే వార్త ఎప్పట్నుంచో ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ సిన్మా సెట్స్‌పైకి వెళ్లే టైమ్ వచ్చేసింది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, వెంటనే చిత్రీకరణకు వెళ్లాలనుకుంటున్నారు. మలయాళీ అమ్మాయి, తెలుగు అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. సంజన దర్శకత్వంలో ‘రాజుగాడు’తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న మరో సినిమాలోనూ రాజ్‌తరుణ్ నటిస్తున్నారిప్పుడు. ఈ మూడు చిత్రాల తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం’ సిన్మాల ఫేమ్ విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే సినిమాను అంగీకరించారట! -
కొత్త కోణంలో... కుమారి కాంబినేషన్
రాజ్‌తరుణ్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ అందిస్తున్న కథతో మరో చిత్రం తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ హిటై్టన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ పతాకాలపై తాజా చిత్రాన్ని విజయప్రసాద్ బండ్రెడ్డి, సునీత– రాజ్‌కుమార్ బృందావనం నిర్మించనున్నారు. ‘‘విభిన్న చిత్రాలను అందించాలనే ఉద్దేశంతోనే సుకుమార్ రైటింగ్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ కొత్త కోణంలో ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు!
రాజ్ తరుణ్ తాజా చిత్రం 'అంధగాడు' ఇటు విమర్శకుల ప్రశంసలే కాదు.. అటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. 'కుమారి' హెబ్బా పటేల్‌తో మరోసారి జతకట్టి.. ట్విస్టుల మీద ట్విస్టులతో అలరించిన 'అంధగాడు' తొలిరోజు ఏకంగా రూ. 3.75 కోట్లు వసూలు చేశాడు. వినూత్నమైన కథ-కథనాలతో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంధగాడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఏకంగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం రాజ్ తరుణ్ సినిమా చాలా బాగుందని కితాబిచ్చాడు. గతంలో కామెడీ సినిమాలు, ఫన్నీ రోల్స్ చేసిన రాజ్ తరుణ్ 'అంధగాడు'లో తనలోని విలక్షణ నటనను చూపించాడని, కామెడీ ఎంటర్టైనర్గా ప్రారంభమై.. ఇంట్రస్టింగ్ సినిమాగా ఈ చిత్రం ముగిసిందని, ఇలాంటి జోనర్ చేంజింగ్ సినిమాలో హాలీవుడ్లో బాగా కనిపిస్తాయి కానీ తెలుగులో అంతగా రాలేదని, ఈ సినిమా తనకు బాగా నచ్చిందని వర్మ ప్రశంసించాడు. మొత్తానికి పాజిటివ్ టాక్, ప్రశంసలతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, హెబ్బా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. -
హెబ్బాతో 30 సినిమాలు చేయాలనుంది!
– రాజ్‌తరుణ్ ‘‘టైటిల్ విని ‘అందగాడు’ ఏంటి? అనుకున్నా. తర్వాత ‘అంధగాడు’ అని తెలిసింది. కళ్లు లేని వ్యక్తిగా రాజ్ తరుణ్ బాగా చేయగలడనిపించింది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు హీరో నిఖిల్. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘అంధగాడు’ టీజర్‌ను నిఖిల్ రిలీజ్ చేశారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఆర్ట్ ఫిల్మ్ కాదిది. వెలిగొండగారు ప్రతి పావు గంటకు కథను ఒక్కో జోనర్లోకి తీసుకువెళ్లారు. నేను, హెబ్బా జంటగా నటించిన మూడో చిత్రమిది. తనతో మరో 30 సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. ‘‘చాలా ట్విస్టులున్న కథ. నిర్మాతలకు వినిపించిన తర్వాత మీరే దర్శకత్వం వహించండన్నారు’’ అన్నారు వెలిగొండ శ్రీనివాస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు. -
పుట్టింది వైజాగ్‌లో.. గడిపింది రాజమండ్రిలోనే..
కథానాయకుడు రాజ్‌తరుణ్ కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని కుమారి థియేటర్లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా యూనిట్ శనివారం సందడి చేసింది. చిత్రం విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన హీరో రాజ్ తరుణ్ థియేటర్లో ప్రేక్షకులతో మాట్లాడుతూ తాను పుట్టింది వైజాగ్‌లో అయినా గడిపిందంతా రాజమండ్రిలోనే అన్నారు. ఈ ప్రాంతంతో తనకు ఎనలేని బంధముందన్నారు. స్నేహితులతో ఎక్కువగా ఇక్కడే గడిపేవాడినని, నా సినిమాని హిట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేని రామచంద్రపురం తన పుట్టిన ఊరు అన్నారు. ఈ సినిమా ఊహించిన దానికంటే మంచి విజయం సాధించిందన్నారు. అనంతరం రాజ్‌తరుణ్ పేక్షకులతో కలిసి థియేటర్లో కూర్చుని చిత్రాన్ని తిలకించారు. కార్యక్రమంలో వింటేజ్ క్రియేష¯Œ్స జేకే.రామకృష్ణ పాల్గొన్నారు. -
నవ క్రాంతి
‘స్టార్’ వేరు.. ‘ఆర్టిస్ట్’ వేరు... స్టార్‌కి అభిమానులుంటారు. అందరి స్టార్ల అభిమానులూ ‘ఆర్టిస్ట్’కి ఫ్యాన్స్ అవుతారు. అదీ ఆర్టిస్ట్ సత్తా. మరి.. స్టార్స్ మంచి ఆర్టిస్టులు కాదా అనుకుంటున్నారా? ఆర్టిస్టులే. కానీ, వాళ్ల ఇమేజ్ ఏ సినిమా పడితే అది చేయనివ్వదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ‘మా దారి స్పెషల్æదారి’ అంటూ టాలీవుడ్లో కొంతమంది హీరోలు దూసుకెళుతున్నారు. ఈ ఆర్టిస్టులు ‘డిఫరెంట్ స్టార్స్’. నాని, శర్వానంద్, నిఖిల్ వంటి హీరోలు ఈ లిస్టులోకే వస్తారు. ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలకు ఈ ముగ్గురూ రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు. నాన్‌స్టాప్ నాని ‘ప్రణతి (ఎన్టీఆర్ వైఫ్)కి ఇష్టమైన సినిమాల్లో ‘పిల్ల జమిందార్’ ఒకటి. తను బలవంతం చేయడంతో ఆ సినిమా చూశా. టీవీలో చాలాసార్లు చూశా. చివరికి ఆ సినిమాతో ప్రేమలో పడ్డా. తెలుగులో ఉన్న అత్యుత్తమ నటుల్లో నాని ఒకరు’ – అని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియోలో ఎన్టీఆర్ అన్నాడు. ‘ఫర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవారంటే నాకు ఇష్టం. నాని గొప్ప నటుడు మాత్రమే కాదు, ఫర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. ‘అష్టా చమ్మా’ నుంచి ‘ఎవడే సుబ్రమణ్యం’ వరకూ ఆల్మోస్ట్ అతని సినిమాలన్నీ చూశా’ – అన్నాడు ‘భలే భలే మగాడి వోయ్’ ఆడియోలో అల్లు అర్జున్. వీళ్లిద్దరితో పాటు సినీ ప్రముఖులు, ప్రేక్షకులూ నానిలో ఇష్టపడేది, గౌరవించేది అతని నటననే. ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు వ్యక్తిగా, ‘ఎవడే సుబ్రమణ్యం’లో స్వార్థపరుడి స్థాయి నుంచి మానవత్వం, జీవితం అంటే ఏంటో తెలుసుకుని ఎదిగే వ్యక్తిగా, ‘జెంటిల్మన్’లో హీరోనా? విలనా? అనిపించే పాత్రలో, ‘మజ్ను’లో ప్రేమికుడిగా... భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు నాని. అందుకే ఎన్ని హిట్ సినిమాలొచ్చినా నటుడిగా నానిపై ఎలాంటి ఇమేజ్, స్టాంప్ పడలేదు. ఎప్పుడైనా సినిమాలు ఫెయిల్ అయ్యుండొచ్చు. నటుడిగా నాని ఫెయిల్ కాలేదు. 2017లో ‘నేను లోకల్’ సినిమాతో ముందుకొస్తున్నాడు నాని. సక్సెస్ఫుల్ శర్వానంద్ తొలినాళ్లలో నటుడిగా పేరు తెచ్చిన చిత్రాలు శర్వానంద్ ‘ప్రస్థానం’ లో చాలానే ఉన్నాయి. కానీ, అవేవీ ఆశించిన విజయాలు ఇవ్వలేదు. వినూత్న చిత్రాలు చేస్తాడనే పేరు మాత్రం తెచ్చాయి. హీరోగా తాను కోరుకునే ‘గమ్యం’ చేరుకోవాలన్నా నిర్మాతకు లాభాలు పంచాలన్నా ‘మంచి నటుడు’ అనే పేరు ఒక్కటే చాలదని గ్రహించినట్టున్నాడు. కాస్త కమర్షియల్ హంగులతో ఉన్న కొత్త కథలకు ఓటేశాడు. ఇంకేముంది? హీరోగా శర్వానంద్ సిసలైన పరుగు మొదలైంది. ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’.. ఇలా వరుసగా మూడు హిట్స్. హీరోగా ఎలాంటి పాత్రలోనైనా శర్వా నటించగలడని ఈ చిత్రాలు నిరూపించాయి. ప్రేయసి కోసం తపించే ప్రేమికుడిగా పరిణితితో కూడిన నటన, పక్కింటి కుర్రాడిగా, ఏమీ తెలియని అమాయకుడిగా.. ఇలా ఏదైనా చేయగలడు. ఏ పాత్ర చేసినా... అందులో భావోద్వేగాలు తప్ప, నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ చూపించాలని శర్వా ఎక్కడా ప్రయత్నించడు. అతని ప్రత్యేకత అదే! అతని సినిమాల్లో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. ప్రేక్షకుల్లో శర్వాకి ఉన్న ఈ పేరు స్టార్ స్టేటస్ తెచ్చింది. 2017లో ‘శతమానంనం భవతి’, బీవీయస్స్యన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వా. మారుతి డైరెక్షన్లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకొన్ని సినిమాలున్నాయి. నిఖిల్ క్లారిటీ కుర్రాడు బాగున్నాడు.. స్టైల్‌గా ఉన్నాడు... నటనలో హుషారుంది... డ్యాన్సులు బాగానే చేశాడు... ‘హ్యాపీ డేస్’లో నలుగురు హీరోల్లో ఓ హీరోగా నటించిన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా సోసోగా ఆడినా ‘యువత’తో హిట్ వచ్చింది. నిఖిల్ ఎనర్జీ, యాక్టింగ్ చూసి కొందరు రవితేజతో పోల్చారు. ఇంకేముంది? కెరీర్లో ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైమ్‌లో వరుస ఫ్లాపులు పలకరించాయి. అవన్నీ సగటు కమర్షియల్ సినిమాలే. ‘హిట్ కోసం ఎలాంటి సినిమా చేయాలి?’ అని నిఖిల్ డైలమాలో పడ్డాడు. ఆలోచించాడు. ‘నలుగురూ నడిచే కమర్షియల్ దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణిస్తే!’ అనే ఐడియా వచ్చింది. అప్పుడు స్నేహితుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో ‘స్వామి రారా’, ఆ తర్వాత మరో స్నేహితుడు చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ చిత్రాలు చేశాడు. రెండూ హిట్టే. హిట్‌తో పాటు నవతరం ప్రేక్షకుల్లో నిఖిల్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ రెండు హిట్లతో కాన్సెప్ట్ బేస్డ్ కొత్త తరహా సినిమాలే చేయాలని ఫిక్సయ్యాడు. ‘సూర్య వర్సెస్ సూర్య’ అలాంటి సినిమానే. ఇదీ హిట్టే. ఆ తర్వాత మొహమాటం కోసం చేసిన ‘శంకరాభరణం’తో ‘ఎలాంటి సినిమాలు చేయకూడదు?’ అనే విషయంలో నిఖిల్‌కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మళ్లీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో హిట్ దారిలోకి వచ్చేశాడు. నిఖిల్‌పై, అతడి స్టోరీ సెలక్షన్‌పై ప్రేక్షకుల్లో ఎంత నమ్మకముందో చెప్పడా నికి ఈ చిత్రం విడుదలైన పరిస్థితులు, వచ్చిన వసూళ్లే ఉదాహరణ. 2017లో ‘కేశవ’ సినిమాతో రానున్నాడు. రఫ్ అండ్ టఫ్ రాజ్‌తరుణ్ చెదిరిన క్రాఫు, చూపుల్లో నిర్లక్ష్యం, గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం... ఇలాంటి లక్షణాలున్న కుర్రవాళ్లను ‘రాజ్ తరుణ్’ అనాలేమో. యస్.... వచ్చీ రావడంతోనే ఈ వైజాగ్ కుర్రాడు ‘ఎట్రాక్టింగ్’ చేసేశాడు. యాక్చువల్లీ రాజ్ తరుణ్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు.. యాక్ట్ చేశాడు. ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఛాన్స్ రావడంతో రాజ్ తరుణ్ నటన, గోదావరి యాసతో మాట్లాడే తీరు అతన్ని పాపులర్ చేసేశాయ్. ఈ యువహీరో ప్లస్ పాయింట్స్ ఇవే. అంతే. మెగాఫోన్ పట్టాల్సిన చేతులు ముఖానికి రంగు వేసుకుంటున్నాయ్. డైరెక్షన్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు. హీరోగా ఛాన్స్ వచ్చినప్పుడు అది చేయడమే వివేకం. ఇక్కడే రాజ్‌తరుణ్ తెలివిగా వ్యవహరించాడు. హీరోగా సినిమా మీద సినిమా ఒప్పుకుంటూ బిజీ అయిపోయాడు. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడో రకం ఆడో రకం’.. ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన రాజ్ తరుణ్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. బంగారుకొండ విజయ్ దేవరకొండ చిన్నగా మొదలై పెద్ద రేంజ్‌కి ఎదగడంలో ఓ మజా ఉంటుంది. యువ హీరో విజయ్ దేవరకొండలాంటి వాళ్లకు ఆ మజా తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో తెలుసు. రవిబాబు దర్శకత్వం వహించిన ‘నువ్విలా’, శేఖర్ కమ్ముల చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’లో చిన్న రోల్స్ చేసిన విజయ్ దేవరకొండకు ‘ఎవడే సుబ్రమణ్యం’ మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రంలో నాని స్నేహితుడిగా సినిమాకి కీలకంగా నిలిచే క్యారెక్టర్ చేశాడు. ఎలాంటి పాత్ర చేస్తే యూత్‌కీ, ఫ్యామిలీస్‌కి దగ్గర కాగలుగుతారో ఈ చిత్రంలో అతను చేసిన అల్లరి కుర్రాడు రిషి పాత్ర అలానే ఉంటుంది. చూడచక్కగా ఉండటంతో పాటు బాగా యాక్ట్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఈసారి విజయ్‌కి హీరోగా ఛాన్సొచ్చింది. ఏ ముహూర్తాన ‘పెళ్లి చూపులు’కి ఒప్పుకున్నాడో కానీ ఆ చిత్రం అతనికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. మెల్లిగా రేసులోకి వచ్చేశాడు. ప్రస్తుతం ‘ద్వారకా’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజన్ ఉన్న శ్రీవిష్ణు ‘రాయల్ రాజు’ గుర్తున్నాడా? అదేనండి ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో శ్రీవిష్ణు చేశాడే ఆ క్యారెక్టర్. అంతుకు ముందు ‘బాణం’, ‘సోలో’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీవిష్ణుకి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత చేసిన ‘సెకండ్ హ్యాండ్’, ‘ప్రతినిధి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు కూడా ఈ యువకుడిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. 2016 ఎండింగ్లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ శ్రీవిష్ణుకి 2017ను ఆశావహంగా మార్చింది. ఈ చిత్రం అతనిలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని ప్రూవ్ చేసింది. ఇప్పుడు దూసుకెళుతున్న నవతరం హీరోల్లో శ్రీవిష్ణు ఒకడున్నాడు. ప్రస్తుతం కుమార్ వట్టి దర్శకత్వంలో ప్రకాశ్‌రావు బలగ నిర్మిస్తున్న ‘మా అబ్బాయి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరిన్ని మంచి ఛాన్సులొస్తున్నాయి. గడచిన పదేళ్లల్లో హీరోలుగా వచ్చిన వాళ్లల్లో నాని, శర్వాంద్, నిఖిల్... ఈ ముగ్గురిదీ ప్రత్యేకమైన స్థానం. వీళ్ల స్పేస్‌లోకి ఎవరూ రాలేరు. కథల సెలక్షన్లో వీళ్లకు బోల్డంత గట్స్. ఓ చిన్న ఎగ్జాంపుల్... గత సంక్రాంతికి పెద్ద హీరోల మధ్య శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజైంది. సూపర్ హిట్. ఈ సంక్రాంతికి ‘శతమానం భవతి’ రిలీజ్. తను ఉన్న స్పేస్ మీద శర్వాకి ఎంత నమ్మకమో దీన్నిబట్టి ఊహించవచ్చు. – ‘సాక్షి’ సినిమా డెస్క్ -
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
-
ఒకటోసారి రెండోసారి మూడోసారి !
ఏదైనా వేలం పాట నిర్వహిస్తున్నప్పుడు ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటుంటారు. కానీ, ఇక్కడ వేలం పాట కాదు. యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరు తాజాగా ‘అంధగాడు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్ర మిది. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగేలా కథ ఉంటుంది. కథ వినగానే రాజ్ తరుణ్ ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర. -
బిజీ బిజీగా కుర్రహీరో
ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. చేసినవి రెండు సినిమాలే అయినా మినిమమ్ గ్యారెంటీ హీరోగా ముద్ర వేసుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తొలి సినిమా 'ఉయ్యాల జంపాల'తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత 'సినిమా చూపిస్త మామ'తో హీరోగా సెటిల్ అయిపోయాడు. 'కుమారి 21ఎఫ్' రిలీజ్ తరువాత నెల గ్యాప్‌లో 'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' అనే తెలుగింటి ప్రేమకథతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ సీక్వల్లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కుతున్న మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్. -
'కుమారి 21 ఎఫ్' మూవీ రివ్యూ
టైటిల్ : కుమారి 21 ఎఫ్ జానర్ : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, హేబాపటేల్, నోయల్, హేమ దర్శకత్వం : సూర్య ప్రతాప్ పల్నాటి కథ, స్క్రీన్ ప్లే : సుకుమార్ నిర్మాత : సుకుమార్ రైటింగ్స్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫితో చిన్న సినిమానే అయినా, భారీ తనాన్ని సొంతం చేసుకుంది. ప్రచార ఆర్భాటాలు లేకపోయినా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన కుమారి 21 ఎఫ్ సినీ అభిమానులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.. కథ : సిద్దూ (రాజ్ తరుణ్ ) ఓ సాదాసీదా కుర్రాడు. హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తల్లి పాటు కలిసి ఉంటున్న సిద్దూ తండ్రి తనను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడని ద్వేషం పెంచుకుంటాడు. తన కాలనీలో ఉండే ముగ్గురు కుర్రాళ్లతో స్నేహం చేస్తూ వాళ్లు చేసే పనులకు సాయం చేస్తుంటాడు. అదే సమయంలో వాళ్ల కాలనీకి వచ్చిన మోడల్ కుమారి(హేబాపటేల్)తో సిద్దూకు పరిచయం ఏర్పడుతుంది. ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే కుమారి, సిద్దూతో తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పేస్తోంది. అప్పటికే ఆ అమ్మాయిని రెండు సార్లు చూసిన సిద్దూ తన మీద ఉన్న అభిప్రాయం వల్ల ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోడు. నెమ్మదిగా వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఈ సమయంలో కూడా కుమారి ప్రవర్తన, తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల మూలంగా తనను ప్రేమించాలా..? వద్దా..? అన్న సందిగ్ధంలో పడతాడు. అదే సమయంలో స్నేహితుల మాటలు విని కుమారికి దూరమవ్వాలనే ప్రయత్నంలో, మరో అమ్మాయితో స్నేహం చేస్తాడు. కానీ చాలా రోజులుగా తమకు దూరంగా ఉంటున్న తండ్రి గురించి ఓ నిజం తెలుసుకొని కుమారికి తన ప్రేమను చెప్పేయాలనుకుంటాడు. అనుకున్నట్టుగా సిద్దూ తన ప్రేమను కుమారికి చెప్పాడా..? తన ఫ్రెండ్స్ వల్ల సిద్దూ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కాలనీకి రాకముందు కుమారి గతం ఏంటి..? చివరకు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి సిద్దూ, కుమారి ఒక్కటయ్యారా..? అన్నదే సినిమా కథ. నటీనటులు : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో కాస్త బరువైన పాత్రనే ఎంచుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే మోస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చిన సెంటిమెంట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వం, నిజాయితీ, మంచితనాన్ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్గా నటించిన హేబా పటేల్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. క్యూట్ లుక్స్‌తో పాటు బోల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది హేబా. నటన పరంగా పెద్దగా మెప్పించకపోయినా, గ్లామర్ షోతో మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. తొలిసారిగా నెగెటివ్ రోల్లో కనిపించిన నోయల్ మంచి నటన కనబరిచాడు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాకు దర్శకుడిగా సూర్య ప్రతాప్ పేరు పడినా సినిమా అంతా సుకుమార్ స్టైల్ లోనే సాగుతుంది. సుకుమార్ మార్క్ టిపికల్ క్యారెక్టర్స్, ఐటమ్ సాంగ్స్, స్క్రీన్ ప్లే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మొదటి నుంచి సినిమా మీద అంచనాలను పెంచిన దేవిశ్రీ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. అయితే పాటల కన్నా నేపథ్య సంగీతం మరింతగా ఆకట్టుకుంది. సుకుమార్ కథా స్క్రీన్‌ప్లే తన స్టైల్లో రెగ్యులర్ గా సాగిపోయినా, కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విశ్లేషణ : పేరుకు సుకుమార్ నిర్మాతే అయినా, అంతా తానే అయి కుమారి 21 ఎఫ్ సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించటంతో ఇదే వేరే దర్శకుడు తీశాడన్న ఆలోచన కూడా రాదు. మరోసారి ఎలాంటి కథాబలం లేకుండా కేవలం క్యారెక్టర్స్ తోనే కథ నడిపించే ప్రయత్నం చేశాడు సుకుమార్. చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలిచే ప్రయత్నంలో చాలా సీన్లు బోర్‌గా అనిపించాయి. ముఖ్యంగా ఫస్ట్‌లో చాలా సన్నివేశాలు ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవు. గతంలో ఐటమ్ సాంగ్‌లో మాత్రమే గ్లామర్ పాళ్లు పెంచే సుకుమార్, ఈ సారి సినిమా అంతా అందాల ప్రదర్శననే నమ్ముకున్నట్టుగా అనిపించింది. ప్లస్ పాయింట్స్ : సుకుమార్ స్క్రిప్ట్ రాజ్ తరుణ్ యాక్టింగ్ హేబా పటేల్ గ్లామర్ మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ స్లో నారేషన్ ఓవరాల్ గా 'కుమారి 21ఎఫ్' ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకునే మసాలా ఎంటర్ టైనర్ -
లవ్‌కి బయోడేటాతో పనేంటి?
