ఒకటోసారి రెండోసారి మూడోసారి !
ఏదైనా వేలం పాట నిర్వహిస్తున్నప్పుడు ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటుంటారు. కానీ, ఇక్కడ వేలం పాట కాదు. యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ ముచ్చటగా మూడోసారి జతకడుతున్నారు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరు తాజాగా ‘అంధగాడు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.
నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్ర మిది. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగేలా కథ ఉంటుంది. కథ వినగానే రాజ్ తరుణ్ ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర.