‘స్టార్’ వేరు.. ‘ఆర్టిస్ట్’ వేరు...
స్టార్‌కి అభిమానులుంటారు.
అందరి స్టార్ల అభిమానులూ ‘ఆర్టిస్ట్’కి ఫ్యాన్స్ అవుతారు. అదీ ఆర్టిస్ట్ సత్తా.
మరి.. స్టార్స్ మంచి ఆర్టిస్టులు కాదా అనుకుంటున్నారా?
ఆర్టిస్టులే. కానీ, వాళ్ల ఇమేజ్ ఏ సినిమా పడితే అది చేయనివ్వదు.
ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ‘మా దారి స్పెషల్æదారి’ అంటూ టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు దూసుకెళుతున్నారు. ఈ ఆర్టిస్టులు ‘డిఫరెంట్ స్టార్స్’. నాని, శర్వానంద్, నిఖిల్ వంటి హీరోలు ఈ లిస్టులోకే వస్తారు. ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలకు ఈ ముగ్గురూ
రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు.
నాన్‌స్టాప్ నాని
‘ప్రణతి (ఎన్టీఆర్ వైఫ్)కి ఇష్టమైన సినిమాల్లో ‘పిల్ల జమిందార్’ ఒకటి. తను బలవంతం చేయడంతో ఆ సినిమా చూశా. టీవీలో చాలాసార్లు చూశా. చివరికి ఆ సినిమాతో ప్రేమలో పడ్డా. తెలుగులో ఉన్న అత్యుత్తమ నటుల్లో నాని ఒకరు’ – అని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియోలో ఎన్టీఆర్ అన్నాడు. ‘ఫర్‌ఫార్మెన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చేవారంటే నాకు ఇష్టం. నాని గొప్ప నటుడు మాత్రమే కాదు, ఫర్‌ఫార్మెన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. ‘అష్టా చమ్మా’ నుంచి ‘ఎవడే సుబ్రమణ్యం’ వరకూ ఆల్మోస్ట్ అతని సినిమాలన్నీ చూశా’ – అన్నాడు ‘భలే భలే మగాడి వోయ్’ ఆడియోలో అల్లు అర్జున్. వీళ్లిద్దరితో పాటు సినీ ప్రముఖులు, ప్రేక్షకులూ నానిలో ఇష్టపడేది, గౌరవించేది అతని నటననే. ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు వ్యక్తిగా, ‘ఎవడే సుబ్రమణ్యం’లో స్వార్థపరుడి స్థాయి నుంచి మానవత్వం, జీవితం అంటే ఏంటో తెలుసుకుని ఎదిగే వ్యక్తిగా, ‘జెంటిల్‌మన్’లో హీరోనా? విలనా? అనిపించే పాత్రలో, ‘మజ్ను’లో ప్రేమికుడిగా... భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు నాని. అందుకే ఎన్ని హిట్ సినిమాలొచ్చినా నటుడిగా నానిపై ఎలాంటి ఇమేజ్, స్టాంప్ పడలేదు. ఎప్పుడైనా సినిమాలు ఫెయిల్ అయ్యుండొచ్చు. నటుడిగా నాని ఫెయిల్ కాలేదు. 2017లో ‘నేను లోకల్’ సినిమాతో ముందుకొస్తున్నాడు నాని.