ఎవరినైనా ప్రేమించాలంటే ఎదుటి వాళ్ల మనసు మంచిదా? కాదా? వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లాంటివి వెరిఫై చేస్తారు. ఓ కుర్రాడు తన గాళ్‌ఫ్రెండ్ కుమారిని కూడా ఇలాగే అడిగితే...‘‘లవ్ చేయడానికి నా ఫిజిక్ చాలదా? నా బయోడేటా మొత్తం కావాలా?’’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. మరి ఈ కుమారిని లవ్ చేయాలా? వద్దా? అని డైలామాలో పడతాడు ఈ ప్రేమికుడు. చివరకు ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ లవ్‌స్టోరీకి సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. రాజ్‌తరుణ్ అభినయం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్. -
రాజ్ తరుణ్ రిస్క్ చేస్తున్నాడా..?
'ఉయ్యాలా జంపాల', 'సినిమా చూపిస్తా మామ' లాంటి వరుస సూపర్ హిట్స్‌తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా నటుడు అయిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తన జనరేషన్లో కాంపిటేషన్ ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నాడేమో, రిస్కీ ప్రాజెక్ట్స్‌ను అంగీకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' సినిమాను పూర్తి చేసిన రాజ్‌తరుణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు పూర్తి కాగానే రామ్ గోపాల్‌వర్మ దర్శకత్వంలో మూకీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో వర్మ దర్శకత్వంలో నటించటమే రిస్క్ ...అలాంటిది మూకీ సినిమా చేయటం అంటే సాహసమే. 'రేయ్' సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన వైవియస్ చౌదరి దర్శకత్వంలోనూ రాజ్‌తరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు. చాలా కాలంగా కెరీర్లో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న చౌదరి 'రేయ్' సినిమా తరువాత ఇండస్ట్రీలో ఎవరికి కనిపించటం లేదు. ఈ గ్యాప్ లో ఓ యూత్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి రాజ్ తరుణ్‌తో ఓకె చేసుకున్నాడు. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్న చౌదరికి రాజ్‌తరుణ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి. -
నా మాడ్యులేషన్ అందరికీ తెగ నచ్చేసింది
తోటపల్లి మధు ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నీ ఎంకమ్మా...’ అనే డైలాగ్ గుర్తుంది కదూ. అసలు మరచిపోతేనే కదా. ‘కలికాలం’లో గుండెను కరిగించే డైలాగులు, ‘అల్లరి అల్లుడు’లో కవ్వించే డైలాగులు, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో కరుణారసభరిత డైలాగులు... ఇలా ఏదైనా రాయగల దమ్మున్న డైలాగ్ రైటర్ తోటపల్లి మధు. ఒక మూమెంట్లో అయితే... ఆయన డైలాగులు రాస్తున్నాడంటే ఆ సినిమా సగం హిట్ కిందే లెక్కగా భావించేవారు. రచయితగా ఒక వైభవం చూసిన తోటపల్లి మధు సడన్‌గా సైలైంటైపోయి, లేటెస్ట్గా ‘సినిమా చూపిస్త మావా’తో నటుడిగా పెద్ద హిట్టు కొట్టారు. అప్పట్లో కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన, ‘సినిమా చూపిస్త మావ’లో హీరో రాజ్‌తరుణ్ తండ్రి పాత్రలో గమ్మత్తై నటన కనబరిచారు. ‘‘రచయితగా ఎన్నెన్నో ప్రశంసలందుకున్నాను. కానీ నటుడిగా ఈ ఒక్క పాత్ర ఇస్తున్న కిక్ ఎప్పటికీ మరిచిపోలేను. దాసరి-చిరంజీవి లాంటి మహామహులు సైతం నా నటనను అభినందించారు. ముఖ్యంగా నా మాడ్యులేషన్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. నాకు చాలా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు సరైన టైమ్‌లో సరైన హిట్ వచ్చింది’’ అని తెగ సంబరపడిపోయారు తోటపల్లి మధు. సినిమాలు, పుస్తకాలే ప్రపంచంగా బతికే మధు, బయట సినిమా ఫంక్షన్స్‌లో పెద్దగా కనబడరు. ఆయనది థర్టీ ఇయర్స్ లాంగ్ కెరీర్. 19 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, 189 చిత్రాలకు రచన చేశారు. ‘‘ ‘మహారథి’ సినిమా తర్వాత మళ్లీ రచన వైపు దృష్టి పెట్టలేదు. ఇకపై నటుడిగా పూర్తి స్థాయిలో కొనసాగుదామని నిర్ణయించుకున్నా. కామెడీ, సెంటిమెంట్, విలనీ ఏదైనా చేయగలననే నమ్మకం ఉంది. రచయితగా నన్ను నెత్తిన పెట్టుకున్న ఈ పరిశ్రమే నటుడిగా కూడా నన్ను కొత్త అంతస్తుకు చేరుస్తుందని నమ్ముతున్నా’’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు తోటపల్లి మధు. -
మామా అల్లుళ్ల కథ
సరదా సరదాగా జీవితాన్ని గడిపేసే ఓ యువకుని గుండెల్లో అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమ గంట మోగించేసింది. ఏదో మాయ చేసి ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు ఆ కుర్రాడు. అంతా సరిగ్గా ఉందనుకున్న సమయంలో వాళ్ల ప్రేమకథకు బ్రేకులు వేశాడు ఆ అమ్మాయి తండ్రి. తనకు కాబోయే మామను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఆ కుర్రాడు. ఈ మామా-అల్లుళ్ల సందడిని తెలుసుకోవాలంటే ‘సినిమా చూపిస్త మామ’ చూడాల్సిందే. రాజ్‌తరుణ్, అవికా గోర్ జంటగా రావు రమేశ్ ప్రధాన పాత్రలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రూపేష్, బోగాది అంజిరెడ్డి, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రానికి, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్న జె.కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్ దాశరథి శివేంద్ర. -
బిగ్‌స్క్రీన్‌కు short cut
అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా ప్రేక్షకుల్ని మెప్పించిన ఉయ్యాల జంపాల హీరో రాజ్‌తరుణ్‌ను వెండితెరకు ఎక్కించింది షార్ట్ సినిమానే. ప్రస్తుతం మధురం అనే తెలుగు సినిమా ద్వారా పరిచయం కానున్నషార్ట్ మూవీస్ స్టార్ చాందినీచౌదరి యూట్యూబ్ ప్రేక్షకులకు చిరపరిచితురాలే. యూట్యూబ్‌లో 4 లక్షలకు పైగా హిట్స్ సాధించిన ‘దేవుడు చేసిన యెదవలు’షార్ట్ ఫిల్మ్‌లో నటించిన అశోక్ వర్ధన్ ‘కిరాకు’తో కమెడియన్‌గా మారాడు. ఆ సినిమాలో హీరోగా నటించిన అనిరుధ్ కూడా షార్ట్‌ఫిల్మ్ స్టారే... సూపర్‌హిట్ అయిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో గెలిచిన ‘ఖర్మరా దేవుడా’ హిట్‌తో సినిమాలకు ఎగబాకాడు. ఇంటర్వ్యూ, లవ్ఫార్ములా, తూర్పు పడమర వంటి లఘు చిత్రాలు రూపొందించిన పవన్ సాదినేని ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో టాలీవుడ్ దర్శకుడిగా మారాడు. బస్‌స్టాప్‌లో నటిం చిన డీఎంకే కూడా షార్ట్ ఫిల్మ్ నటుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్ద చాంతాడే అవుతుంది. ఈ నేపధ్యంలో యువత షార్ట్ ఫిల్మ్స్నే రాచబాటగా మార్చుకోవడం విచిత్రమేమీ కాదు. సినిమా చాన్సులు రావాలంటే మాటలు కాదు. కాళ్లూ, ఒళ్లూ హూనమయ్యేలా తిరిగినా మన ముఖం చూసే నాధుడుండడు. మరి దీనికి పరిష్కారం...‘‘ఛత్ ఇవన్నీ ఎందుకురా భయ్... తిన్నగా ఓ షార్ట్ ఫిల్మ్ తీసేసెయ్’’ అనేది నేటి యువ మంత్రం. ఆ మంత్రాన్నే నమ్ముకున్న యువ ప్రతిభావంతులు తామేంటో పొట్టి చిత్రాలతో చూపిస్తూ...టాలీవుడ్‌నే తమ దగ్గరకు రప్పించుకుంటున్నారు. నిదానంగానే మొదలైనా... ఈ ట్రెండ్ స్వల్పకాలంలోనే ఊపందుకుంది. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్‌ల వెల్లువ చూస్తుంటే సినీ పరిశ్రమ చిట్టి సినిమాను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేనట్టే కనపడుతోంది. ఔత్సాహికుల వర్క్‌షాప్‌లు లఘు చిత్రాల రూపకల్పనకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని కొనసాగిస్తూ ‘తెలుగువన్.కామ్’ వర్కషాప్‌లు నిర్వహిస్తోంది. ప్రతి నెలా రెండు వర్క్‌షాప్‌లు జరుగుతాయి. నెలకు ఒకటి చొప్పున ఇప్పటికి ఐదింటిని ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసి, రూ.10 వేలు చొప్పున నగదు బహుమతిని అందించింది. అంతే కాదు... ఈ కాంటెస్ట్‌లో ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి రూ.లక్ష బహుమతి ఇస్తోంది. ‘పొట్టి చిత్రాలకు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే కాకుండా... ప్రీ ప్రొడక్షన్‌కు సైతం ఔత్సాహికులకు వేదిక కల్పిస్తున్నాం. వివరాలకు మా వెబ్సైట్లోగానీ, యూట్యూబ్ ద్వారా గానీ సంప్రదించవచ్చు’ అని తెలుగువన్.కామ్ ఎండీ ఎస్.రవిశేఖర్ చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్: 040 23757192. -