సక్సెస్‌ఫుల్ శర్వానంద్
తొలినాళ్లలో నటుడిగా పేరు తెచ్చిన చిత్రాలు శర్వానంద్ ‘ప్రస్థానం’ లో చాలానే ఉన్నాయి. కానీ, అవేవీ ఆశించిన విజయాలు ఇవ్వలేదు. వినూత్న చిత్రాలు చేస్తాడనే పేరు మాత్రం తెచ్చాయి. హీరోగా తాను కోరుకునే ‘గమ్యం’ చేరుకోవాలన్నా నిర్మాతకు లాభాలు పంచాలన్నా ‘మంచి నటుడు’ అనే పేరు ఒక్కటే చాలదని గ్రహించినట్టున్నాడు. కాస్త కమర్షియల్ హంగులతో ఉన్న కొత్త కథలకు ఓటేశాడు. ఇంకేముంది? హీరోగా శర్వానంద్ సిసలైన పరుగు మొదలైంది. ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’.. ఇలా వరుసగా మూడు హిట్స్. హీరోగా ఎలాంటి పాత్రలోనైనా శర్వా నటించగలడని ఈ చిత్రాలు నిరూపించాయి. ప్రేయసి కోసం తపించే ప్రేమికుడిగా పరిణితితో కూడిన నటన, పక్కింటి కుర్రాడిగా, ఏమీ తెలియని అమాయకుడిగా.. ఇలా ఏదైనా చేయగలడు. ఏ పాత్ర చేసినా... అందులో భావోద్వేగాలు తప్ప, నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ చూపించాలని శర్వా ఎక్కడా ప్రయత్నించడు. అతని ప్రత్యేకత అదే! అతని సినిమాల్లో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. ప్రేక్షకుల్లో శర్వాకి ఉన్న ఈ పేరు స్టార్ స్టేటస్ తెచ్చింది. 2017లో ‘శతమానంనం భవతి’, బీవీయస్‌స్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వా. మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకొన్ని సినిమాలున్నాయి.
నిఖిల్ క్లారిటీ
కుర్రాడు బాగున్నాడు.. స్టైల్‌గా ఉన్నాడు... నటనలో హుషారుంది... డ్యాన్సులు బాగానే చేశాడు... ‘హ్యాపీ డేస్’లో నలుగురు హీరోల్లో ఓ హీరోగా నటించిన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా సోసోగా ఆడినా ‘యువత’తో హిట్ వచ్చింది. నిఖిల్ ఎనర్జీ, యాక్టింగ్ చూసి కొందరు రవితేజతో పోల్చారు. ఇంకేముంది? కెరీర్‌లో ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైమ్‌లో వరుస ఫ్లాపులు పలకరించాయి. అవన్నీ సగటు కమర్షియల్ సినిమాలే. ‘హిట్ కోసం ఎలాంటి సినిమా చేయాలి?’ అని నిఖిల్ డైలమాలో పడ్డాడు. ఆలోచించాడు. ‘నలుగురూ నడిచే కమర్షియల్ దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణిస్తే!’ అనే ఐడియా వచ్చింది. అప్పుడు స్నేహితుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో ‘స్వామి రారా’, ఆ తర్వాత మరో స్నేహితుడు చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ చిత్రాలు చేశాడు. రెండూ హిట్టే. హిట్‌తో పాటు నవతరం ప్రేక్షకుల్లో నిఖిల్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ రెండు హిట్లతో కాన్సెప్ట్ బేస్డ్ కొత్త తరహా సినిమాలే చేయాలని ఫిక్సయ్యాడు. ‘సూర్య వర్సెస్ సూర్య’ అలాంటి సినిమానే. ఇదీ హిట్టే. ఆ తర్వాత మొహమాటం కోసం చేసిన ‘శంకరాభరణం’తో ‘ఎలాంటి సినిమాలు చేయకూడదు?’ అనే విషయంలో నిఖిల్‌కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మళ్లీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో హిట్ దారిలోకి వచ్చేశాడు. నిఖిల్‌పై, అతడి స్టోరీ సెలక్షన్‌పై ప్రేక్షకుల్లో ఎంత నమ్మకముందో చెప్పడా నికి ఈ చిత్రం విడుదలైన పరిస్థితులు, వచ్చిన వసూళ్లే ఉదాహరణ. 2017లో ‘కేశవ’ సినిమాతో రానున్నాడు.
రఫ్ అండ్ టఫ్ రాజ్‌తరుణ్
చెదిరిన క్రాఫు, చూపుల్లో నిర్లక్ష్యం, గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం... ఇలాంటి లక్షణాలున్న కుర్రవాళ్లను ‘రాజ్ తరుణ్’ అనాలేమో. యస్.... వచ్చీ రావడంతోనే ఈ వైజాగ్ కుర్రాడు ‘ఎట్రాక్టింగ్’ చేసేశాడు. యాక్చువల్లీ రాజ్ తరుణ్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు.. యాక్ట్ చేశాడు. ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఛాన్స్ రావడంతో రాజ్ తరుణ్ నటన, గోదావరి యాసతో మాట్లాడే తీరు అతన్ని పాపులర్ చేసేశాయ్. ఈ యువహీరో ప్లస్ పాయింట్స్ ఇవే. అంతే. మెగాఫోన్ పట్టాల్సిన చేతులు ముఖానికి రంగు వేసుకుంటున్నాయ్. డైరెక్షన్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు. హీరోగా ఛాన్స్ వచ్చినప్పుడు అది చేయడమే వివేకం. ఇక్కడే రాజ్‌తరుణ్ తెలివిగా వ్యవహరించాడు. హీరోగా సినిమా మీద సినిమా ఒప్పుకుంటూ బిజీ అయిపోయాడు. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడో రకం ఆడో రకం’.. ఇలా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన రాజ్ తరుణ్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.