స్ప్రింగ్‌స్ప్రీ ఫ్యాషన్ షో అదుర్స్
-
‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్
శోభిత క్యాట్‌వాక్... నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) స్ప్రింగ్స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఫ్యాషన్‌షో అదిరింది. మిస్ ఇండి యా ఎర్త శోభిత దూళిపాళ క్యాట్‌వాక్ చేసి ఫ్యాషన్‌షోకు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలి చారు. పలువురు నిట్ విద్యార్థులు విభిన్న డిజైన్ దుస్తులు ధరించి ఉర్రూతలిగించారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ సందడి.. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ నిట్ ఆడిటోరియంలో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌కు జడ్జిగా వ్యవహరించారు. ప్రేమ, సామాజిక అంశాలపై విద్యార్థులు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను తిలకించారు. నిట్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌లను చూసి అభినందించారు. అంతేగాక స్ప్రింగ్ స్ప్రీలో భాగం గా నిట్మన్ పేరుతో మాక్ ఐక్యరాజ్యసమితి, మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఆశయం పేరుతో వీధిబాలలకు చదువు చెప్పారు. విద్యార్థుల శాస్త్రీయ నృత్యాలు, జానపదనృత్యాలు అలరించారుు. మ్యూజిక్లవ్ పేరిట సంగీత కచేరి నిర్వహించారు. రంగోళి పేరిట వేసిన ముగ్గులు ఎంతగానో ఆకర్షించారుు. పెయిం టింగ్ కాంపిటీషన్లో భాగంగా విద్యార్థుల ముఖాలపై వేసిన చిత్రాలను నిట్ ఆడిటోరియంలో ప్రద ర్శించారు. అప్పటికప్పుడు ఆర్ట్ పెయింటింగ్ లో భాగంగా స్కెచ్‌లతో చిత్రాలు వేసి డ్రాయిం గ్లో, పెయింటింగ్‌లో ప్రతిభ చూపారు. వివిధ రకాల కార్టూన్లు వేశారు. యాహో పేరిట క్విజ్ నిర్వహించారు. ఫొటోగ్రఫీలో భాగంగా ఫొటోషాపు నిర్వహించారు. -
ఉయ్యాలా.. జంపాలా.. ఓ అందమైన చిత్రం
నగరంలో ఉయ్యాలా... జంపాలా.. చిత్ర యూనిట్ సందడి చేసింది. యువ నటీనటులను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. కీర్తన థియేటర్లో శుక్రవారం ఈవీవీ యువ కళావాహిని, సురేష్ ఫిలింస్ సంయుక్తంగా చిత్ర యూనిట్ సన్మాసన సభ నిర్వహించారు. చిత్ర దర్శకుడు విరించి వర్మ, హీరో హీరోయిన్లు రాజ్‌తరుణ్, అవికగోర్ థియేటర్లోకి రాగానే ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను చూసి చేతులు ఊపుతూ పలుకరించారు. సభలో సినిమా బాగుందా.. ఎన్నిసార్లు చూసారు.. అన్ని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పించారు. కొన్ని హుషారైన డైలాగులు చెప్పి, పాటలు పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. గుంటూరు నుంచే తమ విజయయాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వర్మ మాట్లాడుతూ ఉయ్యాలా.. జంపాలా అందమైన చిత్రమని, నూతన నటీనటులతో, కొత్త ఒరవడితో నిర్మించిన ఈ సినిమా విజయవంతం అయిందని చెప్పారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం సంతోషం కలిగించందన్నారు. అవికగోర్ మాట్లాడుతూ పల్లెటూరి స్వచ్ఛతను చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నల్లూరి వెంకటేష్, సహాయ నటులు శశాంక్, పీలా గంగాధర్, సహనిర్మాత ప్రసాద్, సురేష్ ఫిలింస్ మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి పాల్గొన్నారు.