బంగారుకొండ విజయ్ దేవరకొండ
చిన్నగా మొదలై పెద్ద రేంజ్‌కి ఎదగడంలో ఓ మజా ఉంటుంది. యువ హీరో విజయ్ దేవరకొండలాంటి వాళ్లకు ఆ మజా తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో తెలుసు. రవిబాబు దర్శకత్వం వహించిన ‘నువ్విలా’, శేఖర్ కమ్ముల చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’లో చిన్న రోల్స్ చేసిన విజయ్ దేవరకొండకు ‘ఎవడే సుబ్రమణ్యం’ మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రంలో నాని స్నేహితుడిగా సినిమాకి కీలకంగా నిలిచే క్యారెక్టర్ చేశాడు. ఎలాంటి పాత్ర చేస్తే యూత్‌కీ, ఫ్యామిలీస్‌కి దగ్గర కాగలుగుతారో ఈ చిత్రంలో అతను చేసిన అల్లరి కుర్రాడు రిషి పాత్ర అలానే ఉంటుంది. చూడచక్కగా ఉండటంతో పాటు బాగా యాక్ట్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఈసారి విజయ్‌కి హీరోగా ఛాన్సొచ్చింది. ఏ ముహూర్తాన ‘పెళ్లి చూపులు’కి ఒప్పుకున్నాడో కానీ ఆ చిత్రం అతనికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. మెల్లిగా రేసులోకి వచ్చేశాడు. ప్రస్తుతం ‘ద్వారకా’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి.
విజన్ ఉన్న శ్రీవిష్ణు
‘రాయల్ రాజు’ గుర్తున్నాడా? అదేనండి ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో శ్రీవిష్ణు చేశాడే ఆ క్యారెక్టర్. అంతుకు ముందు ‘బాణం’, ‘సోలో’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీవిష్ణుకి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత చేసిన ‘సెకండ్ హ్యాండ్’, ‘ప్రతినిధి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు కూడా ఈ యువకుడిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. 2016 ఎండింగ్‌లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ శ్రీవిష్ణుకి 2017ను ఆశావహంగా మార్చింది. ఈ చిత్రం అతనిలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని ప్రూవ్ చేసింది. ఇప్పుడు దూసుకెళుతున్న నవతరం హీరోల్లో శ్రీవిష్ణు ఒకడున్నాడు. ప్రస్తుతం కుమార్ వట్టి దర్శకత్వంలో ప్రకాశ్‌రావు బలగ నిర్మిస్తున్న ‘మా అబ్బాయి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరిన్ని మంచి ఛాన్సులొస్తున్నాయి.
గడచిన పదేళ్లల్లో హీరోలుగా వచ్చిన వాళ్లల్లో నాని, శర్వాంద్, నిఖిల్... ఈ ముగ్గురిదీ ప్రత్యేకమైన స్థానం. వీళ్ల స్పేస్‌లోకి ఎవరూ రాలేరు. కథల సెలక్షన్‌లో వీళ్లకు బోల్డంత గట్స్. ఓ చిన్న ఎగ్జాంపుల్... గత సంక్రాంతికి పెద్ద హీరోల మధ్య శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజైంది. సూపర్ హిట్. ఈ సంక్రాంతికి ‘శతమానం భవతి’ రిలీజ్. తను ఉన్న స్పేస్ మీద శర్వాకి ఎంత నమ్మకమో దీన్నిబట్టి ఊహించవచ్చు.
– ‘సాక్షి’ సినిమా డెస్క్